సత్యజిత్ రే పూర్వీకుల ఇంటి కూల్చివేతపై భారత్ ఆందోళన

సత్యజిత్ రే పూర్వీకుల ఇంటి కూల్చివేతపై భారత్ ఆందోళన
బంగ్గ్లాదేశ్‌ రాజధాని ఢాకాలో ఉన్న ప్రముఖ భారతీయ చలనచిత్ర దర్శకుడు సత్యజిత్‌ రే పూర్వీకుల నివాసాన్ని బంగ్లాదేశ్‌ అధికారులు కొత్త “సెమీ-కాంక్రీట్ నిర్మాణం” కోసం కూలగొడుతున్నందున భారత్ జోక్యం చేసుకోండి.  హోర్కిషేర్‌ రే చౌదరీ రోడ్‌లో ఉన్న శతాబ్ద కాలం నాటి ఈ ఇంటిని సత్యజిత్‌ రే తాత, ప్రముఖ సాహిత్యకారుడు ఉపేంద్ర కిషోర్‌ రే చౌదరి నిర్మించారు.  భారత ప్రభుత్వం మంగళవారం జోక్యం చేసుకుని, ఆ ఆస్తిని మరమ్మత్తు చేసి “సాహిత్య మ్యూజియం”గా పునర్నిర్మించడానికి స్వచ్ఛందంగా ముందుకు వచ్చింది. గతంలో మైమెన్సింగ్ శిశు అకాడమీగా దీనిని ఉపయోగించారు.
న్యూఢిల్లీ, ఢాకా జోక్యాన్ని కోరుతూ, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మంగళవారం ఎక్స్ లో మాట్లాడుతూ, “బంగ్లాదేశ్‌లోని మైమెన్‌సింగ్ నగరంలోని ప్రఖ్యాత రచయిత-సంపాదకుడు ఉపేంద్రకిషోర్ రాయ్‌చౌదరి జ్ఞాపకాలతో ముడిపడి ఉన్న పూర్వీకుల ఇంటిని కూల్చివేస్తున్నట్లు మీడియా నివేదికల నుండి తెలుసుకున్నాను. కూల్చివేత ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైందని నివేదికలు చెబుతున్నాయి. ఇది హృదయ విదారకమైన వార్త” అంటూ విచారం వ్యక్తం చేశారు.
 
“బెంగాల్ సంస్కృతికి రే కుటుంబం ప్రముఖ మార్గదర్శి. బెంగాల్ పునరుజ్జీవనోద్యమ స్తంభాలలో ఉపేంద్ర కిషోర్ ఒకరు. ఈ ఇల్లు బెంగాల్ సాంస్కృతిక చరిత్రతో విడదీయరాని విధంగా ముడిపడి ఉందని నేను భావిస్తున్నాను. ఈ గొప్ప సంప్రదాయ భవనాన్ని కాపాడుకోవాలని బంగ్లాదేశ్ ప్రభుత్వానికి, ఆ దేశంలోని అన్ని సరైన ఆలోచనాపరులకు నేను విజ్ఞప్తి చేస్తున్నాను. భారత ప్రభుత్వం కూడా జోక్యం చేసుకోవాలి” అని ఆమె పేర్కొన్నారు. 
 
బంగ్లాదేశ్ పురావస్తు శాఖ ప్రకారం, ఢాకాకు ఉత్తరాన 120 కి.మీ దూరంలో ఉన్న ఈ ఇంటిని ఒక శతాబ్దం క్రితం ఉపేంద్ర కిషోర్ నిర్మించారు. 1947 విభజన తర్వాత, ఈ ఆస్తి ప్రభుత్వ యాజమాన్యంలోకి వచ్చింది. 1989లో మైమెన్సింగ్ శిశు అకాడమీగా తిరిగి ఉపయోగించారు. బంగ్లాదేశ్‌లోని ఒక స్థానిక అధికారి డైలీ స్టార్‌తో మాట్లాడుతూ, కూల్చివేత “సరైన విధానాలు”, “అవసరమైన ఆమోదాలు” ప్రకారం జరుగుతోందని చెప్పారు.
 
అకాడమీ కార్యకలాపాలను ప్రారంభించడానికి అనేక గదులతో కూడిన సెమీ-కాంక్రీట్ భవనం నిర్మించబడుతుందని ఆయన తెలిపారు. 36 దశాంశాల స్థలంలో ఉన్న ఇంత చారిత్రాత్మకంగా ముఖ్యమైన భవనాన్ని ఎందుకు కూల్చివేస్తున్నారని అడిగినప్పుడు, ఆ భవనం పిల్లలు ఆ ప్రాంగణంలో గుమిగూడినప్పుడు వారికి తీవ్రమైన ప్రమాదాన్ని కలిగిస్తుందని అధికారి చెప్పారని నివేదిక పేర్కొంది.
 

మమతా బెనర్జీ వ్యక్తం చేసిన ఆందోళనలకు ప్రతిస్పందిస్తూ, భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ కూల్చివేతను పునఃపరిశీలించి, ఆస్తి పునరుద్ధరణకు ఎంపికలను అన్వేషించాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతూ ఒక ప్రకటన విడుదల చేసింది. బెంగాల్ పునరుజ్జీవనోద్యమానికి, భారతదేశం- బంగ్లాదేశ్ ల మధ్య ఉమ్మడి సాంస్కృతిక చరిత్రకు సంబంధించిన ఒక మైలురాయిగా భవనం చారిత్రక ప్రాముఖ్యత దీనిని సంరక్షించడానికి ఒక ముఖ్యమైన ప్రదేశంగా మారుస్తుందని స్పష్టం చేసింది. కూల్చివేతపై ప్రభుత్వం విచారం వ్యక్తం చేసింది. ఆస్తిని మరమ్మతు చేయడం, సాహిత్య మ్యూజియంగా మార్చడంలో బంగ్లాదేశ్‌కు సహాయం చేయడానికి సిద్ధంగా ఉందని ధృవీకరించింది.

భారత విదేశాంగ శాఖ ఇలా చెప్పింది: “బంగ్లాదేశ్‌లోని మైమెన్సింగ్‌లో ఉన్న ప్రముఖ చిత్రనిర్మాత, సాహిత్యకారుడు సత్యజిత్ రే పూర్వీకుల ఆస్తిని కూల్చివేస్తున్నారని మేము తీవ్ర విచారంతో గమనించాము. ప్రస్తుతం బంగ్లాదేశ్ ప్రభుత్వం ఆధీనంలో ఉన్న ఈ ఆస్తి శిథిలావస్థకు చేరుకుంది. బంగ్లా సాంస్కృతిక పునరుజ్జీవనానికి ప్రతీకగా ఉన్న ఈ భవనం మైలురాయి హోదాను దృష్టిలో ఉంచుకుని, కూల్చివేతను పునఃపరిశీలించి, సాహిత్య మ్యూజియంగా, భారతదేశం- బంగ్లాదేశ్ ల ఉమ్మడి సంస్కృతికి చిహ్నంగా దాని మరమ్మత్తు, పునర్నిర్మాణానికి భారత ప్రభుత్వం సహకారాన్ని అందించడానికి సిద్ధంగా ఉంటుంది” అని తెలిపింది.