చైనాపై అమెరికా భారీ సుంకాలు భారత్‌‌కు మంచిదే

చైనాపై అమెరికా భారీ సుంకాలు భారత్‌‌కు మంచిదే

చైనా, కెనడా, మెక్సికో వంటి దేశాలపై ట్రంప్ సర్కారు భారీ సుంకాలను ప్రకటించినందున అమెరికాకు భారత ఎగుమతుల్లో మరింత పోటీతత్వం పెరుగుతుందని నీతి ఆయోగ్ వెల్లడించింది. అమెరికాకు భారత్ ఎగుమతులపై సరికొత్త విషయాలతో ‘ట్రేడ్ వాచ్ క్వార్టర్లీ’ మూడో సంచికను నీతి ఆయోగ్ సోమవారం విడుదల చేసింది.  ప్రత్యేకించి ‘హెచ్ఎస్‌- 2’ లెవల్‌లోని దాదాపు 99 కేటగిరీల ఉత్పత్తుల ఎగుమతిలో ఇతర దేశాలను భారత్ దాటేస్తుందని నీతి ఆయోగ్ అంచనా వేసింది.

‘హెచ్ఎస్‌ – 2’ లెవల్‌లోని టాప్ 30 కేటగిరీలకుగానూ 22 కేటగిరీల ఉత్పత్తుల ఎగుమతుల్లో భారత్ పైచేయిని సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేసింది. ఈ 22 కేటగిరీల ఉత్పత్తుల ఎగుమతి మార్కెట్ విలువ దాదాపు 2,285.2 బిలియన్ డాలర్లు ఉందని తెలిపింది.  ఇప్పటివరకు ఈ విభాగాల్లో అతిపెద్ద ఎగుమతిదార్లుగా ఉన్న చైనా, కెనడా, మెక్సికోలను భారత్ దాటేస్తుందని ‘ట్రేడ్ వాచ్ క్వార్టర్లీ’ సంచికలో నీతి ఆయోగ్ ప్రస్తావించింది.

ప్రస్తుతం చైనాపై 30 శాతం, కెనడాపై 35 శాతం, మెక్సికోపై 25 శాతం మేర దిగుమతి సుంకాలను అమెరికా విధిస్తున్న విషయాన్ని గుర్తు చేసింది. ఈ దేశాలపై దిగుమతి సుంకాల భారం పెరగడం భారత ఎగుమతులకు కలిసొస్తుందని పేర్కొంది. ఈ అవకాశాన్ని అందిపుచ్చుకొని ఖనిజాలు, ఇంధనాలు, దుస్తులు, ఎలక్ట్రానిక్ ఉపకరణాలు, ఫర్నీచర్, సీ ఫుడ్‌లతో కూడిన 1,265 బిలియన్ డాలర్ల అమెరికా మార్కెట్‌‌పైనా భారత్ ఫోకస్ పెట్టిందని నీతి ఆయోగ్ వెల్లడించింది.

‘హెచ్ఎస్‌-2’ లెవల్‌లోని టాప్ 30 ఉత్పత్తుల కేటగిరీలకుగానూ 6 ఉత్పత్తుల ఎగుమతుల్లో భారత్ ఆధిపత్యం మునుపటిలాగే కొనసాగుతోంది. అమెరికాకు వివిధ దేశాల నుంచి జరుగుతున్న ఆ 6 కేటగిరీల ఉత్పత్తుల ఎగుమతుల్లో 32.8 శాతం వాటా భారత్‌దే. ఈ కేటగిరీల ఉత్పత్తులకు సంబంధించి అమెరికా చేసుకుంటున్న దిగుమతుల్లో 26 శాతం వాటా భారత్‌దే. 

వీటి మార్కెట్ విలువ దాదాపు 26.5 బిలియన్ డాలర్లు ఉంటుందని ‘ట్రేడ్ వాచ్ క్వార్టర్లీ’ సంచికలో పొందుపరిచారు. హెచ్ఎస్-2 లెవల్‌లోని 6 ఉత్పత్తుల కేటగిరీలపై అమెరికా సగటున 1 నుంచి 3 శాతం మేర అదనపు దిగుమతి సుంకాలను విధిస్తోంది. దీనిపై అమెరికాతో చర్చించి కొంతమేర తగ్గించుకోవచ్చని నీతి ఆయోగ్ అభిప్రాయపడింది.

అమెరికాకు భారత్ చేస్తున్న ఎగుమతుల్లో 78 ఉత్పత్తులదే 52 శాతం వాటా. వీటి ఎగుమతుల్లో రాబోయే రోజుల్లో తప్పక దేశానికి పైచేయి లభించొచ్చని నీతి ఆయోగ్ అంచనా వేసింది. హెచ్‌ఎస్-4 లెవల్‌లోని టాప్ 100 ఉత్పత్తులకుగానూ 17 ఉత్పత్తుల ఎగుమతుల్లో భారత్ ఆధిపత్యం కొనసాగుతోందని వెల్లడించింది. వీటిపై అమెరికా విధించే దిగుమతి సుంకాలు మారకపోవడంతో, ఎగుమతులు నిరాటంకంగా కొనసాగుతున్నట్లు తెలిపింది. 

అమెరికాకు భారత్ చేస్తున్న ఎగుమతుల్లో 28 శాతం వాటా ఈ 17 ఉత్పత్తులదేనని గుర్తు చేసింది. కాగా, విదేశాల నుంచి దిగుమతి చేసుకునే వస్తువులు, ఉత్పత్తులకు అమెరికా ‘హెచ్ఎస్’ కోడింగ్ ఇస్తుంది. ఇందులో మొత్తం 10 అంకెలు ఉంటాయి. అది ఏ వస్తువు, ఏ కేటగిరీకి చెందింది, సుంకం ఎంత, నియంత్రణపరమైన నిబంధనలు ఏమిటి అనే సమస్త సమాచారాన్ని సూచించేలా కోడింగ్‌లో వరుస క్రమంలో అంకెలు ఉంటాయి. పైన వార్తలో ప్రస్తావించిన హెచ్ఎస్-2, హెచ్ఎస్-4 ఉత్పత్తుల కేటగిరీలు ఈ కోవకు చెందినవే.