50 రోజుల్లో యుద్ధం ఆపకపోతే 100 శాతం సుంకాలు!

50 రోజుల్లో యుద్ధం ఆపకపోతే 100 శాతం సుంకాలు!
విరామం లేకుండా గత మూడేండ్ల నుంచి ఉక్రెయిన్‌పై రష్యా కొనసాగిస్తున్న యుద్ధంపై అమెరికా అధినేత డొనాల్డ్‌ ట్రంప్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. 50 రోజుల్లో ఉక్రెయిన్​తో ఒప్పందం చేసుకుని అధ్యక్షుడు పుతిన్‌ యుద్ధాన్ని ఆపకపోతే100 శాతం సుంకాలతో శిక్షిస్తానని హెచ్చరించారు. అయితే ఈ సుంకాల అమలు ఎలా ఉంటుందనే వివరాలు మాత్రం ఆయన చెప్పలేదు.

`50 రోజుల్లో ఒప్పందం కుదరకపోతే.. మేము సెకండరీ టారిఫ్‌లను అమలు చేయబోతున్నాం.అవి 100 శాతం ఉంటాయి’ అని తెలిపారు.  నాటో సెక్రటరీ జనరల్ మార్క్​ రుట్టేతో ట్రంప్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్​పై ట్రంప్ ఘాటు వ్యాఖ్యలు చేశారు.  పుతిన్ పగలు చాలా అందంగా మాట్లాడతారని, కానీ రాత్రైతే బాంబులు కురిపిస్తారని మండిపడ్డారు. అసలు పుతిన్ ప్రవర్తన తనకు ఏమాత్రం నచ్చట్లేదని ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

యుద్ధం విషయంలో ట్రంప్‌ విధానం మారే అవకాశం ఉందనే ఊహాగానాలు వస్తున్న వేళ, ఆయన ప్రత్యేక దూతగా విశ్రాంత లెఫ్టినెంట్‌ జనరల్‌ కీత్‌ కెల్లోగ్‌, ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీతో సమావేశమయ్యారు.  ఈ భేటీలో తమ గగనతల వ్యవస్థల్ని బలోపేతం చేయడం, సంయుక్త ఆయుధాల ఉత్పత్తి, అమెరికా నుంచి ఆయుధాల కొనుగోలు, రష్యాపై అంతర్జాతీయ ఆంక్షల్ని మరింత కఠినతరం చేయడానికి ఉన్న అవకాశాలు, తదితర అంశాలపై ఫలప్రదంగా చర్చలు సాగినట్లు జెలెన్‌స్కీ వెల్లడించారు.

మరోవైపు రష్యాకు సాయం చేసే దేశాలపై 500 శాతం టారిఫ్‌లు విధించేలా బిల్లును రూపొందించినట్లు రిపబ్లికన్‌ సెనెటర్‌ లిండ్సే గ్రాహమ్‌ తెలిపారు. ఉక్రెయిన్‌కు మరిన్ని ఆయుధాలు అందించేందుకు ట్రంప్‌ అంగీకరించారని, రికార్డు స్థాయిలో ఆయుధాలతో పాటు, పేట్రియాట్‌ గగనతల రక్షణ వ్యవస్థను కీవ్‌కు పంపించనున్నారని గ్రాహమ్‌ వెల్లడించారు.

అందుకే రష్యా క్షిపణి దాడులను ఎదుర్కోవడానికి ఉక్రెయిన్‌కు శక్తివంతమైన పేట్రియాట్‌ గగనతల రక్షణ వ్యవస్థను అందజేస్తామని అంతకు ముందు ట్రంప్ ప్రకటించారు. వీటి ఖర్చు యూరోపియన్‌ యూనియన్‌ భరిస్తుందని చెప్పారు.