అంతరిక్ష యాత్రను దిగ్విజయంగా పూర్తి చేసుకుని భారత కీర్తి పతాకాన్ని సమున్నతంగా ఎగరేసిన మన ముద్దుబిడ్డ శుభాంశు శుక్లా భూమికి తిరిగొచ్చాడు. శుక్లాతో పాటు మరో ముగ్గురు వ్యోమగాములతో ఐఎస్ఎస్ నుంచి బయల్దేరిన క్రూ డ్రాగన్ సి213 ‘గ్రేస్’ క్యాప్సూల్ మంగళవారం మధ్యాహ్నం 3.01 గంటలకు కాలిఫోర్నియా తీరంలో సురక్షితంగా దిగింది.
జూన్ 26, 2025న భారత వైమానిక దళ టెస్ట్ పైలట్ గ్రూప్ కెప్టెన్ శుభాంశు శుక్లా ఐఎస్ఎస్(అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం)లో అడుగుపెట్టి చరిత్ర సృష్టించాడు. 39 ఏళ్ల వయసున్న శుక్లా ఐఎస్ఎస్ కు వెళ్లిన తొలి భారతీయుడిగా, 634వ వ్యోమగామిగా ఘనత పొందారు. మరో ప్రత్యేకత ఏంటంటే 41 ఏళ్ల తర్వాత అంతరిక్షంలోకి వెళ్లిన మొదటి భారతీయుడూ ఆయనే. రాకేశ్ శర్మ తర్వాత అంతరిక్ష యాత్రలో పాల్గొన్న రెండో భారతీయుడిగా శుక్లా రికార్డుకెక్కారు.
దాదాపు 18 రోజులపాటూ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో గడిపిన శుభాన్షు బృందం గ్రూప్ కెప్టెన్ శుభాన్షు డ్రాగన్ క్యాప్సూల్ నుంచి బయటకు వచ్చారు. ఇందుకు సంబంధించిన తొలి ఫొటో బయటకు వచ్చింది. వ్యోమగాములు సురక్షితంగా భూమికి చేరడంతో యాక్సియమ్-4 మిషన్ విజయవంతమైంది. ఇక భూమికి చేరుకున్న వ్యోమగాములు ఏడు రోజుల పాటూ క్వారంటైన్‌లో ఉండనున్నారు. ఇస్రోకు చెందిన ఫ్లైట్ సర్జన్లు వారం రోజుల పాటూ వ్యోమగాముల ఆరోగ్యం, ఫిట్‌నెస్‌ను నిరంతరం పర్యవేక్షిస్తారు.
కాగా, అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుండి భూమికి తిరిగి వచ్చిన శుభాన్షు శుక్లాను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వాగతించారు, ఈ ఘనత సాధించిన ఏకైక భారతీయుడు ఆయనే అని ఆయన కొనియాడారు.శుక్లా అంకితభావం, మార్గదర్శక స్ఫూర్తి బిలియన్ల కలలను ప్రేరేపించాయని, ఆక్సియం-4లో భాగంగా శుక్లా ప్రయాణం భారతదేశపు “మానవ అంతరిక్ష విమాన మిషన్, గగన్‌యాన్” సాధించడంలో ఒక మైలురాయిని సూచిస్తుందని ప్రధాని మోదీ తెలిపారు.
“గ్రూప్ కెప్టెన్ శుభాన్షు శుక్లా తన చారిత్రాత్మక అంతరిక్ష మిషన్ నుండి భూమికి తిరిగి వస్తున్నందుకు నేను దేశంతో కలిసి స్వాగతం పలుకుతున్నాను. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రాన్ని సందర్శించిన భారతదేశపు మొట్టమొదటి వ్యోమగామిగా, ఆయన తన అంకితభావం, ధైర్యం, మార్గదర్శక స్ఫూర్తి ద్వారా బిలియన్ల కలలను ప్రేరేపించారు. ఇది మన స్వంత మానవ అంతరిక్ష విమాన మిషన్ – గగన్‌యాన్ వైపు మరో మైలురాయిని సూచిస్తుంది” అని ఆయన ఎక్స్ లో ఒక పోస్ట్‌లో రాశారు.
More Stories
నేపాల్ తాత్కాలిక ప్రధానిగా సుశీల కర్కిని ఒప్పించిన ఆర్మీ చీఫ్
పాక్, స్విట్జర్లాండ్లకు భారత్ హెచ్చరిక
ఉక్రెయిన్ యుద్ధంలో రష్యా డ్రోన్లు కూల్చేసిన పోలాండ్