
భావ ప్రకటన స్వేచ్ఛకు ఎలాంటి భంగం కలిగించకుండానే, ద్వేషపూరిత ప్రసంగాలను నియంత్రించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను సుప్రీంకోర్టు నిర్దేశించింది. సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్ శర్మిష్ఠ పనోలిపై వజాహత్ ఖాన్ దాఖలు చేసిన పిటిషన్పై విచారణ చేస్తూ సర్వోన్నత న్యాయస్థానం ‘ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్’ గురించి కీలక వ్యాఖ్యలు చేసింది. ద్వేషపూరిత ప్రసంగాన్ని “భావ ప్రకటన స్వేచ్ఛ”గా భావిస్తుండడం విచారకరమని జస్టిస్ బీవీ నాగరత్న, జస్టిస్ కేవీ విశ్వనాథన్ ద్విసభ్య ధర్మాసనం పేర్కొంది. వాక్ స్వాతంత్య్రం విలువ గురించి రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించింది.
“ప్రజలు ద్వేషపూరిత ప్రసంగాలను ఎందుకు అసభ్యకరమైనవిగా, అనవసర ప్రసంగాలుగా భావించడం లేదు? వాస్తవానికి కంటెంట్పై కొంత నియంత్రణ ఉండాలి. ప్రజలు కూడా ద్వేషపూరిత ప్రసంగాలను షేర్ చేయడం, లైక్ చేయడం లాంటివి చేయకుండా తమను తాము నియంత్రించుకోవాలి” అని సర్వోన్నత న్యాయస్థానం పేర్కొంది. మరోవంక, కార్టూనిస్ట్ హేమంత్ మాల్వియ దాఖలు చేసిన పిటిషన్‌ను విచారిస్తున్న సుప్రీంకోర్టు వాక్ స్వేచ్ఛ, భావ ప్రకటనా స్వేచ్ఛ హక్కులను “దుర్వినియోగం” చేస్తున్నారని వ్యాఖ్యానించింది.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఆర్ఎస్ఎస్ కార్యకర్తలతో కూడిన అభ్యంతరకరమైన కార్టూన్‌లను సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో షేర్ చేసినట్లు మాల్వియపై ఆరోపణలు ఉన్నాయి. విచారణ సందర్భంగా, న్యాయమూర్తులు సుధాంషు ధులియా, అరవింద్ కుమార్‌లతో కూడిన ధర్మాసనం అటువంటి పోస్ట్‌ల వెనుక ఉన్న ఉద్దేశ్యాన్ని ప్రశ్నించింది. “మీరు ఇదంతా ఎందుకు చేస్తారు?” అని బెంచ్ మాల్వియ న్యాయవాదిని ప్రశ్నించింది, ఆన్‌లైన్‌లో షేర్ చేయబడిన కంటెంట్ స్వభావంపై ఆందోళనను సూచిస్తుంది.
వాక్ స్వేచ్ఛ, వ్యక్తీకరణ హక్కుకు సంబంధించిన మార్గదర్శకాలను రూపొందించడంపై చర్చించేటప్పుడు పౌరులలో సోదరభావం అవసరాన్ని కూడా అత్యున్నత న్యాయస్థానం నొక్కి చెప్పింది. తన వైఖరిని స్పష్టం చేస్తూ, కోర్టు సెన్సార్‌షిప్ కోసం వాదించడం లేదని, వ్యక్తులు తమ వ్యక్తీకరణలలో స్వీయ నియంత్రణ, బాధ్యతాయుతమైన నియంత్రణను పాటించమని ప్రోత్సహిస్తున్నట్లు పేర్కొంది.
కాగా, సోషల్ మీడియాలో ద్వేషపూరిత, మత విద్వేషాలను రెచ్చగొట్టే కంటెంట్ను పోస్ట్ చేశారనే ఆరోపణలపై వజాహత్ ఖాన్పై వివిధ రాష్ట్రాల్లో కేసులు నమోదు అయ్యాయి. అయితే అంతకంటే ముందే, అతను ఒక ఎఫ్ఐఆర్లో పోలీసు కస్టడీలో ఉన్నట్లు, మరొక ఎఫ్ఐఆర్లో జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నట్లు ఉంది. ఈ రెండూ పశ్చిమ బెంగాల్లోనే నమోదు కావడం గమనార్హం. తరువాత ఆ రాష్ట్రం వెలుపల నమోదైన ఓ కేసులో వజాహత్ ఖాన్ను అదుపులోకి తీసుకున్నారు. అయితే ఆ అరెస్టును సుప్రీంకోర్టు నిలిపివేసింది.
ఈ నేపథ్యంలో వజాహత్ ఖాన్ తనపై దాఖలైన అన్ని కేసులను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ వేశాడు. వాజాహత్ ఖాన్ గతంలో తాను చేసిన ట్వీట్లకు క్షమాపణలు చెప్పినట్లు ఆయన తరఫు న్యాయవాది ధర్మాసనానికి తెలియజేశారు. ఈ కేసు విచారణ సందర్భంగా, ద్వేషపూరిత ప్రసంగాలను, పోస్టులను నియంత్రించే మార్గాలను సూచించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను, వజాహత్ ఖాన్ తరఫున హాజరైన న్యాయవాదిని సర్వోన్నత న్యాయస్థానం కోరింది.
అంతేకాదు వజాహత్ ఖాన్కు ఉపశమనం కల్పిస్తూ, ‘ఒక వ్యక్తిపై పలు ఎఫ్ఐఆర్లు నమోదు చేసి, అతనిని జైలులో పెట్టడం వల్ల ప్రయోజనం ఏమిటి?’ అని ప్రశ్నించింది. ఈ కేసుపై జూన్ 24న చేసిన విచారణ సందర్భంగా, సుప్రీంకోర్టు న్యాయమూర్తులు విశ్వనాథన్, ఎన్. కోటీశ్వర్ సింగ్లతో కూడిన ధర్మాసనం కేంద్రంతో సహా అసోం, ఢిల్లీ, హరియాణా, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలకు నోటీసులు జారీ చేసింది. వివిధ రాష్ట్రాల్లో తనపై నమోదైన ఎఫ్ఐఆర్లను ఏకీకృతం చేయాలని కోరుతూ వజాహత్ ఖాన్ చేసిన పిటిషన్పై స్పందించాలని కోరింది.
More Stories
తిరిగి రాజరికం వైపు నేపాల్ చూస్తున్నదా?
దేశభక్తి, దైవభక్తి పదాలు భిన్నమైనా వేర్వేరు కాదు
ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ వోటింగ్ తో ఆత్మరక్షణలో ప్రతిపక్షాలు