హైకోర్టు కొత్త సీజేగా జస్టిస్ అపరేష్ కుమార్‌ సింగ్

హైకోర్టు కొత్త సీజేగా జస్టిస్ అపరేష్ కుమార్‌ సింగ్
* 9 హైకోర్టులకు నూతన ప్రధాన న్యాయమూర్తులు
తెలంగాణ హైకోర్టు కొత్త సీజేగా జస్టిస్ అపరేష్ కుమార్‌ సింగ్ నియమితులయ్యారు. ఈ మేరకు కొలీజియం సిఫార్సును రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదించారు. ఇంతకు ముందు త్రిపుర హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ అపరేష్ కుమార్ పనిచేశారు.  ఇక ప్రస్తుత తెలంగాణ హైకోర్టు తాత్కాలిక చీఫ్ జస్టిస్‌గా ఉన్న సుజయ్ పాల్‌ను కలకత్తా హైకోర్టుకు బదిలీ చేస్తూ కొలిజియం సిఫార్సు చేసింది.

తెలంగాణ హైకోర్టు సీజేగా నియమితు లైన అపరేష్ కుమార్ సింగ్ (ఏకే సింగ్) 1965, జూలై 7న జన్మించారు. ఢిల్లీ విశ్వవిద్యాలయం నుంచి ఎల్‌ఎల్‌బీ పట్టా పొందారు. అనంతరం 1990 నుంచి 2000 వరకూ ఉత్తర్ ప్రదేశ్ హైకోర్టులో న్యాయవాదిగా పనిచేశారు. ఆ తర్వాత 2001లో జార్ఖండ్ హైకోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేశారు. 2012, జనవరి 24న జార్ఖండ్ హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా నియమితులయ్యారు.

2021 ఏప్రిల్ నుంచి జార్ఖండ్ రాష్ట్ర న్యాయ సేవల అథారిటీ ఎగ్జిక్యూటివ్‌ చైర్మన్‌గా అపరేష్ కుమార్ నియమితులయ్యారు. ఇక 2022 నుంచి 2023 వరకూ జార్ఖండ్ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా పనిచేశారు. 2023, ఏప్రిల్ 17న త్రిపుర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా అపరేష్ కుమార్ సింగ్ పదోన్నతి సాధించారు. కాగా, తాజాగా తెలంగాణ హైకోర్టు సీజేగా నియమితులయ్యారు.

కాగా, దేశంలోని 5 రాష్ట్రాలకు సిజెల నియామకం, నాలుగు రాష్ట్రాలకు సిజెల బదిలీలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదముద్ర వేశారు. జస్టిస్‌ మనింద్ర మోహన్‌ శ్రీవాస్తవను రాజస్థాన్‌ నుంచి మద్రాస్‌ హైకోర్టుకు, జస్టిస్‌ అపరేష్‌ కుమార్‌ సింగ్‌ను త్రిపుర నుంచి తెలంగాణ హైకోర్టుకు, జస్టిస్‌ ఎంఎస్‌ రామచంద్రరావును ఝార్ఖండ్‌ నుంచి త్రిపుర, జస్టిస్‌ కెఆర్‌ శ్రీరామ్‌ను మద్రాస్‌ నుంచి రాజస్థాన్‌కు బదిలీ అయ్యారు. 

అలాగే మధ్యప్రదేశ్‌ యాక్టింగ్‌ సిజెగా ఉన్న జస్టిస్‌ సంజీవ్‌ సచ్‌ దేవ్‌ ఆ రాష్ట్రానికి సిజెగా, ఢిల్లీ హైకోర్టు జడ్జ్‌గా జస్టిస్‌ విభు బక్రూను కర్ణాటక సిజెగా, పాట్నా హైకోర్టు యాక్టింగ్‌ సిజె జస్టిస్‌ అశుతోష్‌ కుమార్‌ను గౌహతి సిజెగా, పాట్నా జడ్జ్‌ జస్టిస్‌ విపుల్‌ మనుభారు పంటోలిని పాట్నా సిజెగా, హిమాచల్‌ప్రదేశ్‌ జడ్జ్‌ జస్టిస్‌ టిఎస్‌ చౌహాన్‌ను ఝార్ఖండ్‌ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 

మరోవంక, ఎపి హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్‌ బట్టు దేవానంద్‌ నియమితులయ్యారు. ఈ మేరకు సోమవారం కేంద్ర న్యాయ మంత్రిత్వశాఖ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం ఆయన మద్రాస్‌ హైకోర్టు జడ్జిగా ఉన్నారు.  జస్టిస్‌ బట్టు దేవానంద్‌ గతంలోనూ రాష్ట్ర హైకోర్టు జడ్జిగా పని చేశారు. తెలంగాణ హైకోర్టు నుండి జస్టిస్‌ తడకమల్ల వినోద్‌ కుమార్‌ను మద్రాస్‌ హైకోర్టుకు బదిలీ చేశారు.