మలక్‌పేట్‌లో దుండగుల కాల్పుల్లో సీపీఐ నేత మృతి

మలక్‌పేట్‌లో దుండగుల కాల్పుల్లో సీపీఐ నేత మృతి

హైదరాబాద్‌ మలక్‌పేట్‌లో ఉదయాన్నే కాల్పుల కలకలం సృష్టించింది. సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు చందునాయక్‌ (47)పై దుండగులు కాల్పులు జరపడంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందాడు. శాలివాహననగర్ లోని పార్కు వద్ద ఉదయం ఏడున్నర గంటల సమయంలో చందూనాయక్ పై దుండగులు కారులో వచ్చి కంట్లో కారం చల్లి 3 రౌండ్లు కాల్పులు జరిపారు. 

భార్య, కుమార్తె ముందే దుండగులు కాల్పులు జరిపారు. తీవ్ర రక్తస్రావంతో చందునాయక్ ఘటనాస్థలంలోనే ప్రాణాలు విడిచాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ జరుపుతున్నారు. క్లూస్ టీంలు ఆధారాలు సేకరిస్తున్నాయి. చందునాయక్ స్వస్థలం నాగర్ కర్నూల్ జిల్లా బల్మూరు మండలం నర్సాయిపల్లి. మలక్‌పేట శాలివాహనగర్‌లో నివాసం ఉంటున్నారు.

ఘటనా స్థలానికి సౌత్‌ ఈస్ట్‌ డీసీపీ చైతన్యకుమార్ చేరుకుని కాల్పుల జరిగిన తీరును పరిశీలించారు. క్లూస్ టీం బృందం సంఘటన జరిగిన ప్రాంతానికి చేరుకుని ఆధారాలు సేకరించింది. ఘటనా స్థలంలో 5 బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నారు.కాల్పులు ఒకే తుపాకితో దుండగులు జరిపినట్లు డీసీపీ చైతన్యకుమార్ తెలిపారు. సీసీ కెమెరాల్లో నిక్షిప్తమైన దృశ్యాలను పరిశీలిస్తున్నట్లు అయన చెప్పారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. 

ఈ హత్య వెనుక దేవరుప్పలకు చెందిన సీపీఐ (ఎంఎల్) నాయకుడు రాజేశ్ హస్తం ఉండవచ్చని ఆమె అనుమానం వ్యక్తం చేశారు. భూతగాదాలే ఈ హత్యకు ప్రధాన కారణమని పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు. గతంలో చందునాయక్ ఒక హత్యా కేసులో నిందితుడిగా ఉన్నారు. పాతకక్షల కోణంలో చందునాయక్ హత్య జరిగిందని పోలీసులు భావిస్తున్నారు. ప్రాణహాని ఉందని చందునాయక్ నుంచి ఎలాంటి ఫిర్యాదు వారికి అందలేదని పేర్కొన్నారు.

కాగా, ఎల్బీనగర్ ఎస్‌వోటీ పోలీసుల ఎదుట కాల్పులు జరిపిన రాజేష్, సుధాకర్ తో పాటు మరో ఇద్దరు లొంగిపోయినట్లు సమాచారం. హత్యకు ఉపయోగించిన షిఫ్ట్‌ కారును సీజ్‌ చేసినట్లు తెలుస్తోంది.