కుటుంబ పరిపాలనకు ముగింపుకు బిజెపి రావాల్సిందే

కుటుంబ పరిపాలనకు ముగింపుకు బిజెపి రావాల్సిందే

నల్లగొండ జిల్లాలో కుటుంబ పరిపాలనకు ముగింపు పలకాలంటే బిజెపి అధికారంలోకి రావాల్సిందే పార్టీ రాష్ట్ర అధ్యక్షులు ఎన్ రామచందర్ రావు స్పష్టం చేశారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షునిగా మొదటగా నల్గొండ జిల్లాలో రెండు రోజులపాటు పర్యటిస్తూ ఉద్యమాల గడ్డ అయినా నల్గొండ జిల్లా రాజకీయ చైతన్యంతో అనేక ప్రజా ఉద్యమాలకు నంది పలికిందని గుర్తు చేశారు.

అయితే ఈ జిల్లా ఇప్పుడు ఒక కుటుంబ పాలనలో ఉందని, ఈ జిల్లాను ఒక కుటుంబానికి చెందిన సోదరులు నడుపుతున్నారని విచారం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ కుటుంబం చేతిలో బానిసగా ఉందన్నీ, ఆ పార్టీకి బానిసగా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నాడని ఎద్దేవా చేశారు. రాబోయే రోజుల్లో దక్షిణ భారతదేశానికి ముఖద్వారం తెలంగాణ అవుతుందని చెబుతూ ఇక్కడ కూడా బిజెపి ప్రభుత్వం వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

తుంగతుర్తిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రేషన్ ఇదే రోజునకార్డులు పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటున్నారని పేర్కొంటూ రేషన్ కార్డులు రాష్ట్రవ్యాప్తంగా అర్హులైన వారికి అందించాలని డిమాండ్ చేశారు. దళారీ వ్యవస్థ ద్వారా రేషన్ పంపిణీ చేస్తే పేదలకు వాటి ప్రయోజనం అందదని స్పష్టం చేశారు. గత బీఆర్ఎస్ పాలనలో ఒక్క కొత్త రేషన్ కార్డు కూడా ఇవ్వలేదని పేర్కొంటూ అలాంటి పరిస్థితిలో సంక్షేమ పథకాలు ఎవరికీ వర్తించవని తెలిపారు.

ఇప్పుడు కాంగ్రెస్ పాలనలో కొత్త రేషన్ కార్డులు కేవలం కాంగ్రెస్ కార్యకర్తలకే ఇస్తున్నారని తెలుస్తోందని, పేదలకు ఇవ్వడం లేదని రామచంద్రరావు విమర్సించారు.  రాష్ట్ర ప్రభుత్వం రేషన్ కార్డులు అసలైన అర్హులకు ఇవ్వకుండా, కేవలం కాంగ్రెస్ కార్యకర్తలకే ఇస్తే బిజెపి ఆధ్వర్యంలో ప్రజల తరఫున ఉద్యమించి పోరాడుతుందని ఆయన హెచ్చరించారు. రాబోయే రోజుల్లో బిజెపి పోరాటాల బాటలో సాగుతుందని తెలిపారు.

ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ 6 హామీలతో పాటు అనేక వాగ్దానాలు చేసిందని గుర్తు చేస్తూ రైతులకు ఇచ్చిన హామీలు అమలు చేయలేదని, విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ రావడం లేదని, నిరుద్యోగులకు భృతి లేదని, ఉద్యోగులకు జీతాలు సకాలంలో ఇవ్వడం లేదని విమర్శించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణను దోచుకోగా, మిగిలినది ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం దోచుకుంటోందని ధ్వజమెత్తారు.

తెలంగాణ అభివృద్ధి చెందాలంటే బిజెపి అధికారంలోకి రావాలని బిజెపి అధ్యక్షులు స్పష్టం చేశారు. తెలంగాణను బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు రెండూ పాలించాయని, ప్రజలు వారి పాలన చూశారని చెబుతూ ఇప్పుడు బిజెపి కి ఒక్క అవకాశం ఇవ్వాలని ప్రజలను ఆయన కోరారు. కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం ఉందని గుర్తు చేస్తూ తెలంగాణలో డబుల్ ఇంజిన్ సర్కారుతో నిరుద్యోగులు, రైతులు, మహిళలు, పేదలు, విద్యార్థుల సమస్యలు పరిష్కరించి అభివృద్ధి చేస్తుందని హామీ ఇచ్చారు.

తెలంగాణలో బిజెపి క్రమంగా విస్తరిస్తోందని చెబుతూ ఇప్పడు భారతీయ జనతా పార్టీకి 7 మంది ఎమ్మెల్యేలు, 8 మంది ఎంపీలు, ముగ్గురు ఎమ్మెల్సీలు ఉన్నారని గుర్తు చేశారు. ఇటీవల జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో దక్షిణ తెలంగాణలోని నల్లగొండ జిల్లాలో బిజెపి ఓటు శాతం అత్యధికంగా పెరిగిందని చెప్పారు. యావత్ తెలంగాణలో బిజెపి బలంగా ఉందని, మరింత బలోపేతం అవుతుందని తెలిపారు.

కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్క హామీ కూడా అమలు చేయకుండా అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిందని రామచందర్ రావు మండిపడ్డారు. అందుకే కాంగ్రెస్ వైఫల్యాలు, ప్రజావ్యతిరేక విధానాలపై బిజెపి ప్రజాపోరాటాలు చేస్తుందని చెప్పారు. అవినీతి పార్టీలు, అవినీతి ప్రభుత్వాలను ఓడించి, నరేంద్ర మోదీ నాయకత్వంలో అవినీతిరహిత పాలన అందించాలని పిలుపిచ్చారు.

సీఎం రేవంత్ రెడ్డి తరచుగా ఢిల్లీకి వెళ్తున్నారని, అయినా రాహుల్ గాంధీ ఆయనకు అపాయింట్‌మెంట్ ఇవ్వడంలేదని చెబుతూ రాహుల్‌కు కూడా రేవంత్ మీద నమ్మకం పోయిందని తెలిపారు. దాంతో తమ పాలనలోని వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు రేవంత్ రెడ్డి కేంద్రంపై నిందలు వేస్తున్నారని ఆరోపించారు.  గత బీఆర్ఎస్, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వాల అసమర్థత వల్ల నల్లగొండలో డిండి, ఎస్ఎల్బీసీ ప్రాజెక్టులు కదలలేకపోతున్నాయని ఆయన చెప్పారు. 

అందుకే తెలంగాణలో డబుల్ ఇంజిన్ సర్కారును ఏర్పాటు చేయాలని కోరారు. ఎరువుల కొరత ఉందంటూ కేంద్రంపై కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. 
రాష్ట్ర ప్రభుత్వం అడిగిన 9 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా కంటే కేంద్రం 12 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా సరఫరా చేసిందని, అయినా రాష్ట్ర ప్రభుత్వం యూరియాను బ్లాక్ మార్కెట్‌కు ఎలా ఆస్కారం కల్పించినట్లు? అని ప్రశ్నించారు.

బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అంశంపై అసెంబ్లీలో బిజెపి భేషరతుగా మద్దతు తెలిపిందని ఆయన గుర్తు చేశారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం బీసీ జాబితాలో 10 శాతం ముస్లిం మైనారిటీలను కలిపి రిజర్వేషన్లు ఇవ్వాలని చూస్తోందని ఆరోపించారు. మతం ఆధారంగా రిజర్వేషన్లు ఇవ్వాలనుకోవడం ఓటుబ్యాంకు రాజకీయమే. దీన్ని బిజెపి తీవ్రంగా వ్యతిరేకిస్తుందని రామచందర్ రావు స్పష్టం చేశారు.

నిజంగా బీసీలకే 42 శాతం రిజర్వేషన్లు ఇస్తే బిజెపి స్వాగతిస్తుందని, శాస్త్రీయంగా ఆర్డినెన్స్ తీసుకొస్తే మద్దతు ఇస్తుందని హామీ ఇచ్చారు. కాని ఆ 42 శాతం రిజర్వేషన్లలో మతం ఆధారంగా రిజర్వేషన్లను వ్యతిరేకిస్తామని, పోరాడుతామని హెచ్చరించారు.