అంతరిక్షం నుంచి శుభాంశు శుక్లా తిరుగు ప్రయాణం

అంతరిక్షం నుంచి శుభాంశు శుక్లా తిరుగు ప్రయాణం

యాక్సియం-4 మిషన్‌లో భాగంగా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్లిన భారత వ్యోమగామి శుభాంశు శుక్లాతో పాటు మరికొందరు వ్యోమగాములు ఈ నెల 14న భూమికి తిరుగు పయనం కానున్నారు. దాదాపు 18 రోజులపాటు ఐఎస్‌ఎస్‌(అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం)లో అత్యంత కీలకమైన పరిశోధనలు సాగించిన భారత వ్యోమగామి శుభాన్షు శుక్లా సహా మరో ముగ్గురి వ్యోమగాముల తిరుగు ప్రయాణానికి అన్ని ఏర్పాట్లూ పూర్తయ్యాయి.

ఐఎస్‌ఎస్‌లో యాక్సి యం-4 మిషన్‌ అన్‌డాకింగ్‌ సోమవారం మధ్యాహ్నం 4.35 గంటలకు (భారత కాలమానం) చేపడుతున్నారు. సోమవారం తుది దశలో వీరు ప్రయాణించే క్రూ డ్రాగన్ స్పేస్ క్రాఫ్ట్ జూలై 15న అమెరికా కాలిఫోర్నియా తీరంలో ల్యాండ్ కానుంది. భూమికి చేరిన వెంటనే వ్యోమగాములను 7 రోజులు ప్రత్యేక క్వారంటైన్‌లో ఉంచుతారని నాసా వెల్లడించింది.

 ఆక్సిజన్, బయోఫ్యూయల్ వంటి వనరులను అందించగల నమూనాలను అభివృద్ధి చేయడమే లక్ష్యం. భవిష్యత్తులో భూమికి ఆవల జీవితం సాధ్యమేనని సూచించడానికి ఈ పరిశోధన దోహదపడుతుందని యాక్సియం తెలిపింది. శుక్లా బృందం వాయేజర్ డిస్‌ప్లేస్ అధ్యయనం కూడా చేసింది. అంతరిక్షంలో వ్యోమగాముల కంటి కదలికలు, కూర్పు సామర్ధ్యం ఎలా ప్రభావితమవుతుందో పరిశీలించారు.

కక్ష్యలో వ్యోమగాములు పరిసరాలను ఎలా గుర్తిస్తారు. అక్కడ ఎలా సమన్వయం సాధిస్తారో కూడా అధ్యయనం జరిగింది. దీర్ఘకాల మిషన్లకు ఇది ఎంతో ఉపయోగపడుతుందని, భవిష్యత్తులో నివాస స్థలాల రూపకల్పనకు ఇది మార్గదర్శకం అవుతుందని యాక్సియం వెల్లడించింది. అంతరిక్షంలో మైక్రోగ్రావిటీ, అధిక కార్బన్ డయాక్సైడ్ స్థాయిలు వ్యోమగాముల సెరిబ్రల్ రక్తప్రవాహం, హృదయనాళ వ్యవస్థలను ఎలా ప్రభావితం చేస్తాయో కూడా బృందం పరిశోధించింది.

ఈ ఫలితాలు భవిష్యత్ వ్యోమగాములకు మాత్రమే కాకుండా, భూమిపైనే కొన్ని రకాల రోగులకూ ఉపయోగపడతాయని యాక్సియం స్పష్టం చేసింది. ‘యాక్సియం-4 మిషన్‌ భూమి మీదకు చేరుకోవటంలో చివరి తంతు ‘స్లాష్‌ డౌన్‌’ 15న మధ్యాహ్నం 3 గంటలకు (భారత కాలమానం) ఉంటుంది’ అని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్‌ తెలిపారు. ప్రస్తు తం ఐఎస్‌ఎస్‌లో 11మంది వ్యోమగాములు ఉన్నారు. ఏడుగురు భూమి మీదకు రావా ల్సి ఉంది. శుభాన్షు శుక్లాను అంతరిక్షంలోకి పంపేందుకు ఇస్రో సుమారుగా రూ.550 కోట్లు ఖర్చు చేసింది. ఈ అనుభవంతో ఇస్రో 2027లో ‘గగన్‌యాన్‌’ను చేపట్టబోతున్నది.

ఈ క్రమంలో యాక్సియమ్-4 బృందం కోసం అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో తాజాగా (ఐఎస్ఎస్‌) వీడ్కోలు విందు జరిగింది. అందులో ఆరు దేశాలకు చెందిన వివిధ ఆహారాలను యాక్సియమ్-4 వ్యోమగాములు రుచి చూశారు. ఈ సందర్భంగా ప్రసంగించిన శుభాంశూ శుక్లా తన దేశభక్తిని చాటుకున్నారు. ప్రపంచంలోకెల్లా భారత్ అద్భుతమైన దేశమని కీర్తించారు. అంతరిక్ష పరిశోధన రంగంలో భారత్ ఎంతో పురోగతి సాధించిందని చెబుతూ అంతరిక్షం నుంచి చూస్తుంటే భారత్ ఆత్మవిశ్వాసం తొణికిసలాడుతూ కనిపిస్తోందని తెలిపారు. యాక్సియమ్-4 విజయవంతమైందని హర్షం వ్యక్తం చేశారు. ఈ ప్రయాణం తనకు అద్భుత అనుభూతిని మిగిల్చిందని చెప్పారు. 

ఈ మిషన్‌‌ భాగస్వాములైన కమాండర్ పెగ్గీ విట్సన్, పోలాండ్‌కు చెందిన స్లావోజ్ యుజాన్స్కీ, హంగరీ వ్యోమగామి టిబోర్ కాపూపై కూడా ప్రశంసలు కురిపించారు. వారి కారణంగానే ఈ జర్నీ అద్భుత అనుభూతిని ఇచ్చిందని చెప్పారు. ఈ ప్రయాణంలో తనకు మద్దతుగా నిలిచినందుకు భారతీయులందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఇస్రో పరిశోధకులు, విద్యార్థులు, నాసా, యాక్సియమ్ సంస్థలకు కూడా ఆయన ధన్యవాదాలు తెలియజేశారు. ఎన్నో మధుర స్మృతులు, అనుభవాలను మూటగట్టుకుని తిరుగు ప్రయాణమవుతున్నట్టు చెప్పారు.