పాకిస్థాన్ లో ‘రామాయణం’ డ్రామాకు ప్రశంసలు

పాకిస్థాన్ లో ‘రామాయణం’ డ్రామాకు ప్రశంసలు

పవిత్ర మహాకావ్యం రామాయణం ఆధారంగా డ్రామాను పాకిస్థాన్లోని సింధ్ ప్రావిన్స్లో ప్రదర్శించారు. కరాచీ నగరంలోని కరాచీ ఆర్ట్స్ కౌన్సిల్లో మౌజీ డ్రామా గ్రూప్ ప్రదర్శన ఇచ్చింది. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్- ఎఐ మెరుగుదలను ఉపయోగించి ఇతిహాసానికి ప్రాణం పోసేందుకు చేసిన ప్రయత్నాలకు ప్రశంసలు అందుకుంది.

పాకిస్థాన్ లో రామాయణ డ్రామా ప్రదర్శనపై పలువురు దర్శకనిర్మాతలు స్పందించారు. రామాయణాన్ని ప్రదర్శించడం వల్ల ప్రజల నుండి బెదిరింపులను ఎదుర్కొవలసి వస్తుందని సందేహించామని, కానీ వారి ప్రశంసలు ఎదురవుతాయని తాను ఎప్పుడూ భావించలేదని దర్శకుడు యోహేశ్వర్ కరేరా తెలిపారు. రామాయణం వేదికపై ప్రాణం పోసుకోవడం ఒక దృశ్య విందు అని చెప్పారు. 

పాక్ సమాజం తరచుగా భావించే దానికంటే ఎక్కువ సహనంతో ఉందని చూపిస్తుందని సంతోషం వ్యక్తం చేశారు. డ్రామాకు మంచి స్పందన వచ్చిందని చెప్పారు. నటీనటుల నటనను చాలా మంది విమర్శకులు ప్రశంసించారని యోహేశ్వర్ కరేరా తెలిపారు. కథ చెప్పడంలో నిజాయితీ, డైనమిక్ లైటింగ్, లైవ్ మ్యూజిక్, రంగురంగుల దుస్తులు, ఉత్తేజకరమైన డిజైన్లు అన్నీ ప్రదర్శన గొప్పతనాన్ని మరింత పెంచాయని ఫిల్మ్ క్రిటిక్ ఒమైర్ అలవి పేర్కొన్నారు. 

రామాయణం ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మందిని ప్రతిధ్వనించే కథ కాబట్టి కథనం అత్యున్నత స్థాయిలో ఉందని ఆయన కొనియాడారు. సీత పాత్రను పోషించిన నిర్మాత రాణా కజ్మీ పురాతన కథను ప్రేక్షకులకు సజీవ అనుభవంగా తీసుకురావాలనే ఆలోచన ఆసక్తిని కలిగించిందని తెలిపారు.