
స్వాతంత్య్ర ఉద్యమ కాలం నాటి ‘కాకోరీ ఘటన’ శతాబ్ది ఉత్సవాలను లఖ్‌నవూలో ఘనంగా నిర్వహిస్తామని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ ప్రకటించారు. లఖ్‌నవూకు సమీపంలోని కాకోరీ రైల్వే స్టేషన్లో ఆనాడు చోటుచేసుకున్న ఘటన నేటికీ అందరికీ గుర్తుందన్నారు. రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లోనూ ఈ ఉత్సవాలను జరుపుతామని తెలిపారు.
లఖ్‌నవూలోని నేషనల్ పీజీ కాలేజీలో ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, దివంగత కాంగ్రెస్ సీనియర్ నేత చంద్రభాను గుప్తా విగ్రహాన్ని, స్మారక పోస్టల్ స్టాంపును ఆయన ఆవిష్కరిస్తూ 1925 ఆగస్టు 9న కాకోరీ గ్రామం వద్ద ఓ రైలు నుంచి బ్రిటీష్ ప్రభుత్వపు నిధులను హిందుస్తాన్ రిపబ్లికన్ అసోసియేషన్ విప్లవ యోధులు స్వాధీనం చేసుకున్నారని చెప్పారు. విప్లవ పోరాటానికి అవసరమైన ఆయుధాల కొనుగోలు కోసమే బ్రిటీష్ నిధులను ఆనాడు తీసుకున్నారని పేర్కొన్నారు.
కాకోరీ ఘటనతో బ్రిటీష్ పాలకుల పునాదులు కదిలాయని రాజ్‌నాథ్ పేర్కొన్నారు. ఆ ఘటనలో రాంప్రసాద్ బిస్మిల్, అష్ఫాఖుల్లా ఖాన్, సచిన్ నాథ్ బక్షి వంటి విప్లవ యోధులు పాల్గొన్నారని తెలిపారు. మదన్ మోహన్ మాలవ్య, లాలా లజపత్ రాయ్ వంటి అగ్రనేతలు వారికి మద్దతు ప్రకటించారని రక్షణ మంత్రి చెప్పారు. ఆనాడు విప్లవ యోధుల తరఫున లాయర్ గోవింద్ వల్లభ్ పంత్‌తో పాటు చంద్రభాను గుప్తా కోర్టులో వాదనలు వినిపించారని గుర్తు చేశారు.
లా డిగ్రీని దేశ ప్రయోజనాల కోసం వినియోగించి, దేశభక్తిని చంద్రభాను గుప్తా చాటుకున్నారని కొనియాడారు. కాగా, కాకోరి ఘటనకు సంబంధించి 1927లో రాంప్రసాద్ బిస్మిల్, అష్ఫాఖుల్లా ఖాన్, ఠాకూర్ రోషన్ సింగ్‌లను బ్రిటీష్ ప్రభుత్వం ఉరితీసింది. కాగా, భారత స్వాతంత్య్ర ఉద్యమంలో చంద్రభాను గుప్తా కీలక పాత్ర పోషించారని రాజ్‌నాథ్ సింగ్ చెప్పారు. అధికారం అంటే పదవులు, హోదాలు మాత్రమే కాదని, బాధ్యత, త్యాగం, ప్రజా ప్రయోజనాల పరిరక్షణ అందులో కీలక భాగాలనే సందేశాన్ని ఇచ్చేలా చంద్రభాను గుప్తా జీవించారని కొనియాడారు.
రాజకీయ విభేదాలు ఉండొచ్చు కానీ, శత్రుత్వాలు ఉండొద్దనే గొప్ప సందేశాన్ని ఆయన అందించారని రక్షణమంత్రి పేర్కొన్నారు. ఉత్తరప్రదేశ్ లాంటి పెద్ద రాష్ట్రానికి మూడు సార్లు సీఎంగా సేవలు అందించినా, జాతీయ ఎజెండాతోనే చంద్రభాను గుప్తా ముందుకు సాగారని గుర్తు చేశారు. ఈ క్రమంలోనే 1963లో ‘కామరాజ్ ప్లాన్’ కారణంగా సీఎం పదవికి ఆయన రాజీనామా చేశారని చెబుతూ ప్రజల మద్దతుతో సీఎం అయిన ఒక నేత, కేవలం కొంతమంది అయిష్టత కారణంగా గద్దె దిగిపోవడం ఆనాడు ఎలా జరిగి ఉంటుందో మనం ఊహించుకోవచ్చని తెలిపారు.
లఖ్‌నవూలో కొత్తగా ఏర్పాటైన బ్రహ్మోస్ ఏరోస్పేస్ పరీక్షా కేంద్రంతో రక్షణ రంగంలో భారత్ ఆత్మ నిర్భరత మరింత బలోపేతం అవుతుందని రక్షణ మంత్రి చెప్పారు. దాని వల్ల ఎంతో మందికి ఉపాధి అవకాశాలు కూడా లభిస్తాయని పేర్కొన్నారు
More Stories
నేపాల్ తాత్కాలిక ప్రధానిగా సుశీల కర్కిని ఒప్పించిన ఆర్మీ చీఫ్
పాక్ కు చైనా, ఐరోపా, యుఎఈ, అమెరికాల నిఘా యంత్రాలు
నేపాల్ అలజడులతో చిక్కుకున్న మానసరోవర్ యాత్రికులు