పరిమితి కంటే రెట్టింపు ఉప్పు వాడుతున్న భారతీయులు

పరిమితి కంటే రెట్టింపు ఉప్పు వాడుతున్న భారతీయులు
భారతీయులు ఉప్పును మితిమీరి వాడటం వల్ల నిశ్శబ్ద మహమ్మారికి దారి తీస్తున్నదని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఒక వ్యక్తి రోజుకు 5 గ్రాముల కన్నా తక్కువ ఉప్పును మాత్రమే వాడాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) చెప్పింది. కానీ మన దేశంలో గ్రామీణ ప్రాంతాల్లో ఒక్కొక్కరు రోజుకు సుమారు 5.6 గ్రాములు, పట్టణాల్లో ఒక్కొక్కరు రోజుకు 9.2 గ్రాములు చొప్పున వినియోగిస్తున్నారని వెల్లడైంది. 
 
దీనివల్ల హైపర్‌టెన్షన్‌, గుండెపోటు, గుండె సంబంధిత వ్యాధులు, మూత్రపిండాల అనారోగ్యం వంటి సమస్యలు ఎదురవుతాయని భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్‌)కి చెందిన నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఎపిడమాలజీ (ఎన్‌ఐఈ) శాస్త్రవేత్తలు చెప్పారు. మితిమీరిన ఉప్పును వాడటమనే సమస్యను పరిష్కరించడం కోసం ఎన్‌ఐఈ మూడేళ్ల ప్రాజెక్టును చేపట్టింది. ఇది తెలంగాణ, పంజాబ్‌లలో జరుగుతున్నది. దీనికి ఐసీఎంఆర్‌ కూడా సహకరిస్తున్నది.
 
ఎన్‌ఐఈ సీనియర్‌ సైంటిస్ట్‌, ఈ అధ్యయనంలో భాగస్వామి డాక్టర్‌ గణేశ్‌ కుమార్‌ మాట్లాడుతూ, ఉప్పు వినియోగాన్ని క్రమంగా తగ్గించడం వల్ల రక్తపోటు (బీపీ) తగ్గుతుందా? లేదా? అనే అంశాన్ని మదింపు చేయడమే ఈ ప్రాజెక్టు లక్ష్యమని చెప్పారు. అదే విధంగా హైపర్‌టెన్షన్‌ బాధితులు సోడియం తీసుకోవడం వల్ల కలిగే ప్రభావాన్ని కూడా అంచనా వేస్తామని తెలిపారు. మూడేళ్ల ఈ ప్రాజెక్టులో ప్రస్తుతం మొదటి ఏడాదిలో ఉన్నామని చెప్పారు.
ఈ అధ్యయనం ప్రకారం సూచనలు క్షేత్ర స్థాయిలో ఆచరణలోకి రావడం గురించి తెలుసుకునేందుకు ఎన్‌ఐఈ చెన్నైలో మార్కెట్‌ సర్వేను నిర్వహించింది. తక్కువ సోడియం గల ఉప్పు (ఎల్‌ఎస్‌ఎస్‌) అందుబాటులో ఉండటం, దాని ధరలను పరిశీలించింది. ఎల్‌ఎస్‌ఎస్‌ కేవలం 28 శాతం రిటెయిల్‌ ఔట్‌లెట్‌లలో, 52 శాతం సూపర్‌మార్కెట్లలో, 4 శాతం చిన్న కిరాణా దుకాణల్లో మాత్రమే ఉన్నట్లు గుర్తించింది. 

ఎల్‌ఎస్‌ఎస్‌ ధర విషయానికి వస్తే, 100 గ్రాముల ఎల్‌ఎస్‌ఎస్‌ సగటున రూ.5.60 ఉంది. అంటే సాధారణ అయొడైజ్డ్‌ ఉప్పు (100 గ్రాముల ధర రూ.2.70) కన్నా రెట్టింపు. ఉప్పు వినియోగాన్ని తగ్గించడం గురించి ప్రజలు చర్చించుకునేలా చేయడం కోసం సామాజిక మాధ్యమాలు ఎక్స్‌, లింక్‌డిన్‌ వేదికలుగా #PinchForAChange ప్రచారాన్ని ఐసీఎంఆర్‌-ఎన్‌ఐఈ ప్రారంభించింది.

ఎన్‌ఐఈ సీనియర్‌ సైంటిస్ట్‌, ఈ అధ్యయన ప్రిన్సిపల్‌ ఇన్వెస్టిగేటర్‌ డాక్టర్‌ శరణ్‌ మురళి మాట్లాడుతూ, ఉప్పులో సోడియం క్లోరైడ్‌కు ప్రత్యామ్నాయంగా పొటాషియం లేదా మెగ్నీషియం సాల్ట్స్‌ను వాడటం వల్ల భరోసా వస్తుందని తెలిపారు. తక్కువ సోడియం వినియోగం వల్ల రక్తపోటు తగ్గుతుందని, గుండె ఆరోగ్యం మెరుగుపడుతుందని తెలిపారు.  ముఖ్యంగా హైపర్‌టెన్షన్‌తో బాధపడేవారు సోడియంకు బదులుగా దాని ప్రత్యామ్నాయాలను వాడటం శ్రేయస్కరమని చెప్పారు. కేవలం తక్కువ సోడియంగల సాల్ట్‌ను వాడటం వల్ల బీపీ సగటున 7/4 ఎంఎంహెచ్‌జీ తగ్గుతుందన్నారు.