42% కోటా అమలుపై గందరగోళంలో కాంగ్రెస్‌

42% కోటా అమలుపై గందరగోళంలో కాంగ్రెస్‌

బీసీలకు 42 శాతం రేజర్వేషన్లు అమలు విషయంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం గందరగోళంలో చిక్కుకున్నట్లు కనిపిస్తున్నది. ఈ విషయమై ఆర్డినెన్స్‌ తీసుకొచ్చినా ఒకవేళ న్యాయవివాదాలు తలెత్తితే వెంటనే పార్టీ పరంగా రిజర్వేషన్లతో ముందుకు వెళ్లాలని నిర్ణయించినట్టు సమాచారం. ఇదే విషయమై న్యాయనిపుణులు, బీసీ సంఘాల నేతలతోనూ ప్రభుత్వ పెద్దలు మంతనాలు సాగిస్తున్నట్టు తెలిసింది. 

స్థానిక సంస్థల ఎన్నికల్లో, విద్య, ఉద్యోగ రంగాల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్‌ హామీ ఇచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా ఇంటింటి సర్వే నిర్వహించి ఆ గణాంకాలు, డెడికేటెడ్‌ కమిషన్‌ నివేదికల ఆధారంగా ఆ మేరకు రిజర్వేషన్లను పెంచింది. అసెంబ్లీ సమావేశాల్లో 2 బిల్లులను వేర్వేరుగా ప్రవేశపెట్టి ఆమోదించినా, ప్రస్తుతం అవి రాష్ట్రపతి వద్ద పెండింగ్‌లో ఉన్నాయి. 

ఈ నేపథ్యంలో ఆ బిల్లులను పక్కనపెట్టి పంచాయతీరాజ్‌ చట్టం 2018లో రిజర్వేషన్లకు సంబంధించి సవరణలు చేస్తూ ఆర్డినెన్స్‌ తీసుకువచ్చి, 42శాతం రిజర్వేషన్లను అమలు చేయాలని సర్కారు భావించింది. ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నేతృత్వంలో క్యాబినెట్‌ ఆర్డినెన్స్‌ జారీకి ఆమోదం తెలిపింది. పంచాయతీరాజ్‌ చట్టం ద్వారా సర్పంచ్‌, ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. 

అయితే ఆ తర్వాత మున్సిపాలిటీలు, మున్సిపల్‌ కార్పొరేషన్లకూ ఎన్నికలను నిర్వహించాల్సి ఉంది. వాటిల్లో మేయర్‌, కార్పొరేటర్లు, కౌన్సిల్‌ చైర్మన్‌, కౌన్సిలర్‌ స్థానాల్లో కూడా 42 శాతం రిజర్వేషన్‌ అమలు చేయాల్సి ఉంటుంది. అలా చేయాలంటే తెలంగాణ మున్సిపాలిటీల చట్టం 2019లోనూ సవరణలు చేయాల్సి ఉంటుందని న్యాయనిపుణులు చెప్తున్నారు. లేదంటే వ్యవహారం మళ్లీ మొదటికి వస్తుందని అంటున్నారు. 

స్థానిక సంస్థల్లో అమలు చేశాక విద్య, ఉద్యోగ రంగాలకు సంబంధించి డిమాండ్‌ ఊపందుకుంటుందని సర్కారు భావిస్తున్నట్టు తెలుస్తున్నది. కేవలం పంచాయతీలో మాత్రమే అమలు చేసి ఇతర వాటిల్లో అమలు చేయకపోతే మళ్లీ వ్యతిరేకతను మూటగట్టుకోవాల్సి ఉంటుందని, రాజకీయంగా బద్నాం కావాల్సి వస్తుందని ప్రభుత్వ పెద్దల వద్ద పలువురు కాంగ్రెస్‌ నేతలు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. 

బీసీ రిజర్వేషన్లకు సంబంధించి ఆర్డినెన్స్‌ జారీకి గవర్నర్‌ ఆమోదించినా, లేకున్నా రెండు విధాలుగా మేలు జరుగుతుందని కాంగ్రెస్‌ భావిస్తున్నది. ఆమోదిస్తే ఎవరూ కోర్టుకు వెళ్లకముందే ఎన్నికలు నిర్వహించి బీసీ వర్గాల మెప్పు పొందవచ్చని భావిస్తున్నది. ఒకవేళ గవర్నర్‌ ఆమోదించకుంటే బీఆర్‌ఎస్‌, బీజేపీని బద్నాం చేయవచ్చని ఆలోచిస్తున్నట్టు తెలిసింది. అప్పుడు పార్టీ పరంగా రిజర్వేషన్లు కల్పిస్తామని బీసీలకు హామీనిచ్చి వెంటనే ఎన్నికల ప్రక్రియను పూర్తిచేయాలని ఒక నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం.