ఉజ్జయిని మహంకాళి అమ్మవారి(లష్కర్) బోనాలు ఆదివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. అమ్మవారి ఆలయాన్ని అధికారులు సుందరంగా తీర్చిదిద్దారు. అమ్మవారి కీర్తనలతో గుడి పరిసరాలు హోరెత్తుతున్నాయి. తెలంగాణ ప్రభుత్వం తరఫున అమ్మవారికి మంత్రి పొన్నం ప్రభాకర్దంపతులు తొలి బోనం సమర్పించారు. అనంతరం మంత్రి దంపతులు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఉదయం 11.40 గంటలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమ్మవారికి పట్టు వస్త్రాలను సమర్పించారు. మంత్రులు పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, కలెక్టర్ హరిచందన, డిప్యూటీ మేయర్ శ్రీలతరెడ్డి, దేవాదాయ శాఖ కమిషనర్ వెంకట్రావ్, ఈవో గుత్తా మనోహర్ రెడ్డి సీఎంకు స్వాగతం పలికారు. ఉజ్జయినికి బోనాలు సమర్పించడానికి భక్తులు భారీగా తరలి వచ్చారు. దీంతో ఆలయ పరిసరాలు సందడిగా మారాయి.
ఉజ్జయిని ఆలయ పరిసరాలు భక్తులతో కిటకిటలాడాయి. ఆలయ ఆవరణలో సుమారు రెండు కిలోమీటర్ల వరకూ కోలాహలం నెలకొంది. అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తుల కోసం, వీఐపీల కోసం వేర్వేరుగా క్యూలైన్లు ఏర్పాటు చేశారు. మహంకాళి అమ్మవారిని పెద్ద ఎత్తున భక్తులతో పాటు ప్రజాప్రతినిధులు, అధికారులు దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. ప్రధానంగా పోలీస్ అధికారులు ప్రశాంత వాతావరణంలో జాతర జరిగేలా ఏర్పాట్లు చేశారు.
ఉజ్జయినీ మహంకాళి అమ్మవారికి భక్తులు, మహిళలు, శివసత్తులు బోనాలు పెద్ద ఎత్తున బోనాలు సమర్పించారు. శివసత్తులు వివిధ రకాల వేషధారణలతో బోనాలను తలపై పెట్టుకొని నృత్యాలు చేస్తూ ఆలయానికి చేరుకొని అమ్మవారికి బోనాల సమర్పించారు. శివసత్తుల బోనాలను అధికారులను దేవాలయంలోకి అనుమతించారు. ఈ బోనాల సమర్పణతో లష్కర్ ఆధ్యాత్మిక శోభతను సంతరించుకున్నది.
లష్కర్ బోనాల జాతరలో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి దంపతులు పాల్గొని అమ్మవారికి బోనాలు సమర్పించారు. ఉజ్జయిని ఆలయంలో బోనాలు సమర్పించి, ప్రత్యేక పూజలు చేశారు. అమ్మవారిని దర్శించుకున్న వారిలో బిజెపి ఎంపీ ఈటల రాజేందర్, ఎమ్మెల్యే లు తలసాని శ్రీనివాస్ యాదవ్, మర్రి రాజశేఖర్ రెడ్డి, సునీత లక్ష్మారెడ్డి తదితరులున్నారు.
దేవదాయశాఖ, పోలీసు శాఖ సమన్వయంతో భక్తులకు ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టాయి. ఆలయం లోపల ఇబ్బందులు తలెత్తకుండా దేవదాయశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రామయ్య, కమిషనర్ ఐ. వెంకటరావు సౌకర్యాలు కల్పించారు. ప్రధానంగా తాగునీటి సౌకర్యం కల్పించారు. పోలీసు బందోబస్తును నార్త్ జోన్ డీసీపీ రష్మిక పెర్మల్ చర్యలు చేపట్టారు.
More Stories
ముగ్గురు మావోయిస్టు కీలక నేతల లొంగుబాటు
హైకోర్టు స్టేకు కాంగ్రెస్ కారణం.. వెంటనే సుప్రీంకోర్టుకు వెళ్లాలి
స్థానిక సంస్థల ఎన్నికలు, జీవో నెంబర్ 9పై హైకోర్టు స్టే