బిహార్‌ ఓటర్లలో బంగ్లాదేశ్‌, నేపాల్‌, మయన్మార్‌ దేశస్థులు!

బిహార్‌ ఓటర్లలో బంగ్లాదేశ్‌, నేపాల్‌, మయన్మార్‌ దేశస్థులు!

* దేశవ్యాప్తంగా ‘ఓటరు జాబితా సమగ్ర సవరణ’

బిహార్‌లో శాసనసభ ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ భారత ఎన్నికల సంఘం ‘ఓటరు జాబితా సమగ్ర సవరణ’ (ఎస్ఐఆర్)ను చేపట్టడం దేశ వ్యాప్తంగా దుమారం రేపింది. విపక్షాల ఆందోళనలను తోసిపుచ్చుతూ బిహార్‌లో కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన ‘ఓటర్‌ జాబితా సమగ్ర సవరణ’ ప్రక్రియలో కీలక విషయాలు తెలుస్తున్నాయి. 

బిహార్‌లో ఇంటింటినీ తనిఖీ చేస్తున్న ఈసీ సిబ్బందికి భారీగా బంగ్లాదేశీయులు, నేపాలీలు, మయన్మార్‌ పౌరులు కనిపించారు. వారి వద్ద ఆధార్​, రేషన్ కార్డు, నివాస ధ్రువీకరణ పత్రాలు కూడా ఉన్నాయి. అంతేకాదు వారిలో చాలా మంది ఓటర్‌ లిస్టులో ఉండే అవకాశం ఉందని ఈసీ భావిస్తోంది. అందుకే ఆగస్టు తర్వాత వారిని విచారించి జాబితా నుంచి తొలగిస్తామని తెలిపింది. 

సెప్టెంబర్‌లో విడుదల చేసే తుది ఓటర్‌ జాబితాలో విదేశీయుల పేర్లు ఉండవని స్పష్టం చేసింది. ప్రతిపక్షాలకు వచ్చే ఓట్లను తొలగించడానికే కేంద్ర ప్రభుత్వం కనుసన్నల్లో ఈసీ ఈ ప్రక్రియ చేపట్టిందని కాంగ్రెస్‌ సహా ఇండియా కూటమి పక్షాలు ఆరోపిస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. ఆధార్‌ కార్డును పౌరసత్వ గుర్తింపుగా పరిగణించకపోతే పేదలు, వృద్ధులు ఇప్పటికిప్పుడు కుల, నివాస, జననధ్రువపత్రాలు ఎలా తీసుకు రాగలరని ప్రశ్నించాయి. 

పిటిషన్లను విచారించిన సుప్రీం ఓటర్‌ జాబితా సమగ్ర సవరణ రాజ్యాంగబద్ధమేనని స్పష్టంచేసింది. అయితే ఎస్​ఐఆర్​ కోసం ఆధార్‌ కార్డును పరిగణనలోకి తీసుకోవాలని ఈసీకి సూచించింది. ఈ క్రమంలో ఎన్నికల అధికారులు బిహార్‌లో పర్యటిస్తూ ఎస్​ఐఆర్​ చేపట్టారు. ఇంటింటి తనిఖీల్లో నేపాల్‌, బంగ్లాదేశ్‌, మయన్మార్‌ దేశస్తులు భారీగా బిహార్‌లో ఉన్నారని గుర్తించారు. 

వారి పేర్లు ఓటర్‌ జాబితాలో ఉన్నాయా లేదా అన్నది వెల్లడించలేదు. ఆగస్ట్‌ 1 తర్వాత క్షుణ్ణంగా విచారణ జరుపుతామనీ, భారత పౌరులు కానివారి పేర్లేవీ సెప్టెంబర్‌ 30న విడుదల చేసే జాబితాలో ఉండబోవని అధికారులు తెలిపారు. బిహార్‌లో ప్రస్తుతం 77 వేలమంది బూత్‌ లెవల్‌ ఆఫీసర్లు, ప్రభుత్వ సిబ్బంది, రాజకీయ పార్టీల కార్యర్తలు ఎస్ఐఆర్ లో పాల్గొంటున్నారు. 7.8 కోట్ల మంది ఓటర్లను వీరు తనిఖీ చేయనున్నారు.

ఇలా ఉండగా,  వచ్చే నెల (ఆగస్టు) నుంచి దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో ఓటరు జాబితా సమగ్ర సవరణ(ఎస్‌ఐఆర్)ను చేపట్టేందుకు కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) సమాయత్తం అవుతోంది. ఇందుకోసం ఎక్కడికక్కడ ఎన్నికల యంత్రాంగాలను క్రియాశీలం చేస్తోంది.  త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న బిహార్‌తో పాటు ఇతర రాష్ట్రాల్లోనూ ఓటరు జాబితా సమగ్ర సవరణను మొదలుపెట్టేందుకు ఈసీ సన్నాహాలు చేస్తోంది.

వివిధ రాష్ట్రాల చీఫ్ ఎలక్టోరల్ అధికారులు (సీఈఓలు) ఆయా రాష్ట్రాల్లో చివరిసారిగా ఓటరు జాబితా సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్) జరిగిన తర్వాత ప్రచురితమైన ఓటరు జాబితాలను బయటికి తీస్తున్నారు. వాటిని తమ అధికారిక వెబ్‌సైట్లలో అందుబాటులోకి తెస్తున్నారు. దేశ రాజధాని డిల్లీలో 2008లో, ఉత్తరాఖండ్‌లో 2006లో చివరిసారిగా ఓటరు జాబితాల సవరణకు ప్రత్యేక డ్రైవ్‌‌‌లు నిర్వహించారు.

ఆయా సంవత్సరాల్లో ప్రచురించిన ఓటరు జాబితాలను ఢిల్లీ సీఈఓ, ఉత్తరాఖండ్ సీఈఓ అధికారిక వెబ్‌సైట్‌‌లలో ఇప్పుడు అందుబాటులోకి తెచ్చారు. ఈ ఏడాది అక్టోబరు – నవంబరులో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న బిహార్‌లో చివరిసారిగా 2003లో ఓటరు జాబితా సమగ్ర సవరణ జరిగింది.  ఆ ఏడాది ప్రచురితమైన ఓటరు జాబితాలోని సమాచారం ఆధారంగానే ఇప్పుడు బిహార్‌లో ఓటరు జాబితా సమగ్ర సవరణ జరగబోతోంది.

ఓటరు జాబితా సమగ్ర సవరణను ఈసీ చేపట్టడం అనేది రాజ్యాంగబద్ధమైన అంశమేనని, బిహార్‌లో ఆ ప్రక్రియను నిర్వహించొచ్చని గతవారం సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. అయితే దేశవ్యాప్తంగా ఈ డ్రైవ్‌ను చేపట్టే అంశంపై జులై 28 తర్వాతే కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) తుది నిర్ణయాన్ని తీసుకుంటుందని అధికార వర్గాలు అంటున్నాయి. ఎందుకంటే అకస్మాత్తుగా బిహార్‌లో ఎస్‌ఐఆర్ డ్రైవ్‌ను నిర్వహించడం వల్ల ఎంతోమంది ఓటు హక్కును కోల్పోతారంటూ దాఖలైన పిటిషన్లపై ఆ తేదీన మరోసారి దేశ సర్వోన్నత న్యాయస్థానంలో వాదనలు జరగనున్నాయి. 

జన్మస్థలం ఆధారంగా విదేశాలకు చెందిన అక్రమ వలసదారుల పేర్లను దేశంలోని ఓటరు జాబితాల నుంచి తొలగిస్తామని కేంద్రం ఎన్నికల సంఘం అంటోంది. ప్రత్యేకించి వివిధ రాష్ట్రాల్లో బంగ్లాదేశ్, మయన్మార్ వలసదారులు ఓటు హక్కు పొందారని అంటున్నారు. అలాంటి వారి పేర్లను ఓటరు లిస్టుల నుంచి తొలగించనున్నారు. కాగా, ఈ ఏడాది చివర్లో బిహార్‌లో, వచ్చే సంవత్సరం అసోం, కేరళ, పుదుచ్చేరి, తమిళనాడు, పశ్చిమ బెంగాల్‌లలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.