మరాఠా పాలకుల 12 కోటలకు యునెస్కో గుర్తింపు

మరాఠా పాలకుల 12 కోటలకు యునెస్కో గుర్తింపు

మరాఠా పాలకులు నిర్మించిన 12 కోటలకు యునెస్కో గుర్తింపు లభించింది. ఆ కోటలకు ‘మరాఠా మిలిటరీ లాండ్‌ స్కేప్స్‌’ పేరుతో ప్రఖ్యాత యునెస్కో ప్రపంచ వారసత్వ జాబితాలో చేర్చింది. ఫ్రాన్స్ లోని పారిస్‌ లో జరుగుతున్న ప్రపంచ వారసత్వ కమిటీ 47వ సదస్సులో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు యునెస్కో ఎక్స్‌ వేదికగా ప్రకటించింది. మహారాష్ట్రలోని సాల్హేర్‌ కోట, శివ్‌ నేరీ కోట, లోహ్‌ గఢ్, ఖండేరీ కోట, రాయగఢ్, రాజ్‌ గఢ్, ప్రతాప్‌ గఢ్, సువర్ణదుర్గ్, పన్హాలా కోట, విజయ్‌ దుర్గ్, సింద్‌ దుర్గ్, తమిళనాడులోని జింజీ కోట ఈ ‘మరాఠా మిలిటరీ లాండ్‌స్కేప్స్‌’లో భాగం. 

ఈ కోటలు భారత దేశం నుంచి యునెస్కో గుర్తింపు పొందిన 44వ ప్రదేశంగా నిలిచాయి.  మరాఠా పాలకులు నిర్మించిన 12 కోటలను ‘మరాఠా మిలిటరీ లాండ్‌ స్కేప్స్‌’ పేరుతో యునెస్కో ప్రపంచ వారసత్వ జాబితాలో చేర్చడంపై ప్రధాని నరేంద్ర మోదీ స్పందిస్తూ ఈ గుర్తింపు పట్ల ప్రతి భారతీయుడు హర్షం వ్యక్తం చేస్తారని పేర్కొన్నారు. ఈ మేరకు ఎక్స్లో పోస్ట్ చేశారు.

“మనం అద్భుతమైన మరాఠా సామ్రాజ్యం గురించి మాట్లాడేటప్పుడు వారి సుపరిపాలన, సైనిక బలం, సాంస్కృతిక గర్వం, సామాజిక సంక్షేమం గురించి తెలుసుకోవాలి. గొప్ప పాలకులు ఎటువంటి అన్యాయానికి తలొగ్గకుండా మనకు స్ఫూర్తినిస్తారు. ‘మరాఠా మిలిటరీ లాండ్‌ స్కేప్స్‌’కు యునెస్కో గుర్తింపు లభించడంపై ప్రతి భారతీయుడు హర్షం వ్యక్తం చేస్తున్నారు” అని తెలిపారు.  .

“ఈ ‘మరాఠా మిలిటరీ లాండ్‌ స్కేప్స్‌’లో 12 గంభీరమైన కోటలు ఉన్నాయి. వాటిలో 11 మహారాష్ట్రలో, ఒకటి 1 తమిళనాడులో ఉంది. దేశ ప్రజలు ఈ కోటలను సందర్శించి, మరాఠా సామ్రాజ్యం తాలుక గొప్ప చరిత్ర గురించి తెలుసుకోవాలి” అని చెప్పారు.  ఛత్రపతి శివాజీ మహారాజ్ నిర్మించిన కోటలను యునెస్కో ప్రపంచ వారసత్వ జాబితాలో చేర్చడాన్ని మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్ స్వాగతించారు. ఇది రాష్ట్రానికి గర్వకారణమైన, అద్భుతమైన క్షణంగా అభివర్ణించారు. శివాజీ మహారాజ్ ఈ కోటలను స్వరాజ్యం (సార్వభౌమ రాజ్యం) కోసం నిర్మించారని కొనియాడారు.

“మహారాష్ట్ర ప్రభుత్వం మన ప్రియమైన ఛత్రపతి శివాజీ మహారాజ్కు నమస్కారాలు తెలియజేస్తోంది! మహారాష్ట్ర పౌరులందరికీ, శివభక్తులకు హృదయపూర్వక అభినందనలు. మన గొప్ప రాజు ఛత్రపతి శివాజీ మహారాజ్ నిర్మించిన 12 కోటలు యునెస్కో ప్రపంచ వారసత్వ జాబితాలో చేరాయి. ఈ విషయాన్ని మీతో పంచుకోవడానికి చాలా సంతోషంగా ఉన్నాను” అని చెప్పారు. 

“వాటిని యునెస్కో జాబితాలో చేర్చే ప్రయత్నాలకు చాలా మంది సహకరించారు. ముందుగా గౌరవ ప్రధాని నరేంద్ర మోదీకి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. మోదీ, కేంద్ర ప్రభుత్వం అందించిన మద్దతు చాలా విలువైనది. ఏఎస్ఐ, సాంస్కృతిక మంత్రిత్వ శాఖ చాలా సాయపడ్డాయి. నేను వ్యక్తిగతంగా వివిధ రాయబారులను సంప్రదించాను. మంత్రులు, డిప్యూటీ ముఖ్యమంత్రులు ఏక్‌ నాథ్ శిందే, అజిత్‌ పవార్ కూడా నాకు మద్దతుగా నిలిచారు” అని ముఖ్యమంత్రి తెలిపారు. 

“మంత్రి ఆశిశ్ షెలార్ స్వయంగా వెళ్లి యునెస్కో డైరెక్టర్ జనరల్ను కలిశారు. ఆయన అక్కడ సాంకేతిక ప్రదర్శన ఇచ్చారు. సీఎంఓ నుంచి ఏసీఎస్ వికాస్ ఖర్గే, అలాగే యునెస్కోలో భారత రాయబారి విశాల్ శర్మ, ఆర్కియాలజీ అండ్ మ్యూజియంల డైరెక్టరేట్ నుంచి హేమంత్ దల్వీ హాజరయ్యారు” అని ఫడణవీస్ పేర్కొన్నారు.

‘మరాఠా మిలిటరీ లాండ్‌ స్కేప్స్‌’కు యునెస్కో గుర్తింపు లభించడంపై ఎన్సీపీ నేత, ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ హర్షం వ్యక్తం చేశారు. ఈ 12 కోటలు ఛత్రపతి శివాజీ మహారాజ్, మరాఠా యోధుల శౌర్యం, త్యాగం, దార్శనికతకు సాక్ష్యంగా నిలుస్తున్నాయని తెలిపారు. ఇప్పుడు మరాఠా కోటల వారసత్వం ప్రపంచవ్యాప్తంగా గౌరవాన్ని పొందుతోందని పేర్కొన్నారు.

“నామినేషన్ విజయవంతం కావడానికి మద్దతు ఇచ్చిన ప్రధాని మోదీకి కృతజ్ఞతలు. మహారాష్ట్ర ప్రజలకు అభినందనలు. ‘మరాఠా మిలిటరీ లాండ్‌ స్కేప్స్‌’కు గుర్తింపు మహారాష్ట్ర చారిత్రక, నిర్మాణ వైభవాన్ని హైలైట్ చేస్తుంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని కోటల పరిరక్షణ కోసం మహారాష్ట్ర ప్రజలు ప్రతిజ్ఞ చేయాలి” అని అజిత్ పవార్ స్పష్టం చేశారు.

మరాఠా కోటలను యునెస్కో ప్రపంచ వారసత్వ జాబితాలో చేర్చడం వల్ల శివాజీ మహారాజ్ గెరిల్లా యుద్ధ వ్యూహాలలో కీలక పాత్ర పోషించిన ఈ నిర్మాణాలను పరిరక్షించే ప్రయత్నాలు ఊపందుకుంటాయని మహారాష్ట్ర పర్వతారోహకులు తెలిపారు. ‘మరాఠా మిలిటరీ లాండ్‌ స్కేప్స్‌’లోని 12 కోటలను యునెస్కో గుర్తించడంపై అఖిల్ మహారాష్ట్ర గిర్యారోహన్ మహాసంఘ్ స్వాగతించింది.

‘మరాఠా మిలిటరీ లాండ్‌ స్కేప్స్‌’లకు యునెస్కో ప్రపంచ వారసత్వ జాబితాలో చేర్చడంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా సంతోషం వ్యక్తం చేశారు. “మహారాజాధిరాజ్ ఛత్రపతి శివాజీ మహారాజ్ జీవితంతో ముడిపడి ఉన్న 12 కోటలను యునెస్కో ప్రపంచ వారసత్వ జాబితాలో చేర్చడం దేశవాసులందరికీ ఎంతో గర్వకారణం” అని తెలిపారు. 

“కొన్ని రోజుల క్రితం నేను రాయ్ గఢ్ కోటను సందర్శించాను. ఛత్రపతి శివాజీ మహారాజ్ జీవితంతో ముడిపడి ఉన్న చిహ్నాల ఆధ్యాత్మిక అనుభవాన్ని పొందాను. ఈ కోటలు హిందూ స్వరాజ్య రక్షణకు ప్రధాన స్తంభాలుగా ఉన్నాయి. ఇక్కడి నుంచి కోట్లాది మంది దేశస్థులు తమ మాతృభాష, సంస్కృతి పట్ల నిరంతర ప్రేరణ పొందుతున్నారు” అని అమిత్ షా ఎక్స్లో పోస్ట్ పెట్టారు.