విలక్షణ నటుడు కోట శ్రీనివాసరావు కన్నుమూత

విలక్షణ నటుడు కోట శ్రీనివాసరావు కన్నుమూత
విలక్షణ నటుడు కోట శ్రీనివాసరావు(83) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆదివారం తెల్లవారుజామున హైదరాబాద్‌లోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. కోట మరణంతో టాలీవుడ్ లో విషాద ఛాయలు అలుముకున్నాయి.  తన విలక్షణమైన నటనతో తెలుగు, తమిళ, హిందీ సహా పలు భారతీయ భాషల్లో 750కి పైగా సినిమాల్లో నటించారు. 
కోట శ్రీనివాసరావుకు భార్య రుక్మిణి, కుమార్తెలు ఉన్నారు. కుమారుడు కోట వెంకట ఆంజనేయ ప్రసాద్ 2010లో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు.  తన 4 దశాబ్దాల సినీ ప్రయాణంలో విలన్‌గా, క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా, కమెడియన్‌గా ఎన్నో విలక్షణ పాత్రలు పోషించారు. తొమ్మిది నది పురస్కారాలు అందుకున్న ఆయనను 2015లో కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారం అందించింది.

కోట శ్రీనివాసరావు 1942 జూలై 10న ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లా కంకిపాడులో జన్మించారు. చిన్ననాటి నుంచే నాటక రంగంతో సంబంధం ఉన్న ఆయన, 1978లో “ప్రాణం ఖరీదు” సినిమా ద్వారా తెలుగు చిత్రసీమలో అడుగుపెట్టారు. విలన్ పాత్రలు, హాస్య పాత్రలు, క్యారెక్టర్ ఆర్టిస్టుగా తనదైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.  ఆహనా పెళ్లంట, గణేష్, ప్రతిఘటన సహా పలు సినిమాల్లో ఆయన సినిమా కెరీర్​లో మైలురాళ్లు.

సినిమాల్లోకి రాకముందు కోట శ్రీనివాసరావు స్టేట్ బ్యాంకులో ఉద్యోగిగా పని చేశారు. కోట తండ్రి సీతా రామాంజనేయులు వైద్య వృత్తిలో కొనసాగారు. ప్రసిద్ధి చెందిన వైద్యుడు. అదే దారిలో కోట కూడా వైద్య విద్యను అభ్యసించాలని భావించారు. అయితే, నటనపై ఉన్న ఆకర్షణతో చివరకు నాటకరంగం వైపు మళ్లారు.  కోట శ్రీనివాసరావు జీవితంలో ఎన్నో ఒడిదొడుకులు ఎదుర్కొన్నప్పటికీ, నటనపై అపారమైన ప్రేమతో ముందుకు సాగారు.

1985లో వచ్చిన ‘ప్రతిఘటన’ చిత్రంలోని ‘గుడిశెల కాశయ్య’ పాత్రతో తెలంగాణ యాసను పలికిస్తూ అద్భుతమైన గుర్తింపు పొందారు. ఆ తర్వాత ఆయన వెనుతిరిగి చూడలేదు. కోట శ్రీనివాసరావు నటనలోని హావభావాలు, వాక్చాతుర్యం, తనదైన మాటల పలుకుబడి ఆయన్ను ప్రత్యేకంగా నిలిపాయి. పాత్రలో లీనమై పోయే విధానం, డైలాగ్ డెలివరీలో ఉన్న ఒరియంటేషన్‌ సినీ అభిమానుల హృదయాల్లో నిలిచిపోయింది. సినిమాల్లోనే కాదు.. రాజకీయాల్లోనూ తనదైన ముద్ర వేసుకున్నారు. 1990లలో బీజేపీలో చేరిన ఆయన 1999-2004 వరకు విజయవాడ తూర్పు ఎమ్మెల్యేగా పనిచేశారు.

సినిమాల్లో తనకు మంచి జోడీగా పేరున్న బాబూమోహన్ కూడా అదే సమయంలో అసెంబ్లీకి ఎన్నికయ్యారు. బాబూమోహన్ మంత్రి అయ్యే వరకు ఇద్దరూ అసెంబ్లీలో ఒకే దగ్గర కూర్చునేవారు. వృద్ధాప్య సమస్యల కారణంగా ఇటీవల కాలంలో సినిమాలకు దూరంగా ఉంటున్నారు. 2023లో వచ్చిన ‘సువర్ణ సుందరి’ ఆయన చివరి చిత్రం. ప్రతిఘటన, గాయం, తీర్పు, లిటిల్ సోల్జర్స్, గణేష్, చిన్నా, ఆ నలుగురు, పెళ్లైన కొత్తలో చిత్రాలకు గాను నంది అవార్డులు అందుకున్నారు. 

డాక్టర్ అల్లు రామలింగయ్య కళాపీఠం జాతీయ పురస్కారం” (2013) వంటి అనేక పురస్కారాలు కూడా ఆయనను వరించాయి. ఆయన మిమిక్రీ చేయగలిగే నైపుణ్యం, హావభావాలు, డైలాగ్ డెలివరీ అన్నీ కలిసి ఒక యాక్టర్ లో ఉండాల్సిన అన్ని లక్షణాలను కలిగి ఉన్నారు. ఎస్.వి.రంగారావు, కైకాల సత్యనారాయణ, రావు గోపాలరావు వంటి మహానటుల తర్వాత ఆ లోటును పూరించిన నటుడు కోటా శ్రీనివాసరావు.