రాజ్యసభకు న్యాయవాది ఉజ్వల్ దేవ్, దౌత్యవేత్త హర్ష

రాజ్యసభకు న్యాయవాది ఉజ్వల్ దేవ్, దౌత్యవేత్త హర్ష
రాజ్యసభకు కొత్తగా నలుగురు ప్రముఖులు నామినేట్ అయ్యారు. రాష్ట్రపతి కోటా కింద ఈ నలుగురి ఎంపిక ప్రక్రియ పూర్తయింది. ఈ మేరకు కొద్దిసేపటి కిందటే రాష్ట్రపతి భవన్ నుంచి ఓ నోటిఫికేషన్ విడుదల అయింది. వివిధ రంగాలకు సేవలను అందించిన నలుగురిని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రాజ్యసభకు నామినేట్ చేశారు. కొత్తగా నామినేట్ అయిన వారి జాబితాలో ముంబైకి చెందిన పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఉజ్వల్ దేవ్ రావ్ నికమ్, కేరళకు చెందిన ప్రముఖ సామాజిక కార్యకర్త, విద్యావేత్త సీ సందానందన్ మాస్తే, విదేశాంగ శాఖ మాజీ కార్యదర్శి హర్షవర్ధన్ శ్రింగ్లా, ప్రముఖ చరిత్రకారిణి మీనాక్షి జైన్ ఉన్నారు.

ఉజ్వల్ నికమ్ కు హై ప్రొఫైల్ క్రిమినల్ కేసులను వాదించే న్యాయవాదిగా దేశవ్యాప్తంగా గుర్తింపు ఉంది. 1993 ముంబై దాడులు, బీజేపీ సీనియర్ నాయకుడు ప్రమోద్ మహాజన్, బాలీవుడ్ నిర్మాత గుల్షన్ కుమార్ హత్యోదంతాలకు సంబంధించిన కేసులను ఆయన విజయవంతంగా వాదించారు.  2013లో దేశవ్యాప్తంగా సంచలనం రేపిన ముంబై గ్యాంగ్ రేప్, 2016 కొపర్డి రేప్ అండ్ మర్డర్ కేసులను ఉజ్వల్ నికమ్ వాదించారు.
అన్నింటికీ మించి- 26/11 ముంబై మారణ హోమం ఘటనలో ప్రభుత్వం తరఫున వాదించారు. పాకిస్తాన్ ఉగ్రవాది కసబ్ కు ఉరిశిక్ష పడేలా చేశారు.  న్యాయ రంగంలో ఆయన చేసిన సేవలకు గుర్తుగా 2016లో ఉజ్వల్ నికమ్ కు పద్మశ్రీ అవార్డును ఇచ్చి సత్కరించింది కేంద్ర ప్రభుత్వం. ఆ తర్వాత ఆయన భారతీయ జనతా పార్టీలో చేరారు. 2024 నాటి సార్వత్రిక ఎన్నికల్లో ముంబై నార్త్ సెంట్రల్ నియోజకవర్గం నుంచి లోక్ సభకు పోటీ చేసి ఓడిపోయారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన వర్షా గైక్వాడ్ చేతిలో 16 వేలకు పైగా ఓట్ల తేడాతో పరాజయం పాలయ్యారు.
హర్షవర్ధన్ శ్రింగ్లా మాజీ ఐఎఫ్ఎస్ అధికారి. గతంలో అమెరికాలో భారత రాయబారిగా పని చేశారు. విదేశాంగ మంత్రిత్వ శాఖ కార్యదర్శిగా వ్యవహరించారు. ఈ శాఖపై ఆయనకు మంచి పట్టు ఉంది. విదేశాంగ నిపుణుడిగా ఆయనకు గుర్తింపు ఉంది. అంతర్జాతీయంగా పలు సున్నిత అంశాలను విజయవంతంగా పరిష్కరించారనే పేరుంది.
సదానంద మాస్తే ప్రస్తుతం కేరళ బిజెపి ఉపాధ్యక్షులుగా ఉన్నారు. 30 ఏళ్ళ వయస్సులో జనవరి 25, 1994లో సిపిఎం గుండాలు క్రూరంగా ఆయనపై దాడి చేయడంతో ఆయన రెండు కాళ్ళను పోగొట్టుకున్నారు. అయినా ప్రముఖ ఆర్ఎస్ఎస్ కార్యకర్తగా కొనసాగుతున్నారు. 2016లో రాజకీయ హింసకు పేరొందిన కూతుపరంబ నియోజకవర్గం నుండి అసెంబ్లీకి పోటీచేశారు.

రాజ్యసభకు నామినేట్​ అయిన నలుగురికీ ప్రధాని నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. “న్యాయ రంగం, రాజ్యాంగం పట్ల ఉజ్వల్ నికం​కు ఉన్న అంకితభావం ఆదర్శప్రాయమైనది. ఆయన గొప్ప న్యాయవాది మాత్రమే కాదు, ముఖ్యమైన కేసులను వాదించడంలో ఆయన ముందు వరుసలో ఉంటారు” అని మోదీ ఎక్స్​లో పోస్ట్ చేశారు. తన న్యాయ వృత్తిలో నికం ఎల్లప్పుడూ రాజ్యాంగ విలువలను బలోపేతం చేయడానికి విశేష కృషి చేశారని కొనియాడారు.

శ్రింగ్లా సహకారాన్ని మోదీ ప్రశంసించారు. ఆయన దౌత్యవేత్తగా, మేధావిగా వ్యూహాత్మక ఆలోచనాపరుడిగా రాణించారని మోదీ పేర్కొన్నారు. “గత కొద్ది సంవత్సరాలుగా ఆయన భారతదేశ విదేశాంగ విధానానికి విశేష కృషి చేశారు. జి20 అధ్యక్ష పదవికి కూడా దోహదపడ్డారు. ఆయన్ని రాజ్యసభకు నామినేట్ చేయడం ఆనందంగా ఉంది” అని మోదీ మరో పోస్ట్‌లో పేర్కొన్నారు.

సదానందన్ మాస్టర్ ఉపాధ్యాయుడిగా, సామాజిక కార్యకర్తగా ఆయన ప్రయత్నాలు ప్రశంసనీయం అని చెబుతూ యువత సాధికారత పట్ల ఆయనకు చాలా మక్కువ ఉందని తెలిపారు. “మీనాక్షి జైన్‌ ఒక పండితురాలిగా, పరిశోధకురాలిగా, చరిత్రకారిణిగా తన ప్రత్యేకతను చాటుకున్నారు. విద్య, సాహిత్యం, చరిత్ర, రాజకీయ శాస్త్ర రంగాలలో ఆమె విశేష కృషి చేశారన్నారు. విద్యా రంగంలో ఆమె చేసిన కృషికి గానూ 2020లో పద్మశ్రీ అవార్డును అందుకున్నారు” అని ప్రధాని వివరించారు.