తీన్మార్ మల్లన్న కార్యాలయంపై మరోసారి దాడి

తీన్మార్ మల్లన్న కార్యాలయంపై మరోసారి దాడి
మేడిపల్లిలో ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నకి సంబంధించిన క్యూ న్యూస్ కార్యాలయంపై మరోసారి దాడి జరిగింది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై మల్లన్న చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా జాగృతి కార్యకర్తలు క్యూ న్యూస్ కార్యాలయంపై దాడి చేశారు. దాడి సమయంలో కార్యాలయంలోనే తీన్మార్ మల్లన్న ఉన్నాడు.  మల్లన్న కార్యాలయంలో ఉన్న ఫర్నిచర్, అద్దాలను ధ్వంసం చేశారు. 
 
జాగృతి సభ్యులు బయటకి వెళ్లకపోతే కాల్పులు జరుపుతామని మల్లన్న గన్‌మెన్ హెచ్చరించాడు. గన్‌మెన్ హెచ్చరించినా కార్యాలయం నుంచి జాగృతి సభ్యులు వెళ్లకపోవడంతో గాల్లోకి 5 రౌండ్ల కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో జాగృతి సభ్యుడు సాయి అనే యువకుడికి గాయాలయ్యాయి. వెంటనే యువకుడిని ఆస్పత్రికి తరలించారు. ఆయన చేతి నుంచి బులెట్ వెళ్లినట్లు వైద్యులు గుర్తించారు. 
 
 కాగా, ఆఫీసులోని అద్దాలు ధ్వసం కావటంతో పలువురు తీవ్రంగా గాయపడ్డారు. మల్లన్న చేతికి కూడా స్వల్పంగా గాయమైంది. దీంతో ఆఫీసు మెుత్తం రక్తంతో తడిసిపోయి భీతావాహ పరిస్థితులు నెలకొన్నాయి. అనంతరం గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అక్కడ పరిస్థితిని పోలీసులు అదుపులోకి తీసుకొచ్చారు.
రాష్ట్రంలో జాగృతి కార్యకర్తలు, బీఆర్ఎస్ నేతలు శాంతి భద్రతలకు భంగం కలిగిస్తున్నారని తీన్మార్ మల్లన్న తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. క్యూ న్యూస్‌కి, తనకి భద్రత కల్పించాలని పోలీసులను తీన్మార్ మల్లన్న కోరారు. “మా గన్‌మెన్‌ చేతిలో గన్‌ తీసుకుని నాపై దాడి చేశారు. నా చేతికి గాయమైంది. మాపై దాడి చేయించిన వారు భవిష్యత్‌లో రాజకీయంగా సమాధి అవుతారు. నాపై హత్యాయత్నం చేసేందుకు కల్వకుంట్ల కవిత కుటుంబం తెగబడింది. కవిత కుటుంబమో మేమో తేల్చుకుంటాం. ప్రభుత్వంపై మేము పోరాడుతుంటే కవితకు ఏం బాధ?” అని ప్రశ్నించారు.

ఈ ఘటనపై మేడిపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా దాడికి పాల్పడిన వారిని గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు. తీన్మార్ మల్లన్న కార్యాలయంపై గతంలో కూడా పలుమార్లు దాడులు జరిగిన సంఘటనలు ఉన్నాయి. ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు, విమర్శల కారణంగా తరచుగా వార్తల్లో నిలుస్తుంటారు.