
ఐపీఎల్‌లో తొలి ట్రోఫీ నెగ్గిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) నిర్వహించతలపెట్టిన విజయోత్సవ ర్యాలీలో జరిగిన తొక్కిసలాటకు విధి నిర్వహణలో అధికారుల నిర్లక్ష్యమే ఈ ఘటనకు కారణంగా జ్యుడీషియల్ కమిషన్ స్పష్టం చేసింది. జూన్ 4న బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వెలుపల జరిగిన తొక్కిసలాట ఘటనకు ఆర్సీబీ, కర్ణాటక రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్, ఈవెంట్ నిర్వాహకులు డీఎన్‌ఏ ఎంటర్‌టైన్‌మెంట్, బెంగళూరు పోలీసులే బాధ్యులని వెల్లడించింది.
క్రౌడ్‌ను కంట్రోల్ చేయడం సాధ్యం కాదని తెలిసినప్పటికీ వారు ఈ కార్యక్రమాన్ని కొనసాగించారని పేర్కొంది. ఈ ఘటనలో 11 మంది ప్రాణాలు కోల్పోగా, సుమారు 50 మంది వరకూ గాయపడ్డారు. ఈ విషాద ఘటనపై ఏర్పాటైన ఏకసభ్య న్యాయ విచారణ కమిటీ తన నివేదికను ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు సమర్పించింది. పదవీ విరమణ పొందిన న్యాయమూర్తి జాన్ మైఖేల్ డి’కున్హా నేతృత్వంలోని ఈ కమిటీ ఈ దుర్ఘటనకు కర్ణాటక స్టేట్ క్రికెట్ అసోసియేషన్ (కేఎస్‌సీఏ), రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ), పోలీసుల నిర్లక్ష్యమే కారణమని స్పష్టం చేసింది.
ఈ ఘటనలో ప్రణాళిక, సమన్వయం, క్రౌడ్ మేనేజ్‌మెంట్‌లో లోపాలపై కమిషన్ దాదాపు నెల రోజుల పాటూ విచారణ జరిపింది. ఘటనాస్థలిని సందర్శించి ప్రత్యక్ష సాక్షులు, పోలీసు అధికారులు, కేఎస్‌సీఏ అధికారులు, ప్రభుత్వ ప్రతినిధుల నుంచి వాంగ్మూలాలను నమోదు చేసింది. ఈ విచారణలో స్టేడియం వద్ద భద్రతా ఏర్పాట్లు సరిగా లేవని గుర్తించింది. అంతేకాదు స్టేడియం లోపల 79 మంది పోలీసు సిబ్బంది మాత్రమే ఉన్నారని తెలిపింది.
స్టేడియం బయట ఒక్క పోలీసు, చివరికి అంబులెన్స్‌లు కూడా లేవని విచారణలో గుర్తించింది. అంతేకాకుండా, కీలక అధికారులు ఘటనపై తక్షణమే స్పందించడంలో విఫలమయ్యారని విచారణలో తేలింది. పోలీసుల యంత్రాంగం పూర్తిగా విఫలం అయింది చెప్పింది. అలాగే ఘటన జరిగిన తర్వాత సాయంత్రం 4 గంటల సమయంలోనే జాయింట్ కమిషనర్ వచ్చారని, 5.30 గంటల తర్వాతే పోలీసు కమిషనర్‌కు ఈ విషయంపై సమాచారం ఇచ్చారని వెల్లడించింది.
సోషల్ మీడియాలో వచ్చిన ప్రచారాలు, ఉచిత పాస్‌ల గురించిన ప్రకటనలు భారీ జన సమూహాన్ని ఆకర్షించాయని నివేదిక పేర్కొంది. ఇది తొక్కిసలాటకు ప్రధాన కారణాలలో ఒకటిగా మారినట్లు వెల్లడించింది. అంతేకాకుండా నిర్వాహకులు డిజిటల్ ప్రత్యామ్నాయాలు లేకుండా ఫిజికల్ టిక్కెట్లను జారీ చేయడాన్ని కూడా నివేదిక తీవ్రంగా విమర్శించింది. దీనివల్ల అనవసరమైన రద్దీ ఏర్పడిందని.. భద్రతా చర్యలు పూర్తిగా విఫలం అయ్యాయని స్పష్టం చేసింది.
అవసరమైన బారికేడింగ్ లేకపోవడం, జన సమూహం కదలికలకు స్పష్టమైన మార్గదర్శకాలు లేకపోవడం వంటి లోపాలను కూడా కమిటీ తన నివేదికలో గుర్తించింది. ఈ నివేదికను అందుకున్న ముఖ్యమంత్రి సిద్ధరామయ్య దానిని జూలై 17న జరగనున్న మంత్రివర్గ సమావేశంలో పరిశీలనకు ఉంచుతామని తెలిపారు. మంత్రివర్గం చర్చించిన అనంతరం ఈ ఘటనపై తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా నిరోధించడానికి, పెద్ద ఎత్తున ప్రజలు గుమిగూడే కార్యక్రమాలను నిర్వహించడానికి ఒక ప్రామాణిక కార్యాచరణ విధానాన్ని రూపొందించాలని నివేదిక ప్రభుత్వాన్ని కోరింది.
More Stories
హిందుస్తానీ సంగీతకారుడు పండిట్ చన్నులాల్ మిశ్రా మృతి
గాంధీజీ శాంతి, సహనం, సత్యం సందేశం మానవాళికి ప్రేరణ
మాలవీయ మిషన్ పేద విద్యార్థులకు ఆర్థిక సహాయం