
బిజెపి ప్రాథమిక సభ్యత్వానికి ఎమ్మెల్యే రాజాసింగ్ చేసిన రాజీనామాను పార్టీ నాయకత్వం ఆమోదించింది. దీంతో రాజాసింగ్ ప్రాతినిథ్యం వహిస్తున్న గోషామహల్ నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యం కానుంది.ఇక్కడి నుండి మూడు పర్యాయాలు బిజెపి అభ్యర్థిగా ఆయన గెలుపొందారు.
రాజ్యాంగంలోని పదవ షెడ్యూలు (పార్టీ ఫి రాయింపుల నిరోధక చట్టం) ప్రకారం ఎంపీ లేదా ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ స్వచ్ఛందంగా పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసినా, ఆ రాజీనామాను పార్టీ నాయకత్వం ఆమోదించినా సదరు సభ్యుని సభ్యత్వం రద్దవుతుంది. అయితే చట్టంలో ఒక మెలిక ఉంది. పదవ షెడ్యూలులోని ఆరవ సెక్షన్ ప్రకారం సదరు సభ్యుని సభ్యత్వం రద్దును స్పీకర్/చైర్మన్ నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది.
ఈ నిర్ణయం తీసుకోవడానికి ముందు సదరు సభ్యుని పార్టీ అగ్ర నాయకత్వం స్పీకర్‌కు లేఖ రాయాల్సి ఉంటుంది. తమ సభ్యుడు పార్టీకి చేసిన రాజీనామాను ఆమోదించడం జరిగింది కాబట్టి మీరు ఆ సభ్యుని సభ్యత్వం విషయంలో తదుపరి చర్యలు తీసుకోవాల్సిందిగా ఆ లేఖలో ఉండాలి.
పార్టీ నాయకత్వం నుంచి లేఖ రాని పక్షంలో అది పార్టీ అంతర్గత విషయంగానే ఉంటుంది. అలా లేఖ వచ్చిన తర్వాత కూడా సదరు సభ్యుని గుణగణాలను పరిగణలోకి తీసుకుని స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని పదవ షెడ్యూలులో స్పష్టంగా ఉంది. ఈ విషయంలో స్పీకర్ వెంటనే నిర్ణయం తీసుకోకుండా సదరు సభ్యున్ని పిలిపించుకుని ముఖాముఖిగా మాట్లాడిన తర్వాతే నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది.
ఇప్పుడు రాజాసింగ్ రాజీనామా విషయంలోనూ ఏమి జరుగుతుందనేది సస్పెన్స్‌గానే ఉంది. ఎందుకంటే రాజాసింగ్ పార్టీకి చేసిన రాజీనామాను పార్టీ జాతీయ నాయకత్వం ఆమోదించింది. రాజాసింగ్ రాజీనామాను ఆమోదించినట్లు పార్టీ నాయకత్వం స్పీకర్‌కు లేఖ పంపినా వెంటనే స్పీకర్ తగు చర్య తీసుకుంటారా? అనే సందేహం వ్యక్తం అవుతుంది.
వెంటనే రాజాసింగ్ సభ్యత్వాన్ని రద్దు చేసిన పక్షంలో ఇప్పటికే బిఆర్ఎస్ అభ్యర్థి మాగంటి గోపినాథ్ మృతితో త్వరలో జూబ్లీ హిల్స్ ఉపఎన్నిక జరుగనుంది. బహుశా బీహార్ ఎన్నికలతో పాటు అక్టోబర్ ప్రాంతంలో జరగగలదని భావిస్తున్నారు. ఆ ఉపఎన్నిక పాటు గోషామహల్ కు కూడా జరిపే అవకాశం ఉంది. అయితే బిఆర్ఎస్ నుండి కాంగ్రెస్ లో చేరిన ఎమ్యెల్యేల విషయమై ఎటూ తేల్చకుండా జాప్యం చేస్తున్న స్పీకర్ గోషామహల్ విషయంలో ఏవిధంగా వ్యవహరిస్తారో చూడాల్సి ఉంది.
More Stories
విద్యుత్తు ఏడీఈ అక్రమార్జన రూ. 200 కోట్లు… ఎసిబి అరెస్ట్
జీఎస్టీ 2.0 సంస్కరణలు వృద్ధిని ప్రేరేపించే చర్య
చరిత్రలో తెలంగాణ విమోచనకు అత్యంత ప్రాముఖ్యత