టిటిడిలో వేయి మందికి పైగా అన్యమతస్థులు

టిటిడిలో వేయి మందికి పైగా అన్యమతస్థులు
తిరుమల తిరుపతి దేవస్థానంలో వెయ్యి మందికి పైగా అన్యమతస్తులకు  ఉద్యోగాలిచ్చారని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ఆరోపించారు. మసీదులు, చర్చిల్లో బొట్టుపెట్టుకునే హిందువులకు ఉద్యోగాలిస్తారా? అని ప్రశ్నించారు. ప్రభుత్వాలు, పాలకులు మారినా ఆ అనవాయితీని ఎందుకు కొనసాగిస్తున్నారని మండిపడ్డారు. తక్షణమే వాళ్లను ఉద్యోగాలనుండి తొలగించాలని డిమాండ్ చేశారు. 
 
పుట్టిన రోజు సందర్భంగా గురువారం కుటుంబ సభ్యులతో కలిసి తిరుమలకు వచ్చిన సంజయ్ కుమార్ శ్రీవారిని దర్శించుకున్నారు.   ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ తెలుగు రాష్ట్రాల్లో కనీసం ధూపదీప నైవేద్యాలకు నోచుకోని దేవాలయాలను, అభివ్రుద్ధికి నోచుకోని పురాతన దేవాలయాలను గుర్తించి టీటీడీ నిధులను కేటాయించి, యుద్ద ప్రాతిపదికన ప్రణాళిక రూపొందించి అభివ్రుద్ధి చేయాలని ఆయన కోరారు. 
 
కరీంనగర్ లో వెంకటేశ్వరస్వామి ఆలయ నిర్మాణం కోసం భూమి పూజ చేశారని చెబుతూ వెంటనే నిర్మించాలని ఇల్లందకుంట రామాలయం, కొండగట్టు అంజన్న ఆలయాలకు నిధులు కేటాయించి అభివ్రుద్ధి చేయాలని విజ్ఞప్తి చేశారు. హిందువుల ఆస్తి తిరుమల. విదేశీయులు, అన్యమతస్తులు స్వామివారిని దర్శించుకోవాలంటే డిక్లరేషన్ తప్పనిసరి అని గుర్తు చేశారు. 
 
కానీ,  దురద్రుష్టమేమిటంటే టీటీడీలో వెయ్యి మందికిపైగా ఇతర మతస్తులు ఉద్యోగాలు చేస్తున్నారని విస్మయం వ్యక్తం చేశారు. వారికి హిందు మతంపై, దేవుడిపై నమ్మకం లేదు. అట్లాంటోళ్లకు ఉద్యోగాలివ్వమేంటి? వాళ్లను కొనసాగించడమేంటి? ఇట్లాంటి పద్దతి మంచిది కాదని స్పష్టం చేస్తూ ఇతర మతస్తులు టీటీడీలో పనిచేస్తున్నందున ఆచార వ్యవహారాల్లో తేడా వస్తోందని హెచహరించారు.
 
స్వామివారిపై నమ్మకంలేని వ్యక్తులకు జీతాలిచ్చి ఎందుకు పోషిస్తున్నారని ప్రశ్నించారు.  హిందువులంతా దీనిని వ్యతిరేకిస్తున్నారని చెబుతూ ఎప్పుడో వాళ్లను నియమించారని చెప్పి తప్పించుకోవడం సరికాదని హితవు చెప్పారు. తక్షణమే వాళ్లను తొలగించాలని డిమాండ్ చేశారు. సనాతన ధర్మానికి వ్యతిరేకంగా పనిచేస్తున్న వాళ్లను కొనసాగించడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేశారు. ఓటు బ్యాంకు రాజకీయాలు సరికాదని పేర్కొంటూ ఇది హిందువుల ఆస్తి అని తేల్చి చెప్పారు.
 
మసీదులు, చర్చిల్లో బొట్టుపెట్టుకుని హిందువులు వెళితే ఉద్యోగాలిస్తారా? ఇవ్వరు కదా? అట్లాంటప్పుడు టీటీడీలో అన్యమతస్తులకు ఉద్యోగాలెలా ఇస్తారు?  ప్రభుత్వాలు, పాలకులు మారినా ఇంకా ఈ ఆనవాయితీని కొనసాగించడం మంచి పద్దతి కాదని చెప్పారు.