1977లో ఓటమి భయంతో ఆర్ఎస్ఎస్ చెంతకు ఇందిరా గాంధీ!

1977లో ఓటమి భయంతో ఆర్ఎస్ఎస్ చెంతకు ఇందిరా గాంధీ!
డా. వడ్డీ విజయ సారధి,
ప్రముఖ రచయిత, `జాగృతి’ పూర్వ సంపదకులు

మధుసూదన వామన మోఘే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) అఖిలభారత బౌద్ధిక ప్రముఖ్ గా ఉండేవారు. (వీరు 1946-59 మధ్య ఆంధ్ర ప్రాంత ప్రచారక్ గా పనిచేశారు. జాగృతి వార పత్రికను ప్రారంభింప జేసినది వీరే).  1977లోక సభ ఎన్నికలు జరిగి, ఆర్ ఎస్ ఎస్ పై నిషేధం తొలగి జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత  వీరికి సన్నిహితుడైన ఒక కార్యకర్త  ఎమర్జెన్సీ ప్రతిఘట నోద్యమం ఎలా జరిగిందో గ్రుచ్చి గ్రుచ్చి అడిగి చాలా విషయాలు తెలుసుకొన్నారు. 
 
వారు కూడా ఈ ప్రశ్న అన్నింటికీ విపులంగా జవాబులిచ్చారు. మనం ఇప్పుడు ఆలోచిస్తున్న కీలకమైన రెండు ప్రశ్నలకు వారిచ్చిన సమాధానాలు గమనార్హమైనవి. ఎప్పటికీ గుర్తుంచుకో వలసినవి .

* ఆ సమయంలో ఇందిరాగాంధీ ఎన్నికలు ప్రకటించటంలోని ఆంతర్య మేమిటంటారు? అది ఆమె చేసిన  పెద్ద పొరపాటు కాదా?

తాను విధించిన ఎమర్జెన్సీకి ఒక సైద్ధాంతిక రూపమివ్వడానికై శ్రీమతి ఇందిరాగాంధీ మొదటి నుంచి తంటాలు పడుతూ వచ్చింది. కాబట్టి పరిస్థితులు తనకు అనుకూలంగా ఉన్నాయని భావించిన తక్షణం ఎన్నికలు ప్రకటిస్తుందని చాలామంది భావించారు.  ఆమె ఎన్నికలు ప్రకటించ డానికి గల కారణాలు కచ్చితంగా వివరించలేక పోయినప్పటికీ అమెరికా అధ్యక్షుడు జిమ్మీ కార్టర్ విధించిన ఆర్థిక దిగ్బంధనాలు, దేశంలో దినదినం దిగజారి పోతున్న ఆర్థిక పరిస్థితి, ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా అజ్ఞాతంగా సాగుతున్న ఉద్యమం ప్రజల్లో రగుల్కొల్పిన అసంతృప్తి ముఖ్య కారణాలుగా పేర్కొనవచ్చు.

దేశం ఎదుర్కొంటున్న ఆర్థిక పరిస్థితి రానురాను ఇంకా దిగజారి పోయే సూచనలు ఉన్నాయి. కాబట్టి ఎన్నికలు అంటూ పెట్టేటట్లయితే ఇప్పుడే పెట్టాలని తన ఆర్థిక సలహాదారు లిచ్చిన సలహా కూడా ఆమెపై పని చేసి ఉంటుంది.  అంతేగాక నియంతృత్వంలో ఎక్కడైనా నియంత చుట్టూ భజనపరులు చేరుతారు. వారు ప్రయోజన కరమైన సలహాల కంటే, నియంతకు ఇష్ట మయ్యే సలహాలే చెప్తుంటారు. 

 
21 మాసాలు ఎమర్జెన్సీ పాలనలో సాగిన దమనకాండ చూశాక ఇందిరా గాంధీకి వ్యతిరేకంగా ఓటు వేసే సాహసం సామాన్య ప్రజలెవరూ చేయజాలరనే భ్రమ కూడా ఉండి ఉండవచ్చు. ఈ కాలంలో ఇందిరాగాంధీ వ్యవహరించిన తీరు విదేశాల్లో ఆమెను అప్రతిష్ఠ పాలు చేసింది. వీటన్నింటి నుండి బయట పడాలంటే ఎన్నికలు నిర్వహించి ఘన విజయం సాధించటం ద్వారా మాత్రమే సాధ్యమవుతుందని  ఆమె భావించి ఉంటుంది.

ఆమె సమర్థకుల అభిప్రాయంలో ఆమె చేసిన మొదటి పొరపాటు ఆర్ఎస్ఎస్ పై నిషేధం విధించటం అయితే, రెండో పొరపాటు ఎన్నికలు ప్రకటించటం. ఎన్నికలు ప్రకటించాక రోజురోజుకూ పరిస్థితులు ఆమెకు ప్రతికూలం అవుతూ పోయాయి. ప్రజలు తమ అసంతృప్తిని గట్టిగా వ్యక్తీకరించడం ప్రారంభించారు. ఇందిరాగాంధీ పాలనకు మంగళం పాడందే సంఘం పైన నిషేధం తొలగిపోదు. దేశం భవిష్యత్తు కూడా బాగు పడదు అని సంపూర్ణంగా గ్రహించిన స్వయం సేవకులు ఇందిరను ఓడించడానికి తమ సర్వశక్తినీ ఒడ్డి పనిచేశారు. విజయం సాధించారు.

* లోక సంఘర్షణ సమితి కార్యకలాపాల నుండి ఆర్ ఎస్ ఎస్ ను తప్పించేందుకు శ్రీమతి ఇందిర ప్రయత్నించ లేదా?

తలకొకదారిగా పనిచేస్తున్న రాజకీయ పక్షాలన్నింటినీ ఏకతాటిపైకి తెచ్చి కలిసికట్టుగా తనకు పోటీగా నిలిపే సత్తా ఒక్క ఆర్ ఎస్ ఎస్ కే ఉన్నదన్న విషయం ఇందిరా గాంధీకి తెలుసు. అందుచేత తన ముఖ్య తాబేదారులలో ఒకరిని పంపించి ముఖ్యులైన సంఘ అధికారులతో శ్రీమతి ఇందిరాగాంధీ సంభాషణలు జరపాలని కోరుకొంటున్నది అనే వర్తమానం అందించింది.

 
సంఘంలోని ఉన్నతాధికారులు ఎక్కడ దొరుకుతారో తెలియదుకాని, వర్తమానం ఎక్కడికి పంపిస్తే వారికి చేరుతుందో అది మాత్రం ఆమెకు తెలుసు. ఆమె పంపిన అధికారితో సంఘంలోని ముఖ్యులు ఒకరు ఒక గంట, గంటన్నర పాటు మాట్లాడారు. ఆ సంభాషణలో చోటుచేసుకున్న ముఖ్య విషయం ఒక్కటే.

సంఘ స్వయంసేవకులు తమ యువశక్తిని వినియోగించి శ్రీమతి ఇందిర ప్రభుత్వాన్ని ఎన్నికల్లో ఓడించే కార్యంలో నిమగ్నులై ఉన్నారు. వారు ఈ ప్రయత్నం విరమించాలని, వారు ఆవిధంగా ఒప్పుకొంటే, సంఘం పైన నిషేధం ఎత్తివేయడం, జైళ్లలో ఉన్న స్వయంసేవకు లందరినీ విడుదల చేయడం జరుగుతుంది. ‘రాజీ అంటూ కుదిరితే కొంత మీరు తగ్గటం, కొంత మేము తగ్గటం అనేది ఎలాగూ ఉంటుంది’ అని కూడా స్పష్టం చేశాడు మధ్యవర్తిత్వం కోసం  వచ్చిన అధికారి.

దానికి జవాబుగా సంఘం అధికారులు “పూజ్య శ్రీ బాలాసాహెబ్ వ్రాసిన ఉత్తరాలు కూడా ఆమెకు అందకుండా చూశారు. అప్పుడే ఉత్తర ప్రత్యుత్తరాలు కొనసాగితే, అప్పటి మాట ఎలా ఉండేదో కాని, ఇప్పుడు మాత్రం మీ ప్రస్తావనను అంగీకరించే అవకాశం లేదు. ఇప్పుడిక ఈ సమస్య పరిష్కారం ఎన్నికలద్వారా తేల్చు కోవాల్సిన దే! అన్న నిర్ణయానికి వచ్చారు స్వయం సేవకులు. కాబట్టి వారు తమ యావ,శక్తిని వినియోగించి ఎన్నికల రణరంగంలో జొరబడ్డారన్నది సత్యం. ఇప్పుడిక ఆ పోరాటం నుండి వారిని విరమింపజేసే ప్రశ్న ఉత్పన్నం కాదు”అని స్పష్టం చేశారు

అప్పుడు ఆ అధికారి “21 మాసాలు జైళ్లలో మ్రగ్గిపోయిన కారణంగా ఖైదీల్లో ఆత్మబలం నశించి ఉంటుంది. ఇంకెంత కాలం వారు పట్టు సడలకుండా ఉండగలరు?” అని అడిగాడు.

“జైళ్లలో ఉన్న స్వయంసేవకుల కుటుంబాల యోగ క్షేమాలు మేము నిరంతరం విచారిస్తూనే ఉన్నాం. వారందరితో మాకు సన్నిహిత సంబంధాలున్నాయి. వారి మనోనిశ్చయం, నైతికశక్తి ఏమాత్రం సడలిపోలేదు. ఇంకా రెండు మూడేళ్లు జైలులో ఉండవలసిన వచ్చినా, వారి మానసిక స్థితిలో ఎలాంటి మార్పు రాదు. మేము అలిసి పోయామని అనుకొంటున్నారేమో, అదేమీ లేదు. ఇంకా రెండు మూడేళ్లు పోరాటం సాగినా, అందుకు సిద్ధంగానే ఉన్నాం”.

మీరు మీ వైపు నుంచి ఆలోచిస్తున్నారు. మా ఆలోచనలు తద్భిన్నంగా ఉంటాయి. స్వయంసేవకులు జైళ్ల నుండి విడుదలై వచ్చాక సమాజంలో కలిసి పనిచేయాలి. వారు ధర్మపోరాటం సాగించారనే ఆత్మ విశ్వాసంతో సగర్వంగా తలెత్తుకు తిరిగే రీతిగా ఈ పోరాటం ముగియాలి. మీ దయాదాక్షిణ్యాలమీద ఆధారపడి కాదు.  మీ మాటలు నమ్మి ఇప్పుడు పోరాటం ఆపేస్తే, సమాజాన్ని మోసం చేసి నట్లు, ప్రజలు నమ్మకాన్ని వమ్ము చేసినట్లు అవుతుంది. వీరి మొఖాన ప్రజలు కళ్లాపు నీళ్లు చల్లుతారు. ఇందుకు మా స్వయంసేవకులు సిద్ధపడతారని మీరు అనుకుంటున్నారా?

నిషేధం ఎత్తివేయడం, జైళ్లలో ఉన్న స్వయంసేవకులను విడిచి పెట్టటం అనేది మీరు తీసుకోవలసిన నిర్ణయాలు. మీ ప్రకటనలో సంఘాన్ని అవమానపరిచే ప్రయత్నం ఇసుమంత ఉన్నా, మా ఆగ్రహాన్ని చవిచూస్తారు! స్వయంసేవకులను తిరిగి ఉద్యోగాల్లో చేర్చుకోవాలి. మా కార్యాలయాలకు వేసిన సీళ్లు తీయించి మా ఆస్తులు మాకు అప్పగించాలి” అని సంఘ్ అధికారులు స్పష్టంగా చెప్పారు.

అప్పుడు ఆ అధికారి “మీ సమాధానం ఇలా ఉంటుందని నేను ముందే ఊహించాను. ఏదో కొద్దిమంది వృద్ధ కార్యకర్తలు జైళ్లలో ఉన్నారు. బాగా పనిచేసే కార్యకర్త లందరూ బైటే ఉన్నారు. మేము బహుకొద్దిమందిని మాత్రమే అరెస్టు చేయగలిగాం. ఇకపోతే మీసా క్రింద అరెస్టయిన కార్యకర్తల కుటుంబాల సంగతి మీరు బాగా పట్టించుకొంటున్నారు. వారికి పెద్ద బాధ లేదు. మీ సంఘటన చెక్కుచెదరకుండా ఉంది. ఉన్నతాధికారులు దేశమంతా పర్యటన చేస్తూనే ఉన్నారు. ఇక మీరు నష్టం పోయే దేముంది!” అంటూ సెలవు తీసుకున్నాడు.