హెచ్‌సీఏ వ్యవహారంపై ఈడీ దృష్టి

హెచ్‌సీఏ వ్యవహారంపై ఈడీ దృష్టి
 
తెలంగాణ క్రికెట్‌ అసోసియేషన్‌ (టీసీఏ)  వ్యవహారంపై ఈడీ దృష్టి సారించింది. హెచ్‌‌సీఏలో అవకతవకలపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ రంగంలోకి దిగింది. హెచ్‌సీఏపై నమోదు చేసిన కేసు వివరాలు ఇవ్వాలని సీఐడీకి ఈడీ లేఖ రాసింది. ఎఫ్‌ఐఆర్, రిమాండ్ రిపోర్టు, కేసు వివరాలు, వాంగ్మూలాలు ఇవ్వాలని కోరింది. సీఐడీ నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్ ఆధారంగా ఈడీ ఈసీఐఆర్ నమోదు చేయనుంది. 
 
కాగా హెచ్‌సీఏ స్కామ్‌పై ఓవైపు సీఐడీ దర్యాప్తు కొనసాగుతోంది. ఇప్పటికే ఈ స్కామ్‌కు సంబంధించి ఐదుగురు నిందితులను అరెస్ట్ చేసి జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించారు. హెచ్‌సీఏ అధ్యక్షుడు జగన్మోహన్ రావు, ట్రెజర్ శ్రీనివాస్‌రావు, సీఈఓ సునీల్, శ్రీచక్ర క్రికెట్ క్లబ్క్లబ్ కార్యదర్శి రాజేందర్ యాదవ్‌ చర్లపల్లి జైలులో ఉండగా.. శ్రీచక్ర క్రికెట్ క్లబ్ అధ్యక్షురాలు కవిత చంచల్‌గూడా మహిళా జైలులో ఉన్నారు.
హెచ్‌సీఏలో కోట్ల రూపాయలు గోల్‌మాల్ జరిగిందనే ఆరోపణల నేపథ్యంలో ఈడీ కూడా ఫోకస్ పెట్టింది. ఇప్పటికే సీఐడీ నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్ ఆధారంగా ఈడీ కూడా ఈసీఐఆర్ నమోదు చేసే అవకాశం ఉంది. ఈసీఐఆర్ నమోదు చేయాలంటే ఇప్పటికే సీఐడీ దర్యాప్తు చేసిన ఆధారాలు కావాల్సి ఉంటుంది. ఈ క్రమంలో ఎఫ్‌ఐఆర్, రిమాండ్ రిపోర్టు, కేసు వివరాలు, వాంగ్మూలాలు ఇవ్వాలంటూ సీఐడీకి ఈడీ లేఖ రాసింది. 

రెండు మూడు రోజుల్లోనే ఈ కేసుకు సంబంధించిన వివరాలను ఈడీకి అందజేసిన తర్వాత ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఈసీఐఆర్ నమోదు చేసి నిందితులకు నోటీసులు జారీ చేసి విచారణ జరిపే అవకాశం ఉంది. నిందితులకు బెయిల్ రాకుండా జైలులో ఉన్నట్లైతే పీటీ వారెంట్‌పై లేదా కోర్టు అనుమతితో కస్టడీలోకి తీసుకుని విచారించనున్నట్లు తెలుస్తోంది. హెచ్‌సీఏ వ్యవహారంలో మనీలాండరింగ్ ఏమన్నా ఉందా అనే దానిపై ఈడీ దృష్టిపెట్టే అవకాశం ఉంది.