కోయంబత్తూరు పేలుళ్ల  నిందితుడు 29 ఏళ్ళకు అరెస్ట్

కోయంబత్తూరు పేలుళ్ల  నిందితుడు 29 ఏళ్ళకు అరెస్ట్
కోయంబత్తూరు వరుస పేలుళ్ల కేసులో కీలక నిందితుడు ‘టైలర్‌’ రాజు 29 ఏళ్ల తరువాత తమిళనాడు పోలీసులకు పట్టుబడ్డాడు. 1996 కోయంబత్తూర్ బాంబు పేలుళ్ల కేసులో ప్రధాన నిందితుడు సాదిక్‌ను తమిళనాడు పోలీసులు గురువారం రాత్రి అదుపులోకి తీసుకున్నారు. యాంటీ టెర్రరిజం స్క్వాడ్, కోయంబత్తూర్ నగర పోలీసుల ప్రత్యేక బృందం కలసి కర్ణాటక విజయపుర జిల్లాలో అతడ్ని పట్టుకున్నారు. 
 
ఆ తర్వాత కోర్టులో హాజరు పరిచారు. అనంతరం జ్యుడీషియల్ రిమాండ్‌లో భాగంగా నిందితుడ్ని కోయంబత్తూర్ సెంట్రల్ జైలుకు తరలించారు. 29 సంవత్సరాలుగా పరారీలో ఉన్న సాదిక్ నేర చరిత్ర పెద్దగానే ఉంది.  సాదిక్‌కు టైలర్ రాజా, వలరంత రాజా, షాజహాన్ అబ్దుల్ మజీద్ మకందర్, షాజహాన్ షేక్ అనే మారుపేర్లు కూడా ఉన్నాయి. 1996 ఫిబ్రవరి 14న కోయంబత్తూర్‌లో బాంబు పేలుళ్లు జరిగాయి. 
 
ఈ ఘటనలో 58 మంది మృతి చెందగా దాదాపుగా 200 మంది గాయపడ్డారు. ఈ బాంబు దాడుల్లో కీలకపాత్ర పోషించిన సాదిక్.. అప్పటి నుంచి పోలీసులకు దొరకకుండా తప్పించుకొని తిరుగుతున్నాడు. అల్-ఉమ్మా సంస్థకు అతడు నేరుగా బాంబులు సరఫరా చేశాడనే ఆరోపణలు ఉన్నాయి. కోయంబత్తూర్ బాంబు పేలుళ్ల కేసులో మొత్తం 181 మంది నిందితులు ఉండగా వారిలో 178వ నిందితుడిగా సాదిక్ రాజా ఉన్నాడు.
 
కోయంబత్తూర్‌కు పేలుడు పదార్థాలను రవాణా చేయడమే గాక అల్-ఉమ్మా నిందితులకు అతడు ఆశ్రయిం కల్పించినట్లు పోలీసుల విచారణలో తేలింది. ఈ ఘటన తర్వాత తమిళనాడు నుంచి బెంగళూరుకు ఆ తర్వాత హుబ్బలికి మకాం మార్చిన సాదిక్.. గత 12 ఏళ్లుగా విజయపురలో ఉంటున్నట్లు సమాచారం. కోయంబత్తూరు కేసుతోపాటు పలు హత్య కేసుల్లో నిందితుడైన రాజు 1996 తరువాత ఎప్పుడూ పోలీసులకు పట్టుబడకపోవడం గమనార్హం.
 
కూరగాయల వ్యాపారం చేస్తూ ఓ స్థానిక మహిళను పెళ్లి చేసుకొని అక్కడే సెటిల్ అయ్యాడని తెలుస్తోంది. కోయంబత్తూర్ పేలుళ్లతో పాటు మధురై, నాగోర్‌లో జరిగిన రెండు హత్య కేసుల్లోనూ అతడి ప్రమేయం ఉందని నిర్ధారణ అయింది. సాదిక్‌పై భారతీయ శిక్షా స్మృతి సెక్షన్‌లు 120-బీ (క్రిమినల్), 302 (హత్య), 307 (హత్యాయత్నం), 465 (మోసం) కింద కేసు నమోదు చేశారు.