
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా మానవాళికి వ్యతిరేకంగా నేరాలకు పాల్పడినట్లు ఇంటర్నేషనల్ క్రైమ్స్ ట్రైబ్యూనల్ గురువారం అభియోగాలు మోపింది. వీటిపై ఆగస్టు 3వ తేదీన విచారణ చేపట్టనుంది. ఆమెతో పాటు అప్పటి హోం మంత్రి అసదుజ్జామన్ కాన్ కమల్, ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ చౌధ్రీ అబ్దుల్లా అల్ మమున్‌పై ఐసీటీ నేరాభియోగాలు మోపిందని ప్రాసిక్యూషన్ లాయర్ మీడియాకు వెల్లడించారు.
విద్యార్థుల ఆధ్వర్యంలో గతేడాది జులై-ఆగస్టులో జరిగిన ఉద్యమాన్ని అణచివేసేందుకు షేక్ హసీనా ప్రయత్నాలు చేసినట్లు ప్రాసిక్యూటర్ వెల్లడించారు. ఉద్యమకారులను భారీ సంఖ్యలో చంపించడం, హింసించడం వంటి నేరాభియోగాలు కూడా ఆమెపై ఉన్నట్లు పేర్కొన్నారు. ఈ విచారణకు మమున్ మాత్రమే వ్యక్తిగతంగా హాజరుకానున్నారు. హసీనా ఉద్యమకారులను అణచివేయమని ఆదేశిస్తున్నట్లు చెబుతున్న ఓ ఆడియో క్లిప్‌ను పశ్చిమ దేశాలకు చెందిన మీడియా సంస్థ వెలుగులోకి తెచ్చింది.
సీనియర్ పోలీసు అధికారికి ఈ ఆదేశాలు జారీ చేసినట్లు సదరు సంస్థ పేర్కొంది. ఇదిలా ఉండగా మాజీ ప్రధాని షేక్ హసీనాను అప్పగించాలని బంగ్లాదేశ్ మరోసారి భారత్‌కు విజ్ఞప్తి చేసింది. దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న హసీనా అప్పగింత అభ్యర్థనను మనసాక్షితో ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని కోరింది. ఈ మేరకు బంగ్లా తాత్కాలిక ప్రభుత్వ అధినేత మహమ్మద్ యూనస్ మీడియా కార్యదర్శి ఓ ప్రకటన విడుదల చేశారు.
మాజీ ప్రధాని హసీనా నాయకత్వంలో పౌరుల హత్యలు జరిగాయనే ఆరోపణలకు సంబంధించి ఐరాస, బీబీసీసహా అంతర్జాతీయ నివేదికలు, డేటాను ఆయన సామాజికమాధ్యమం ద్వారా పంచుకున్నారు. బంగ్లాలో గతేడాది జరిగిన విద్యార్థుల ఆందోళనలు తీవ్ర హింసాత్మకంగా మారడం వల్ల అవామీ లీగ్ అధినేత్రి షేక్ హసీనా ప్రధాని పదవి నుంచి తప్పుకొని భారత్‌లో ఆశ్రయం పొందుతున్నారు.
హసీనాను అప్పగించాలనే తమ అభ్యర్థనను దీర్ఘకాలం నుంచి భారత్ తిరస్కరిస్తోందని యూనస్ మీడియా కార్యదర్శి పేర్కొన్నారు. మానవతకు వ్యతిరేకంగా నేరాలకు పాల్పడ్డారని ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తిని భారత్ చాలాకాలం కాపాడలేదన్నారు. ఉద్దేశపూర్వకంగా పౌరులను హత్య చేయటం క్షమించరాని నేరమని యూనస్ మీడియా కార్యదర్శి అన్నారు.
More Stories
పాక్-సౌదీ రక్షణ ఒప్పందంలో మరిన్ని ముస్లిం దేశాలు
హెచ్-1బీ వీసా దరఖాస్తులకు లక్ష డాలర్ల రుసుము
అవినీతిపై పోరాడతా, ఉద్యోగాలు కల్పిస్తా