కృత్రిమ మేధ (ఏఐ)తో ఉద్యోగాలు పోతున్నాయని ప్రపంచవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్న వేళ మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ వచ్చే 100 ఏళ్లయినా ప్రోగ్రామర్లను కృత్రిమ మేధ భర్తీ చేయలేదని స్పష్టం చేశారు. కోడింగ్‌కు మానవ మేధ చాలా అవసరమని ఆయన స్పష్టం చేసారు. “ప్రోగ్రామింగ్ రంగంలో ఏఐ మనకు అసిస్టెంట్‌గా పనిచేస్తుంది. డీబగ్గింగ్ లాంటి బోరింగ్ విషయాల్లో మనకు సాయం చేస్తుంది. అంతేకాని మానవులకు ఏఐ అనేది ఎప్పుడూ పూర్తి ప్రత్యామ్నాయంగా మారే అవకాశం లేదు. ప్రోగ్రామింగ్‌లో అత్యంత క్లిష్టమైనది- సమస్యను సృజనాత్మకంగా పరిష్కరించడం. దాన్ని మెషిన్స్ చేయలేవు” అని తెలిపారు.
“కుత్రిమ మేధస్సు కూడా ఆ పని పెర్ఫెక్ట్గా చేయలేదు. ప్రోగ్రామింగ్‌కు జడ్జిమెంట్, ఊహాత్మక ఆలోచనా ధోరణి, పరిస్థితులకు అనుకూలంగా సర్దుబాటు చేయడం లాంటివి అవసరం. ఈ లక్షణాలు ఏఐలో ఉండవు” అని బిల్‌గేట్స్ చెప్పారు.వాస్తవానికి కోడింగ్ రాయడం అంటే కేవలం టైపింగ్ చేయడం కాదని, కోడింగ్ కోసం చాలా లోతుగా ఆలోచించాల్సి ఉంటుందని బిల్‌గేట్స్ తెలిపారు.
మానవ మేధకు ఉండే సృజనాత్మకత- మరే అల్గారిథమ్కు ఉండదనిచెప్పారు. కోడింగ్, బయాలజీ, ఎనర్జీ మేనేజ్‌మెంట్ రంగాలకు ఆటోమేషన్ ముప్పు తక్కువేనని బిల్ గేట్స్ అంచనా వేశారు. సమస్యలను పరిష్కరించే సామర్థ్యం, సృజనాత్మకత, పరిస్థితులకు తగ్గట్టుగా సామర్థ్యాన్ని మెరుగుపర్చుకొనే లక్షణాలు మానవులకు మాత్రమే ఉంటాయని తెలిపారు. వీటిని ఏఐ ఇంకా సొంతం చేసుకోలేకపోవడమే ఇందుకు కారణమని బిల్ గేట్స్ చెప్పారు.
ఇటీవల వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ 2030 నాటికి ప్రపంచవ్యాప్తంగా 8.5 కోట్ల ఉద్యోగాలను కృత్రిమ మేధ (ఏఐ) భర్తీ చేసే అవకాశం ఉందని అంచనా వేసింది. అదే సమయంలో ఏఐ వల్ల 9.7 కోట్ల కొత్త ఉద్యోగాల సృష్టి జరగవచ్చని ఆశాభావం వ్యక్తంచేసింది. దీనిపైనా బిల్ గేట్స్ స్పందించారు. ఏఐ వల్ల ఉద్యోగులకు పొంచి ఉన్న ముప్పు గురించి తానూ ఆందోళన చెందుతున్నట్లు తెలిపారు. అయితే, కృత్రిమ మేధను తెలివిగా వినియోగించుకుంటే, మన ఉత్పాదకత బాగా పెరిగి, మరింత ఎక్కువ సమయం ఆదా చేసుకోవచ్చని ఆయన వివరించారు.

More Stories
భారత్, అమెరికాల మధ్య 10 ఏళ్ల రక్షణ ఒప్పందం
చాబహార్ పోర్ట్‌పై అమెరికా ఆంక్షల నుండి తాత్కాలిక ఊరట
అమెరికాలో వర్క్ పర్మిట్ ఆటోమేటిక్ రెన్యువల్ రద్దు