భార‌త్ ను మిన‌హాయించి 22 దేశాలపై ట్రంప్ సుంకాలను

భార‌త్ ను మిన‌హాయించి 22 దేశాలపై ట్రంప్ సుంకాలను
అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ట్రంప్ తన నిర్ణయాలతో అన్ని దేశాలకు షాకిస్తూ వస్తున్నారు. ఇప్పటికే వివిధ దేశాలపై ఎడాపెడా పన్నులు విధించిన ట్రంప్ ఆ నిర్ణయాన్ని 90 రోజుల పాటు నిలిపేశారు. ఇప్పుడు ఆ గడువు ముగుస్తుండడంతో మళ్లీ టారీఫ్‌ల మోతకు సిద్ధమయ్యారు. తన షరతులకు అంగీకరించి, తమతో ఒప్పందం కుదుర్చుకుంటే సరే, లేకపోతే కఠిన ఆంక్షలు విధిస్తామని ట్రంప్ ఇప్పటికే హెచ్చరించారు. 

చైనా, యూకే వంటి దేశాలతో ఒప్పందాలు కుదిరాయని,  త్వరలోనే ఆ జాబితాలో భారత్ కూడా చేరుతుందని చెప్పారు. ఈ క్రమంలో అమెరికా షరతులకు లొంగని వివిధ దేశాలకు ట్రంప్ లేఖలు రాశారు. అందులో ఎంత టారీఫ్‌లు విధిస్తామనే విషయాన్ని వివరించారు. తాజాగా బ్రెజిల్‌ పై 50 శాతం పన్నులు విధించారు. 

బ్రెజిల్, ఫిలిప్పీన్స్, శ్రీలంక, బ్రూనై, అల్జీరియా, లిబియా, ఇరాక్, మోల్డోవా సహా వివిధ దేశాలకు ట్రంప్ టారీఫ్ లేఖలు పంపిచారు. ఆగస్టు 1 నుండి ఈ టారీఫ్‌లు అమల్లోకి వస్తాయని అందులో స్పష్టం చేశారు.ప్రస్తుతానికి 22 దేశాలకు ట్రంప్ లేఖలు అందాయి. వాటిలో అమెరికా మిత్రదేశాలు జపాన్, దక్షిణ కొరియా సహా ఇండోనేషియా, బంగ్లాదేశ్, థాయిలాండ్ వంటి దేశాలు కూడా ఉండడం గమనార్హం. 

ప్రధానంగా బ్రెజిల్‌పై ట్రంప్ 50శాతం పన్ను విధించారు. అంతేకాకుండా మయన్మార్, లావోస్ దేశాలపై 40శాతం, కాంబోడియా, థాయిలాండ్ దేశాలపై 36శాతం, బంగ్లాదేశ్, సెర్బియా దేశాలపై 35శాతం, ఇండోనేషియాపై 32శాతం పన్ను విధించారు. శ్రీలంక, లిబియా, ఇరాక్ దేశాలపై 30శాతం, జపాన్, కజకిస్తాన్, మలేషియా, సౌత్ కొరియా, ట్యునీషియా దేశాలపై 25శాతం పన్న విధించారు. బ్రూనై, మోల్డోవా దేశాలపై 25శాతం, ఫిలిప్పీన్స్ పై 20శాత పన్ను విధించారు.

ఇక బ్రిక్స్ దేశాలపై కూడా ట్రంప్ ఆగ్రహం వెళ్లగక్కారు. ఆ కూటమి డాలర్‌ను బలహీన పరిచేందుకు ప్రయత్నిస్తోందని పేర్కొంటూ అందుకే ఆ దేశాలపై అదనంగా 10 శాతం పన్ను విధిస్తున్నట్లు తెలిపారు. భారత్‌తో పాటు బ్రెజిల్ కూడా బ్రిక్స్ దేశంలో భాగమే. అయితే బ్రెజిల్ మాజీ ప్రెసిడెంట్ బోల్సోనారోపై అవినీతి కేసు నమోదు చేయడాన్ని ట్రంప్ గతంలో తప్పుబట్టారు. దీనిపై ఇటీవల బ్రెజిల్ ఘాటుగా స్పందించగా ఇప్పుడు ట్రంప్ 50 శాతం పన్ను విధించడం చర్చనీయాంశంగా మారింది.