కేసీఆర్ ఇలాఖా నుంచి బిజెపిలో భారీగా చేరికలు

కేసీఆర్ ఇలాఖా నుంచి బిజెపిలో భారీగా చేరికలు
బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ పార్టీలు ప్రజల విశ్వాశాన్ని కోల్పోయాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రాంచందర్‌రావు స్పష్టం చేశారు. రాష్ట్రంలో కొత్త రాజకీయ ప్రత్యామ్నాయంగా బీజేపీని ప్రజలు చూస్తున్నారని తెలిపారు. బీజేపీపై ప్రజల్లో విశ్వాసం పెరుగుతోందని, అందుకే అధికార పార్టీనీ విడిచి, యువత, మహిళలు, ఇతర పార్టీల నాయకులు పెద్ద ఎత్తున బీజేపీలో చేరుతున్నారని చెప్పారు. 
 
గజ్వేల్‌- ప్రజ్ఞాపూర్‌ మునిసిపల్‌ మాజీ చైర్మన్‌ గాడిపల్లి భాస్కర్‌, ఆయన అనుచరులతోపాటు కాంగ్రెస్‌, బీఆర్‌ఎ్‌సకు చెందిన 200 మంది కార్యకర్తలు బుధవారం బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా రాంచందర్‌రావు మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రభుత్వం ఉందో లేదో అర్థం కావడం లేదని, సీఎం ఢిల్లీ చుట్టూ తిరగడం.. బీజేపీని తిట్టడం తప్ప చేసిందేమీ లేదని పేర్కొంటూ పెన్షన్లు, రైతు భరోసా పంపిణీలో రేవంత్‌ విఫలమయ్యారని ధ్వజమెత్తారు.
 
ప్రస్తుతం మెదక్ ఎంపీగా బిజెపి నుంచి రఘునందన్ రావు గారు ప్రాతినిధ్యం వహిస్తుండగా ఇదే మెదక్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి గతంలో ఇందిరా గాంధీ  ప్రాతినిధ్యం వహించారని గుర్తు చేసారు. అదే విధంగా గజ్వేల్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి గెలిచిన కేసీఆర్ గతంలో ముఖ్యమంత్రిగా పనిచేశారని చెప్పారు.
 
హేమాహేమీ నాయకులు ప్రాతినిధ్యం వహించిన ఈ నియోజకవర్గం నుంచి బిజెపిలో పెద్ద ఎత్తున చేరికలు జరగడం పట్ల రామచందర్ రావు సంతోషం వ్యక్తం చేశారు.  రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల దృష్ట్యా కొంతమంది కాంగ్రెస్ నాయకులు ఢిల్లీకి వెళ్లి నాటకాలు ఆడుతున్నారని అంటూ వారు అబద్ధాలతో ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారని విమరసంచారు. కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం స్థానిక సంస్థల ఎన్నికల కోసమే రైతు భరోసా పేరుతో కొంతమందికి మాత్రమే డబ్బులు విడుదల చేసిందని ఆరోపించారు.

భద్రాచలంలో ఈవోపై దాడి చేయడం, దేవస్థానం భూములను ఆక్రమించే ప్రయత్నం చేయడం పట్ల రామచందర్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇతర మతస్తులు ఆ భూముల్లో కట్టడాలు కట్టి, కొందరు చర్చ్‌లు, మసీదులు నిర్మించేందుకు యత్నించారని, ఈవో ఆపే ప్రయత్నం చేయగా, ఆమెపై దాడి జరిగిందని ఆయన విమర్శించారు. ఇది భద్రాచలం లోనే కాదు తిరుమల తిరుపతి దేవస్థానం భూముల విషయంలో కూడా జరిగిందని తెలిపారు.

ఖమ్మం ప్రాంతంలో కొన్ని రాజకీయ పార్టీల ప్రోత్సాహంతో టీటీడీకి చెందిన భూముల్లో గోడలు కూలగొట్టి, ఇతర మతస్తులు మసీదులు, ఇతర కట్టడాలు నిర్మించారని, టీటీడీ అధికారులు ఆ ప్రాంతాన్ని పరిశీలించకుండా అడ్డుకున్నారని బిజెపి రాష్ట్ర అధ్యక్షులు తెలిపారు.  అందువల్ల హిందూ దేవాలయ భూములను ఇతర మతస్తుల ఆక్రమణ నుంచి రక్షించుకోవాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు.

 
భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో దేవాలయ భూముల పరిరక్షణ కోసం ఉద్యమం చేస్తామని ఆయన ప్రకటించారు. ఖమ్మంలో ఆక్రమించిన భూముల నుంచి ఆక్రమణదారులను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఖాళీ చేయించాలని డిమాండ్ చేశారు. ఈవోపై దాడి చేసిన ఇతర మతస్తులు, దేవాలయ భూములను ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రిని డిమాండ్ చేశారు.
 
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పదే పదే ఢిల్లీకి వెళ్తున్నారని, తమ పాలనా వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి బిజెపిపై దుష్ప్రచారం చేస్తున్నారని రామచందర్ రావు ధ్వజమెత్తారు. రాష్ట్ర ప్రభుత్వానికి నిజమైన చిత్తశుద్ధి ఉంటే, కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజలకు ఇచ్చిన 6 గ్యారంటీలను, ఇతర హామీలను ఎందుకు అమలు చేయడం లేదు? అని ప్రశ్నించారు.
భారతీయ జనతా పార్టీ మాత్రమే తెలంగాణ రాష్ట్రానికి మంచి భవిష్యత్తు అందించగలదని స్పష్టం చేస్తూ అందువల్ల రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున ప్రజలు భారతీయ జనతా పార్టీలో చేరాలని కోరారు.