ప్రధాని మోదీకి నమీబియా అత్యున్నత పురస్కారం

ప్రధాని మోదీకి నమీబియా అత్యున్నత పురస్కారం

ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి నమీబియా పర్యటనలో ఉన్న ఆయన అక్కడి అత్యున్నత పౌర పురస్కారం “ఆర్డర్ ఆఫ్‌ ది మోస్ట్ ఏన్‌షియంట్ వెల్‌విచ్చియా మిరాబిలిస్‌” అందుకున్నారు. ఈ పురస్కారాన్ని ప్రధాని మోదీకి నమీబియా అధ్యక్షురాలు నెటుంబో నంది ఎన్ దైత్వా ప్రదానం చేశారు. ఇక ఈ పర్యటనలో భాగంగా ఆ దేశాధ్యక్షురాలితో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ఇరు దేశాల మధ్య ఉన్న సంబంధాలపై ఇరువురు నాయుకులు సమీక్షించారు. 

పురస్కారం అందుకున్న అనంతరం ప్రధాని మోదీ మాట్లాడుతూ, ప్రపంచంలోని అతిపెద్ద వజ్రాల ఉత్పత్తిదారుల్లో నమీబియా ఒకటి అని పేర్కొన్నారు. అలాగే భారత్ లో అతి పెద్ద వజ్రాల పాలిషింగ్ పరిశ్రమ ఉందని ముఖ్యంగా తన స్వస్థలమైన గుజరాత్లో అని గుర్తు చేశారు. రానున్న కాలంలో ఇరుదేశాల మధ్య స్నేహం వజ్రాల వలె ప్రకాశంవంతంగా ప్రకాశిస్తుందని నమ్ముతున్నట్లు ఆశాభావం వ్యక్తం చేశారు.

ఆఫ్రికాలో నమ్మకమైన భాగస్వామిగా ఉన్న నమీబియాతో ద్వైపాక్షిక సహకారం పెంపొందించుకోవాలని కోరుకుంటున్నట్లు ప్రధాని మోదీ చెప్పారు. డిజిటల్ టెక్నాలజీ, రక్షణ, వ్యవసాయం, ఖనిజాలు, విద్య, ఆరోగ్యం సహా ఇతర రంగాల్లో సహకారంపై నమీబియా అధ్యక్షురాలితో చర్చించానని మోదీ ఎక్స్‌లో పోస్టు చేశారు. ప్రాజెక్టు చీతాకు సహకారం అందించినందుకు నమీబియా ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపినట్లు ప్రధాని వెల్లడించారు. 

ఇంధనం, ఆరోగ్యం సహా ఇతర రంగాల్లో ద్వైపాక్షిక సహకారాన్ని పెంపొందిచుకోవాలని ఇరు దేశాలు నిర్ణయించాయని విదేశాంగ శాఖ తెలిపింది. ఈ మేరకు ఇరు దేశాల మధ్య నాలుగు ఒప్పందాలు కుదిరాయని వెల్లడించింది. అంతకుముందు నమీబియా చేరుకున్న ప్రధానికి ఘన స్వాగతం లభించింది. ఆ దేశ అధ్యక్షురాలు స్వయంగా ప్రధాని మోదీకి ఆహ్వానం పలికారు. 

కళాకారులు సంప్రదాయ స్వాగతం పలికారు. వారితో కలిసి ప్రధాని మోదీ డప్పు కొట్టి నమీబియా కళాకారులను ఉత్సాహపరిచారు. ఆయన బస చేసే హోటల్కు చేరుకున్నప్పుడు అక్కడ సంప్రదాయ సృత్యాలతో పాటు యోగా ప్రదర్శనలతో ప్రత్యేక స్వాగతం లభించింది. జులై 2న మొదలైన ప్రధాని మోదీ ఐదు దేశాల పర్యటన బుధవారంతో  ముగిసింది. ఘనా, ట్రినిడాడ్ అండ్‌ టొబాగో, అర్జెంటీనా, బ్రెజిల్‌ పర్యటనలను పూర్తిచేసుకున్న ప్రధాని మోదీ నమీబియాలో పర్యటించారు. దీంతో గడిచిన మూడు దశాబ్దాల్లో ఈ దేశంలో పర్యటించే తొలి భారత ప్రధానిగా నిలువనున్నారు.