హెచ్‌సీఏ అధ్యక్షుడు జగన్మోహన్‌రావు అరెస్ట్‌

హెచ్‌సీఏ అధ్యక్షుడు జగన్మోహన్‌రావు అరెస్ట్‌

సన్‌రైజర్స్‌ హైదరాబాద్, హెచ్‌సీఏ వ్యవహారంలో హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్ అధ్యక్షుడు జగన్మోహన్‌రావుతో పాటు మరో వ్యక్తిని సీఐడీ అరెస్టు చేసింది. ఐపీఎల్‌ టికెట్ల వ్యవహారంలో వచ్చిన ఆరోపణలపై విచారణ చేపట్టిన సీఐడీ అధికారులు తాజాగా ఇద్దరిని అరెస్ట్‌ చేశారు. విజిలెన్స్‌ నివేదిక ఆధారంగా ఇటీవల కేసు సీఐడీ కేసు నమోదు చేయారు. 

గత ఐపీఎల్‌ సీజన్‌లో ఎస్‌ఆర్‌హెచ్‌-హెచ్‌సీఏ మధ్య టికెట్ల వివాదం చెలరేగింది. మ్యాచ్‌ టికెట్లు కేటాయించలేదంటూ కార్పొరేట్‌ బాక్స్‌కు హెచ్‌సీఏ తాళం వేసింది. ఈ ఘటనతో ఎస్‌ఆర్‌హెచ్‌ యాజమాన్యం హైదరాబాద్‌ను వీడిపోతామని హెచ్చరించింది. అధ్యక్షుడు జగన్మోహన్‌రావుపై ఎస్‌ఆర్‌హెచ్‌ యాజమాన్యం తీవ్ర ఆరోపణలే చేసింది. 

ఈ ఘటనపై గతంలో ప్రభుత్వం విచారణకు ఆదేశించిన విషయం తెలిసిందే. ఎస్‌ఆర్‌హెచ్‌ ఫ్రాంచైజీపై హెచ్‌సీఏ అధ్యక్షుడు ఒత్తిడి తీసుకువచ్చినట్లుగా విజిలెన్స్‌ విచారణలో తేలింది. టికెట్ల కోసం ఎస్‌ఆర్‌హెచ్‌ యాజమాన్యాన్ని ఇబ్బందులకు గురి చేశారని నిర్ధారణ అయ్యింది.  వాస్తవానికి ఉచిత పాస్‌ల కోసం హెచ్‌సీఏ అధ్యక్షుడు జగన్మోహన్‌రావు తీవ్రంగా వేధిస్తున్నాడని సన్‌రైజర్స్‌ మేనేజ్‌మెంట్‌ ఆరోపించింది. 

ఇలాగే చేస్తే తాము హైదరాబాద్‌ నుంచి వెళ్లిపోతామని హెచ్చరించింది. ఇలాగే కొనసాగితే తాము వేదికను మార్చుకునేందుకు వెనుకాడబోమని, ఉప్పల్‌ స్టేడియాన్ని హోం గ్రౌండ్‌గా ఎంచుకుని మ్యాచ్‌లు ఆడటం వారికి ఇష్టం లేనట్లుగా ఉందంటూ హెచ్‌సీఏ కోశాధికారికి లేఖ సైతం రాసింది. లిఖితపూర్వకంగా చెబితే హైదరాబాద్‌ నుంచి వెళ్లిపోతామని, ఈ విషయంపై బీసీసీఐకి, తెలంగాణ ప్రభుత్వం, జట్టు యాజమాన్యానికి తెలుపనున్నట్లు చెప్పింది. 

గత 12 సంవత్సరాలుగా హెచ్‌సీఏతో కలిసి పని చేస్తున్నామని, గత సీజన్ నుంచి మాత్రమే ఈ సమస్యలు, వేధింపులు ఎదుర్కొంటున్నట్లుగా పేర్కొంది. ప్రతి సీజన్‌లో 50 కాంప్లిమెంటరీ టికెట్లు (ఎఫ్12ఎ బాక్స్) ఇస్తున్నామని, ఈ ఏడాది వారు అదనంగా మరో 20 టికెట్లు అడుగుతున్నారని ఆరోపించింది. ఎస్‌ఆర్‌హెచ్‌, హెచ్‌సీఏ వివాదం తీవ్రస్థాయికి చేరడంతో ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. ఈ వ్యవహారంలో విజిలెన్స్ నివేదిక ఆధారంగా హెచ్‌సిఎ అక్రమాలపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన సిఐడి అక్రమాలు వాస్తవమని తేలడంతో ఇప్పుడు అరెస్ట్ చేసింది.