
* సైనికుల కన్నా ప్రమాదమంటూ అరుణాచల్ సీఎం ఆందోళన
భారత్‌తో సరిహద్దులో ప్రపంచంలోనే అతిపెద్ద జల విద్యుత్ డ్యాంను చైనా నిర్మిస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. దీన్ని చైనా వాటర్ బాంబ్‌గా ఉపయోగించే అవకాశం ఉందని అరుణాచల్‌ప్రదేశ్ సీఎం పెమా ఖండూ ఆందోళన వ్యక్తం చేశారు. చైనా మిలటరీ కంటే ఈ డ్యాంతోనే అతిపెద్ద ప్రమాదం పొంచి ఉందని హెచ్చరిస్తూ చైనా వ్యూహాలకు దీటుగా భారత్ కూడా పలు చర్యలు తీసుకుంటోందని స్పష్టం చేశారు.
భారత్‌లోని అరుణాచల్ ప్రదేశ్‌కు సమీపంలో, సరిహద్దుకు కేవలం 30 కేమి దూరంగా నిర్మిస్తున్న దీనికి యార్లుంగ్ త్సాంగ్పో ఆనకట్టగా పేరుపెట్టింది. టిబెట్‌లో యార్లంగ్ సాంగ్పో నదిగా ప్రసిద్ధమైన బ్రహ్మపుత్ర నదిపై ఈ జల విద్యుత్ ప్రాజెక్టు నిర్మాణానికి 2024లో చైనా సర్కారు ఆమోదం తెలిపింది. 137 బిలియన్ డాలర్ల వ్యయంతో ఐదేళ్లలో దీన్ని నిర్మించాలని డ్రాగన్ లక్ష్యంగా పెట్టుకుంది. ఇది 60 వేల మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేయగలదు.
రక్షణ పరంగానూ భారత్‌కు దీనివల్ల సమస్యలు పొంచి ఉన్నాయని, యుద్ధ పరిస్థితులు తలెత్తితే ఈ ప్రాజెక్టులో నిల్వ చేసిన నీటిని చైనా వాటర్ బాంబ్‌గా ప్రయోగించే ప్రమాదం ఉందని భావిస్తున్నారు. బ్రహ్మపుత్రనది భారత్‌లోని అరుణాచల్‌ప్రదేశ్‌లోకి ప్రవేశించేందుకు మలుపు తిరిగే ప్రదేశంలో ఈ ప్రాజెక్టును నిర్మిస్తున్నారు. ఈ ప్రాజెక్టు సాయంతో చైనా బ్రహ్మపుత్ర నదిలో జల ప్రవాహాన్ని నియంత్రించగలదు. భారీ మోతాదులో వరద నీటిని భారత భూభాగంపైకి వదిలి విధ్వంసం సృష్టించగలదు. అంతర్జాతీయ జల ఒప్పందంపై చైనా సంతకం చేసి ఉంటే ఈ డ్యాం వల్ల భారత్‌కు పెద్దగా సమస్య వచ్చేదికాదని పెమా ఖండూ తెలిపారు.
ఎందుకంటే ఆ ఒప్పందం ప్రకారం బ్రహ్మపుత్ర జలాలను కొంతమేర తప్పనిసరిగా కిందకు వదలాల్సి వస్తుందని పేర్కొన్నారు. అంతర్జాతీయ జల ఒప్పందంపై చైనా సంతకం చేయనందున వేసవికాలంలో బ్రహ్మపుత్ర జలాలను భారత్‌లోకి రాకుండా చైనా మళ్లించే అవకాశం ఉందని థెయ్ల్పారు. తద్వారా అసోం, అరుణాచల్‌ప్రదేశ్ రాష్ట్రాల ప్రజలు తీవ్ర నీటి ఎద్దడిని ఎదుర్కోవాల్సి ఉంటుందని చెప్పారు.
వర్షాకాలంలో బ్రహ్మపుత్ర నదికి భారీగా వరద ఉంటుంది. ఒకేసారి పెద్దమొత్తంలో నీటిని విడుదల చేస్తే దిగువనున్న ప్రాంతాలు ముంపునకు గురవుతాయని ఆయన వివరించారు. “చైనా ఎప్పుడు ఏం చేస్తుందో ఎవరికీ తెలియదు. ఆనకట్ట నిర్మించి వారు అకస్మాత్తుగా నీటిని విడుదల చేస్తే, మన మొత్తం సియాంగ్ బెల్ట్ నాశనం అవుతుంది. ముఖ్యంగా ఆది తెగ సహా ఆ తరహా సమూహాలు అక్కడ ఎక్కువగా నివాసం ఉంటారు” అని ఆయన తెలిపారు.
“ఆది తెగ ఆస్తి, భూమి, ముఖ్యంగా మానవ జీవితం వినాశకరమైన ప్రభావాలను ఎదుర్కొంటాయి. అసోంలో కూడా బ్రహ్మపుత్ర నది వరద వల్ల భారీ నష్టం సంభవిస్తుంది” అని ఆందోళన వ్యక్తం చేశారు. చైనా నిర్మిస్తున్న డ్యాం పూర్తైతే సియాంగ్, బ్రహ్మపుత్ర నదులు ఎండిపోయే ప్రమాదం ఉందని పెమా ఖండూ ఆందోళన వ్యక్తం చేశారు.
భారత్ కూడా డ్యాం నిర్మాణం చేపడితే చైనా ఒక్కసారిగా నీటి ప్రవాహాన్ని కిందకి వదిలినా అదుపు చేసే వీలు ఉంటుందని చెప్పారు. చైనా నిర్మిస్తున్న డ్యాంపై అరుణాచల్ ప్రదేశ్‌లో ఉన్న ఆది తెగ వారికి అవగాహన కల్పిస్తున్నామని పేర్కొన్నారు. “అరుణాచల్‌లో కూడా ఓ ప్రాజెక్టును నిర్మించనున్నాం. దాని వల్ల మా నీటి అవసరాలను దాని ద్వారా తీర్చుకునే అవకాశం ఉంటుంది. చైనా ఒక్కసారిగా నీటిని విడుదల చేసినా భారత్ నిర్మించే డ్యాం వల్ల ఆ వరదను నియంత్రించే అవకాశం దక్కుతుంది” అని ఖండూ వెల్లడించారు.
More Stories
టీటీడీ పరకామణిలో ఫారిన్ కరెన్సీ దోపిడీపై సీఐడీ దర్యాప్తు
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఏబీవీపీ ఘనవిజయం
‘మోహన్‌లాల్’కు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు