
తిరుమల తిరుపతి దేవస్థానంలో పనిచేస్తూ అన్యమత ప్రార్థనల్లో పాల్గొన్న అధికారిని టీటీడీ సస్పెండ్ చేసింది. ఆ అధికారి వ్యవహార శైలి, ప్రవర్తనపై టీటీడీ విజిలెన్స్ విభాగం ఓ నివేదికను సంబంధిత అధికారులను అందజేసింది. వాటన్నింటినీ పరిశీలించిన అనంతరం అధికారిని సస్పెండ్ చేస్తున్నట్లు టీటీడీ అధికారికంగా ప్రకటించింది.
టీటీడీలో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా పనిచేస్తున్న ఏ.రాజశేఖర్ బాబు తిరుపతి జిల్లా పుత్తూరులో ప్రతి ఆదివారం స్థానిక చర్చి ప్రార్థనల్లో పాల్గొంటున్నాడనే సమాచారం అందింది. ఓ భక్తుడు ఆయన చర్చి ప్రార్థనల్లో పాల్గొంటుండగా ఫొటోలు, వీడియోలు తీసి టీటీడీ విజిలెన్స్ విభాగానికి ఫిర్యాదు చేశాడు. విచారణ చేపట్టిన అధికారులు రాజశేఖర్ బాబును సస్పెండ్ చేస్తున్నట్లు వెల్లడించారు.
టీటీడీ ఉద్యోగిగా ఉంటూనే సంస్థ ప్రవర్తన నియమావళిని పాటించకపోవడమే కాకుండా, హిందూ ధార్మిక సంస్థకు ప్రాతినిథ్యం వహించే ఉద్యోగిగా ఉంటూ బాధ్యతారహితంగా వ్యవహరించాడంటూ టీటీడీ ఓ పత్రికా ప్రకటనను విడుదల చేసింది. టీటీడీ విజిలెన్స్ విభాగం సమర్పించిన నివేదికను, ఇతర ఆధారాలను పరిశీలించిన అనంతరం నిబంధనల ప్రకారం ఆయనపై శాఖపరమైన చర్యలు తీసుకోవడంతో పాటు తక్షణమే సస్పెండ్ చేస్తున్నట్లు టీటీడీ వెల్లడించింది.
More Stories
లులూ ఫుడ్ పార్క్ లో గోవధ చేస్తారా? మంత్రివర్గంలో ప్రశ్నించిన పవన్
నాయీ బ్రాహ్మణుల సమస్యలు పరిష్కారం బిజెపి థ్యేయం
అన్నమయ్య జిల్లాకు పీఎం ధన ధాన్య కృషి యోజనలో చోటు