గరివిడిలోని వెటర్నరీ కాలేజ్‌కి శాశ్వత సభ్యత్వం

గరివిడిలోని వెటర్నరీ కాలేజ్‌కి శాశ్వత సభ్యత్వం
విజయనగరం జిల్లా గరివిడిలోని వెటర్నరీ కాలేజ్‌కి శాశ్వత సభ్యత్వం కొనసాగించేందుకు కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ కాలేజ్‌లో చివరి సంవత్సరం చదివే విద్యార్థులకు ఇంటర్న్‌షిప్ సదుపాయం కూడా కల్పించాలని నిర్ణయం తీసుకుంది. విద్యార్థులను మరో కాలేజ్‌కి తరలించి వెసులుబాటు కల్పించేందుకు కేంద్రమంత్రి లలన్ సింగ్ అంగీకరించారు. 
 
గత జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వ నిర్వాకంతో గరివిడి కాలేజ్‌కి అనుమతులని కేంద్ర ప్రభుత్వం నిలిపివేసింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గరివిడిలోని వెటర్నరీ కాలేజ్‌పై ప్రత్యేక దృష్టి సారించింది. ఈ కాలేజ్‌పై కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు, ఏపీ వ్యవసాయ శాఖా మంత్రి అచ్చెన్నాయుడు ప్రత్యేకంగా దృష్టి సారించారు. 
 
ఢిల్లీలో కేంద్ర పశుసంవర్ధక శాఖ మంత్రి లలన్ సింగ్‌తో ఇరువురు నేతలు మంగళవారం ప్రత్యేకంగా భేటీ అయ్యారు. గరివిడి కాలేజీకి ఉన్న ప్రాధాన్యతను కేంద్రమంత్రికి వివరించారు. 2018లో గరివిడి వెటర్నరీ కాలేజ్‌ని అప్పటి టీడీపీ ప్రభుత్వం ప్రారంభించింది. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన జగన్ ప్రభుత్వం ఈ కాలేజ్‌ అభివృద్ధికి ఎలాంటి చర్యలు తీసుకోలేదు.

గత ఐదేళ్లుగా ఈ కాలేజ్‌ ఎలాంటి పనులకి నోచుకోకపోవడంతో కేంద్ర అధికారులు తనిఖీలు నిర్వహించలేదు. 2023లో జరిగిన తనిఖీల్లో ఈ కాలేజ్‌లో నిబంధనలకు అనుగుణంగా పురోభివృద్ధి లేకపోవడంతో కేంద్ర ప్రభుత్వ అనుమతులని రద్దు చేసింది. వచ్చే నాలుగైదు నెలల్లో ఈ కాలేజ్‌లో నిబంధనలకు అనుగుణంగా అన్ని చర్యలు తీసుకుంటామని కేంద్రమంత్రి లలన్ సింగ్‌‌కి రామ్మోహన్, అచ్చెన్నాయుడు హామీ ఇచ్చారు. ఇరువురు నేతల హామీతో ఈ కాలేజ్‌‌కి అనుమతుల పునరుద్ధరణ చేస్తామని కేంద్ర మంత్రి లలన్ సింగ్ స్పష్టం చేశారు.