భారత నర్సు క్షమాభిక్ష తిరస్కరణ.. 16న ఉరి!

భారత నర్సు క్షమాభిక్ష తిరస్కరణ.. 16న ఉరి!
యెమెన్ దేశస్థుడి హత్య కేసులో ఉరి శిక్ష ఖరారైన భారతీయ నర్సు నిమిష ప్రియకు ఊరట లభించలేదు. ఇన్నిరోజులు తన వద్ద పెండింగ్‌లో ఉన్న ఆమె క్షమాభిక్ష పిటిషన్‌కు దేశ అధ్యక్షుడు ఆమోదం తెలిపారు. దాంతో, వచ్చే వారం అంటే జూలై 16న నిమిష ఉరికి ఏర్పాట్లు చేస్తున్నారు జైలు అధికారులు. కాగా, నిమిష క్షమాభిక్ష తిరస్కరణ తదనంతర పరిణామాలను తాము నిషితంగా గమనిస్తున్నామని భారత విదేశీ వ్యవహారాల శాఖ తెలిపింది. 
నర్స్ కుటుంబ సభ్యులతో టచ్ ఉన్నామని, వాళ్లకు అవసరమైన సహాయం చేసేందుకు సిద్ధంగా ఉన్నామని వెల్లడించింది. నిమిష ప్రస్తుతం రాజధాని సనాలోని ఓ జైలులో ఉన్నారు.  నిమిష ప్రియది కేరళలోని పాలక్కాడ్‌. తల్లిదండ్రులకు అండగా నిలవాలని ఆమె 2008లో యెమెన్‌కు వెళ్లింది. అక్కడ పలు ఆస్పత్రుల్లో నర్సుగా పనిచేసిన ఆమెకు 2014లో ఆ దేశస్థుడు త‌లాల్ అబ్దో మ‌హ‌దితో పరిచయం అయింది. ప్రియా భ‌ర్త‌, ఆమె కూతురు 2014లో భారత్ కు తిరిగి వ‌చ్చారు. 
కానీ ఉద్యోగం కారణంగా ప్రియా వెన‌క్కి రాలేక‌పోయింది. అయితే ఉద్యోగం కోసం మ‌హ‌దితో కలిసి 2015లో క్లినిక్‌ను ప్రారంభించింది. కానీ ఇద్దరి మ‌ధ్య కొన్నాళ్లకు గొడ‌వ మొద‌లైంది. దాంతో ఆమె అతడిపై కేసు పెట్టింది. జైలు నుంచి విడుదలైన తర్వాత మ‌హది ఆమెను భయపెట్టాడు. నిమిష పాస్‌పోర్టును లాగేసుకున్నాడు. దీంతో ఇద్దరి మధ్య 2017 జూలై 25న గొడవ సమయంలో దానిని తీసుకునేందుకు అతనికి మత్తు ఇంజెక్షన్‌ ఇవ్వగా, అధిక మోతాదు కారణంగా మెహదీ మరణించాడని ప్రియపై హత్య కేసు నమోదైంది. 

త‌న కుమార్తె విడుదల గురించి మ‌హ‌ది కుటుంబంతో మాట్లాడి వాళ్ల కుటుంబానికి డ‌బ్బులు చెల్లించేందుకు ప్రియా త‌ల్లి సిద్దంగా ఉన్నానని చెప్పింది. కానీ యెమెన్ సుప్రీంకోర్టు మాత్రం ఆ అభ్యర్థన‌ను తిర‌స్కరించింది. ప్రియ భర్త టామీ థామస్‌ మాట్లాడుతూ ఉరిశిక్ష అమలు చేయడం గురించి తమకు ఇంకా ఎలాంటి అధికారిక సమాచారం అందలేదని చెప్పారు. ప్రియను కాపాడుకునే ప్రయత్నాలు చేయడం కోసం గతేడాది ఏప్రిల్‌కు యెమెన్‌లోని సనాకు ఆమె తల్లి ప్రేమ కుమారి వెళ్లారని, అప్పట నుంచి అక్కడే ఉంటున్నారని థామస్‌ చెప్పారు. ప్రస్తుతం సనాలో హౌతీ తిరుగుబాటుదారుల ప్రభుత్వం ఉండటంతో భారత, కేరళ ప్రభుత్వాల యత్నాలు ఫలించడం లేదు.