
అహ్మదాబాద్ విమాద ప్రమాద ఘటనపై ఎయిర్క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో(ఏఏఐబీ) ప్రాథమిక నివేదికను రూపొందించింది. ఇప్పటివరకు జరిగిన దర్యాప్తు ఆధారంగా ఈ నివేదికను రూపొందించినట్లుగా తెలుస్తోంది. దీనిని మంగళవారం కేంద్ర పౌరవిమాన మంత్రిత్వ శాఖతో పాటు సంబంధిత అధికారులకు సమర్పించినట్లు ప్రభుత్వ ఉన్నతస్థాయి వర్గాలు వెల్లడించాయి.
అయితే ఈ నివేదికలో ఏమున్నది అనేది తెలియాల్సి ఉంది. ఈ వారంలోనే నివేదికను విడుదల చేసే అవకాశమున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. విమానం అదుపు తప్పిన నుంచి కూలిపోయే దాకా పైలట్లు ఏం మాట్లాడుకున్నారు? అలాగే చివరి నిమిషయంలో సిబ్బంది చర్యలు, వాతావరణ పరిస్థితులు, తదితర అంశాలతో ఈ నివేదికను రూపొందించినట్లు సమాచారం.
దీంతో ప్రమాదం జరిగిన తీరు, అందుకు దారితీసిన కారణాలపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. తద్వారా ఇకపై ఇలాంటి ఘోర ప్రమాదాలు జరగకుండా చర్యలు చేపట్టేందుకు వీలు కలుగుతుంది. జూన్ 12న అహ్మదాబాద్ విమానాశ్రయం నుంచి లండన్‌కు టేకాఫ్ అయిన ఎయిర్ ఇండియా విమానం కొన్నిసెకండ్లకే సమీపంలోని బీజే వైద్యకళాశాల వసతిగృహంపై కుప్పకూలింది.
ఈ ప్రమాదంలో మొత్తం 275 మంది చనిపోయారు. ఇది జరిగిన మరుసటి రోజే ప్రమాదంపై దర్యాప్తు చేసేందుకు డైరెక్టర్ జనరల్ జీవీజీ యుగంధర్ నేతృత్వంలో ఏఏఐబీ ఒక ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. ఏవియేషన్ మెడిసిన్, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ నిపుణులు, నేషనల్ ట్రాన్స్‌పోర్టేషన్ సేఫ్టీ బోర్డు నిపుణులు సభ్యులుగా ఉన్నారు.
ఒక బ్లాక్ బాక్స్ను జూన్ 13న ప్రమాద స్థలంలోని ఒక భవనం మీద నుంచి, మరొకటి జూన్ 16న శిధిలాల మధ్య నుంచి రికవర్ చేశారు. ఆ బ్లాక్‌బాక్స్‌లను ఏఏఐబీ ల్యాబ్‌కు తరలించి, అందులోని డేటాను విజయవంతంగా డౌన్‌లోడ్ చేసి ప్రమాదానికి గల కారణాలను విశ్లేషిస్తున్నారు. మరోవైపు పౌర విమానయాన మంత్రిత్వశాఖ, విమానయాన సంస్థల అధికారులతో మంగళవారం పార్లమెంటరీ కమిటీ చర్చలు జరిపింది.
ఈ సందర్భంగా ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం విషయాన్ని ప్రస్తావిస్తూ, దర్యాప్తు నివేదిక ఎప్పుడు సిద్ధమవుతుందో తెలియజేయాలని పలువురు ఎంపీలు కోరినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత శ్రీనగర్ ఎయిర్‌ఫేర్ పెరగడంపై పలువురు సభ్యులు ఆందోళన వ్యక్తం చేసినట్లు చెప్పాయి. అలాగే బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ(బీసీఏఎస్) పనితీరుపై ఆడిట్ నిర్వహించాలని కోరినట్లు తెలిపాయి.
More Stories
16 వేల మంది విదేశీయులు దేశం నుంచి బహిష్కరణ
బ్రహ్మపుత్ర నదిపై మెగా డ్యాం పనులకు భారత్ శ్రీకారం
చట్టవిరుద్ధమని తేలితే బిహార్‌లో ఎస్ఐఆర్ ను రద్దు చేస్తాం