శ్రీశైలం జలాశయం దిగువ లోతైన గుంతతో ప్రమాదం

శ్రీశైలం జలాశయం దిగువ లోతైన గుంతతో ప్రమాదం
కృష్ణానదిపై కీలక ప్రాజెక్టు శ్రీశైలం ప్రమాదకర పరిస్థితిలో ఉందని, కేంద్రం తక్షణమే స్పందించి డ్యాం దిగువన ఏర్పడిన ప్లంజ్‌పూల్‌ మరమ్మతులపై చర్యలు తీసుకోవాలని కేంద్ర జలశక్తి శాఖను తెలంగాణ ప్రభుత్వం కోరింది. నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి సోమవారం రాత్రి శాఖ ముఖ్యకార్యదర్శి రాహుల్‌ బొజ్జా, ఇతర అధికారులతో శ్రీశైలం ప్రాజెక్టుపై సమావేశం నిర్వహించారు. 

మంత్రి సూచన మేరకు డ్యాం నిర్వహణ పరిస్థితులపై రాహుల్‌ బొజ్జా కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శికి లేఖ రాశారు. ఏటా కృష్ణా నదికి వస్తున్న భారీ వరదల కారణంగా శ్రీశైలం డ్యాం దిగువన లోతైన గుంత ఏర్పడిందని, ఎన్డీఎస్‌ఏతో పాటు పలు కమిటీలు దీనిపై అధ్యయనం చేసి డ్యాంకు ముప్పు పొంచి ఉందని ఆయా కమిటీ సభ్యులు హెచ్చరించారని లేఖలో తెలిపారు. 

మరమ్మతులకు సంబంధించి పలు సిఫార్సులు కూడా చేశాయని, తెలంగాణ ప్రభుత్వం కూడా కృష్ణా బోర్డుకు, ఎన్డీఎస్‌ఏ(నేషనల్‌ డ్యాం సేఫ్టీ అథారిటీ)కు పలుమార్లు లేఖలు రాసిందని వివరించారు. ఆనకట్ట గ్యాలరీ, స్లూయిస్‌లు కూడా సరిగా లేవు. రాష్ట్ర డ్యాం సేఫ్టీ ఆర్గనైజేషన్‌ కూడా ఎన్డీఎస్‌ఏకు లేఖ రాసిందని, ప్రాజెక్టుల గేట్ల నిపుణుడు కన్నయ్య నాయుడు శ్రీశైలం గేట్ల నిర్వహణపై తాజాగా ఆందోళన వ్యక్తం చేశారని పేర్కొన్నారు. 

నాగార్జునసాగర్‌ ప్రాజెక్టు నిర్వహణను తెలంగాణ చేపడుతుండగా ఇటీవలే నిర్వహణ పనులను పూర్తి చేశామని తెలిపారు. శ్రీశైలం ప్రాజెక్టు నిర్వహణ ఏపీ పరిధిలో ఉందని డ్యాంను ఆ రాష్ట్రం విస్మరిస్తోందని, కేంద్రం వెంటనే స్పందించి ప్రాజెక్టు నిర్వహణ, మరమ్మతులకు ఆంధ్రప్రదేశ్‌ పూనుకునేలా చొరవ చూపాలని లేఖలో కోరారు.

 ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న వానల వల్ల కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. ఫలితంగా శ్రీశైలం జలాశయానికి వరద పోటెత్తుతోంది. ఆ విషయాన్ని జలవనరులశాఖ ఉన్నతాధికారులు నివేదించడంతో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంగళవారం తానే స్వయంగా వచ్చి నీటిని విడుదల చేశారు. రైతుల హర్షద్వానాల మధ్య కృష్ణమ్మకు పట్టు వస్త్రాలు సమర్పించారు.

ఈ సందర్భంగా శ్రీశైలం ప్రాజెక్టు వద్ద కృష్ణమ్మకు జలహారతి ఇచ్చారు. అనంతరం ప్రాజెక్టు గేట్లు ఎత్తి నీటిని విడుదల చేశారు. ప్రస్తుతం జలాశయంలో 1,71,550 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతుంది. శ్రీశైలం జలాశయం గరిష్ట నీటి మట్టం 885 అడుగులు కాగా, ప్రస్తుతం 880.80 అడుగులుగా ఉంది. ప్రాజెక్టు సామర్థ్యం 215 టీఎంసీలు కాగా, ఇప్పటికే 192 టీఎంసీలు చేరాయి. దీంతో  అనంతరం శ్రీశైలం ప్రాజెక్టు 6, 7, 8, 11 నెంబర్ల రేడియల్ గేట్లను ముఖ్యమంత్రి తెరచి నీటిని దిగువకు వదిలారు. పరవళ్ళు తొక్కుతూ దిగువకు ప్రవహిస్తున్న కృష్ణమ్మ నదిని చూసి పులకరించిపోయారు.