
వైఎస్సార్సీపీ మాజీ ఎమ్యెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి మహిళా ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డిపై అసభ్య వ్యాఖ్యలు చేయడంతో సోమవారం రాత్రి ఆయన ఇంటిపై దాడి జరిగింది. కోవూరు నియోజకవర్గం పడుగుపాడులోని ఓ కల్యాణ మండపంలో సోమవారం వైఎస్సార్సీపీ నియోజకవర్గ స్థాయి విస్తృత సమావేలో పాల్గొన్న ప్రసన్నకుమార్‌రెడ్డి ప్రశాంతిరెడ్డి చరిత్ర మొత్తం తనకు తెలుసంటూ దారుణమైన పదజాలాన్ని వాడారు.
ఆమె బ్లాక్ మెయిల్ చేసి వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డిని వివాహం చేసుకున్నారని ఆరోపిస్తూ, పైగా ఆయన కూడా ఎవరూ దొరకనట్టు ఆమెను చేసుకున్నారని, ఆయన కోరితే ఓ కన్నెపిల్లను తెచ్చి తానే పెళ్లి చేసేవాడినంటూ దారుణంగా మాట్లాడారు. “పదేళ్ల కిందట నువ్వు ఎక్కడున్నావ్? ఆ ప్రభాకర్‌రెడ్డికి ఒకటే చెబుతున్నా, నీ దగ్గర రూ.వేల కోట్ల ఆస్తులున్నాయ్. జాగ్రత్తగా ఉండాలి నువ్వు. ఇప్పటికే నిన్ను చంపడానికి రెండు సిట్టింగ్‌లు అయ్యాయని నా దగ్గర సమాచారం ఉంది” అంటూ మరికొన్ని మురికి వ్యాఖ్యలు చేశారు.
దానితో ఆగ్రహించిన జనం నెల్లూరు నగరం జేవీఆర్ కాలనీ సమీపంలోని ప్రసన్నకుమారెడ్డి ఇంటిపై సోమవారం రాత్రి దాడి జరిపారు. 8.30 నుంచి 9 గంటల మధ్యలో కొందరు మూకుమ్మడిగా దాడికి పాల్పడి కారు ధ్వంసం చేశారు. ఇంటిలోకి వెళ్లి ఫర్నిచర్, కుర్చీలను విరగ్గొట్టారు. కిటికీలు పగలగొట్టారు. దుస్తులను బయటకు తీసుకొచ్చి తగలబెట్టారు. ఆ సమయంలో ప్రసన్నకుమార్‌రెడ్డి ఇంట్లో లేరు. సమాచారం తెలుసుకున్న వైఎస్సార్సీపీ నేతలు అనిల్‌కుమార్‌యాదవ్, ఆనం విజయకుమార్‌రెడ్డి, మేరిగ మురళీ, పర్వతరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఇదంతా టీడీపీ నాయకుల పనేనని ఆరోపించారు. వారిపై తగు చర్యలు తీసుకోవాలని కోరారు.
కాగా, ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డిపై నల్లపురెడ్డి చేసిన వ్యాఖ్యలని ప్రతి ఒక్కరూ ఖండించాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. మహిళలపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేస్తే తాటతీస్తామని హెచ్చరించారు. మహిళల వ్యక్తిత్వాన్ని అవహేళన చేస్తూ కించపరిచే వ్యాఖ్యలు చేయడం వైసీపీ నేతలకి ఒక అలవాటుగా మారిపోయిందని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రసన్న మాటలకి సభ్యసమాజం సిగ్గుపడుతోందని పేర్కొంటూ వ్యక్తిగత జీవితాలని లక్ష్యంగా చేసుకొని వ్యాఖ్యలు చేయడం, మహిళలని కించపరచడాన్ని ప్రజాస్వామిక వాదులందరూ ఖండించాలని చెప్పారు. మహిళల గౌరవానికి భంగం కలిగించినా, అసభ్య వ్యాఖ్యలు చేసినా చట్టప్రకారం కఠినంగా చర్యలు ఉంటాయని పవన్ కల్యాణ్ హెచ్చరించారు.
More Stories
పాక్-సౌదీ రక్షణ ఒప్పందంలో మరిన్ని ముస్లిం దేశాలు
హెచ్-1బీ వీసా దరఖాస్తులకు లక్ష డాలర్ల రుసుము
యాసిన్ మాలిక్ ను `శాంతిదూత’గా అభివర్ణించిన మన్మోహన్!