అమర్‌నాథ్ క్షేత్రంలోని మంచు శివలింగంకు తొలి హారతి

అమర్‌నాథ్ క్షేత్రంలోని మంచు శివలింగంకు తొలి హారతి

దక్షిణ కశ్మీర్‌లోని హిమాలయాల్లో 3,880 మీటర్ల ఎత్తులో ఉన్న అమర్‌నాథ్ క్షేత్రంలోని మంచు శివలింగం (బాబా బర్ఫానీ) తొలి హారతి అందుకుంది. మొదటి బ్యాచ్ యాత్రికులు భక్తి పాటలతో మంచు లింగానికి తొలి పూజలు నిర్వహించారు. అమర్‌నాథ్ పుణ్యక్షేత్ర బోర్డు ఇందుకు సంబంధించిన వీడియోను విడుదల చేసింది. తొలి బ్యాట్ యాత్రికులల్లో భాగంగా 5,892 మంది బుధవారం ఉదయం జమ్ము నుంచి బయలుదేరారు. 

భగవతినగర్‌లోని యాత్రి నివాస్ బేస్ క్యాంప్ నుంచి జమ్ముకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా జెండా ఊపి ప్రారంభించారు. వారందరూ మంచు శివలింగాన్ని దర్శించుకుని పూజలు చేశారు. అమర్నాథ్ గుహ యాత్రికుల భక్తి పాటలతో మార్మోగింది. మంచు నుంచి శివలింగం ఏర్పడినందున దీనిని బాబా బర్ఫానీ అని కూడా పిలుస్తారు.

రెండో బ్యాచ్‌లో భాగంగా 5,200 మంది యాత్రికులు బేస్‌ క్యాంపు నుంచి అమర్‌నాథ్‌ క్షేత్రానికి పయనమైనట్టు అధికారులు తెలిపారు. అమర్నాథ్ యాత్ర అధికారికంగా జులై 3న ప్రారంభమైంది. 38 రోజుల పాటు జరిగే ఈ యాత్ర ఆగస్టు 9న ముగియనుంది. ఈ యాత్రకు సంబంధించి అన్ని ఏర్పాట్లను శ్రీ అమర్నాథ్ పుణ్యక్షేత్ర బోర్డ్(ఎస్ఏఎస్బీ) చూసుకుంది. 

మంచు రూపంలోని శివయ్యను జీవిత కాలంలో ఒక్కసారి దర్శించిన పుణ్య ఫలం లభిస్తుందని భక్తుల విశ్వాసం. అందుకే ఎంత కష్టమైన ఈ యాత్రను చేయడానికి సిద్ధపడతారు. కొండలు కోనలు దాటుకుంటూ ముందు సాగుతుంటారు.ఇక ఈ  ఏడాది సుమారు 5 లక్షలకు పైగా యాత్రికులు పాల్గొంటారని అధికారులు అంచనా వేస్తున్నారు. అందుకు తగ్గట్టుగా యాత్రికుల సౌకర్యార్థం వారు వెళ్లే మార్గాల్లో వైద్య సౌకర్యాలు, ఆహారం, వసతితోపాటు వారి భద్రతా దృష్ట్యా సీసీటీవీ, డ్రోన్ నిఘాతో పాటు హెల్ప్ డెస్క్‌లను అధికారులు ఏర్పాటు చేశారు. మరోవైపు ఉగ్రదాడుల హెచ్చరికల నేపథ్యంలో స్థానిక బలగాలతో పాటు కేంద్ర మిలిటరీ దళాలను మోహరించారు.

పహల్గాంలో ఏప్రిల్ 22న పర్యటకులపై ఉగ్రవాద దాడి తర్వాత భద్రతా కారణాల దృష్ట్యా పహల్గాంతో పాటు బల్తాల్ మార్గాలను నో-ఫ్లై జోన్‌గా ప్రకటించారు. జమ్ము నుంచి బాల్తాల్, పహల్గాంలోని బేస్ క్యాంపులకు యాత్రికుల కోసం ప్రభుత్వం ఉచిత బస్సు సర్వీస్లోతోపాటు ఇతర లాజిస్టికల్ ఏర్పాట్లు చేశారు. ఈ ఏడాది భద్రతా కారణాల దృష్ట్యా హెలికాప్టర్ సేవలను నిలిపివేశారు

ఈ సందర్భంగా ప్రభుత్వం, భారత సైన్యం కల్పించిన సౌకర్యాలు, భద్రతపై యాత్రికులు పూర్తి సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. గతంతో పోలిస్తే ఈ ఏడాది ఏర్పాట్లు చాలా అద్భుతంగా ఉన్నాయని భక్తులు ప్రశంసిస్తున్నారు. ముఖ్యంగా, భారత సైన్యం తమకు పూర్తి భద్రతా భరోసా కల్పిస్తోందని, వారి అండతోనే తాము నిర్భయంగా యాత్ర చేయగలుగుతున్నామని పలువురు యాత్రికులు తెలిపారు.