సిగాచి పేలుడుపై నలుగురు సభ్యులతో కమిటీ

సిగాచి పేలుడుపై నలుగురు సభ్యులతో కమిటీ

పాశమైలారం పారిశ్రామికవాడలో సిగాచి పరిశ్రమలో భారీ పేలుడుపై దర్యాప్తునకు నలుగురు సభ్యులతో కూడిన కమిటీని రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ ఘటనపై విచారణ జరిపి నెల రోజుల్లో నివేదిక అందజేయాలని ఆ కమిటీకి ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రటరీ దాన కిషోర్ బుధవారం ఆదేశాలు జారీ చేశారు.ఘటన జరిగిన కారణాలు, భద్రతా లోపాలు, సంభవించిన ప్రభావాలపై సమగ్రమైన విచారణ చేయనున్నట్లు సమాచారం. 

ఇలాంటి ప్రమాదాలు భవిష్యత్తులో పునరావృతం కాకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన భద్రతా చర్యలు, పర్యావరణ నియమాలు, పరిశ్రమ నిర్వహణ ప్రమాణాలపై కమిటీ నుంచి స్పష్టమైన సలహాలు కోరింది ప్రభుత్వం.పరిశ్రమల పరిపాలనలో అలసత్వం లేకుండా చూడాలని, నివేదిక ఆధారంగా బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులు సూచించారు. పర్యావరణ నియంత్రణ సంస్థలపైనా సమీక్ష జరిగే అవకాశం ఉంది. 

ఈ కమిటీకి చైర్మన్‌గా సీఎస్ఐఆర్, ఐఐసీటీ శాస్త్రవేత్త డాక్టర్ బి. వెంకటేశ్వరరావు వ్యవహరిస్తారు. సభ్యులుగా సీఎస్ఐఆర్, ఐఐసీటీ ప్రధాన శాస్త్రవేత్త డా. టి. ప్రతాప్ కుమార్, రిటైర్డ్ శాస్త్రవేత్త డా. సూర్యనారాయణ, సీఎస్ఐఆర్, ఎన్‌సీఎల్, పుణె సేఫ్టీ ఆఫీసర్ డా. సంతోష్ ఘుగే వ్యవహరిస్తారు.

ఈ ఘటనలో ఇప్పటివరకు 40 మంది మృతి చెందారని, 33 మందికి గాయాలైనట్టు కంపెనీ సెక్రటరీ వివేక్‌ కుమార్ వెల్లడించారు. మృతుల కుటుంబాలకు రూ.కోటి చొప్పున పరిహారంతో పాటు  అన్నిరకాల బీమా క్లెయిమ్స్‌ను చెల్లిస్తామని ప్రకటించారు. గాయపడిన వారికి పూర్తి వైద్య సాయం అందిస్తామని, కుటుంబపోషణను తామే చూసుకుంటామని సిగాచి సెక్రటరీ తెలిపారు.

ఈ యూనిట్‌లో 90 రోజుల పాటు అన్నిరకాల ఉత్పత్తులను నిలిపివేస్తున్నట్టు సిగాచి పరిశ్రమ డైరెక్టర్‌ చిదంబరనాథ్‌ ప్రకటించారు. రియాక్టర్‌ పేలుడు కారణంగా ప్రమాదం జరగలేదని, పూర్తిస్థాయి విచారణ జరుగుతోందని తెలిపారు. పాశమైలారం సిగాచి పరిశ్రమలో పరికరాలు కాలం చెల్లినవని అనడంలో అర్థం లేదని, మిషనరీ కొత్తదేనని, భవనం పాతదని సిగాచి ఎండీ, సీఈఓ అమిత్‌రాజ్‌ సిన్హా పేర్కొన్నారు.

బాధితులందరికీ న్యాయం చేస్తామని,బాధిత కుటుం బాలకు అండగా ఉంటామని, క్షతగాత్రులకు వైద్య ఖర్చులన్నీ భరిస్తామని చెప్పారు. కాగా, ఈ ఘటనతో సిగాచి కంపెనీ షేరు విలువ మూడు రోజుల్లో రూ.56 నుంచి రూ.42కు (25శాతం) పడిపోయింది.