హాలీవుడ్‌ వాక్‌ ఆఫ్‌ ఫేమ్‌ స్టార్‌ గా దీపికా పదుకొణె

హాలీవుడ్‌ వాక్‌ ఆఫ్‌ ఫేమ్‌ స్టార్‌ గా దీపికా పదుకొణె

బాలీవుడ్‌ నుంచి హాలీవుడ్‌ వరకూ తన నటనతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ప్రముఖ నటి దీపికా పదుకొణె అరుదైన గౌరవం పొందారు. ఆమెకు “హాలీవుడ్ వాక్ ఆఫ్ ఫేమ్ స్టార్ అవార్డు” లభించింది. మోష‌న్ పిక్చ‌క్ క్యాట‌గిరీలో హాలీవుడ్ ఛాంబ‌ర్ దీపికాని ఎంపిక చేశారు. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన హాలీవుడ్ బులేవార్డ్‌పై ఆమె పేరుతో త్వరలోనే ఒక స్టార్‌ను ఏర్పాటు చేయనున్నారు.

ఈ విషయాన్ని హాలీవుడ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధికారికంగా ప్రకటించింది. ఈ జాబితాలో డెమి మూర్, ఎమిలీ బ్లంట్, రాచెల్ మెక్ ఆడమ్స్, స్టాన్లీ టక్కీ లాంటి హాలీవుడ్ ఆర్టిస్టులతో పాటు దీపికా పదుకొణే పేరు కూడా ఉండటం ఆమె అభిమానులను ఆనంద డోలికల్లో ముంచెత్తేలా చేసింది. హాలీవుడ్ వాక్ ఆఫ్ ఫేమ్ స్టార్ 2026 కింద 35 మంది ప్రతిభావంతులను ఎంపిక చేయగా, అందులో దీపికా పదుకొణే కూ చోటు దక్కింది. 

వినోద రంగంలో విశేషమైన కృషి చేసిన సందర్భంలో వీరిని ఎంపిక చేసినట్టు హాలీవుడ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ వెల్లడించింది. ఇప్పటికే దీపికా పదుకొణే 2018లో టైమ్స్ మేగజైన్ రిలీజ్ చేసిన 100 మోస్ట్ ఇన్ ఫ్లుయెన్షియల్ పీపుల్ జాబితాలో ఉంది. అలానే 2022లో ఫిఫా వరల్డ్ కప్ ను ఆవిష్కరించి యావత్ ప్రపంచ క్రీడాభిమానుల దృష్టిలోనూ దీపికా పడింది. 

2023లో దీపికా పదుకొణే ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవంలో ‘ఆర్ఆర్ఆర్’ మూవీలోని నాటు నాటు సాంగ్ ను ఆడియెన్స్ కు పరిచయం చేసింది. ప్రపంచవ్యాప్తంగా సినీ, సంగీత, టెలివిజన్, థియేటర్ రంగాల్లో ఎంతో ప్రతిష్ఠతో నిలిచే ఈ వాక్ ఆఫ్ ఫేమ్ జాబితాలో చేరడం ఒక గొప్ప గౌరవం. 

దీపికా ఈ గుర్తింపును పొందిన మొదటి జెనరేషన్ భారతీయ నటీమణుల్లో ఒకరిగా నిలిచారు. దీపికా పదుకొణె ఇటీవల హాలీవుడ్ చిత్రాలు, అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్స్, మెటా గాలా వంటి ప్రముఖ ఈవెంట్లలో పాల్గొంటూ గ్లోబల్ ఆడియన్స్‌కి దగ్గరయ్యారు.  ఆమె నటించిన హాలీవుడ్ మూవీ xXx: Return of Xander Cage ద్వారా అక్కడి ప్రేక్షకుల్లో ప్రత్యేక గుర్తింపు సంపాదించారు. 

ఇప్పటి వరకు షారుఖ్ ఖాన్, అమీర్ ఖాన్ వంటి పాపుల‌ర్ ఇండియన్ నటులు కూడా ఈ జాబితాలో చేరలేదు. దీపికా ఇప్పుడు ఆ ఘ‌న‌త సాధించ‌డం అత్యంత గర్వకారణం. వచ్చే సంవత్సరంలో (2026లో) దీపికా పేరుతో ఏర్పాటు చేయబోయే వాక్ ఆఫ్ ఫేమ్ స్టార్ ప్రత్యేక కార్యక్రమానికి హాలీవుడ్ ప్రముఖులు, ప‌లువురు బాలీవుడ్ సెలబ్రిటీలు, ప్రపంచ సినీ పరిశ్రమ నుంచి మ‌రికొంత మంది ప్ర‌ముఖులు హాజరయ్యే అవకాశముంది.