పహల్గాం ఉగ్రదాడిని ఖండించిన క్వాడ్ విదేశాంగ మంత్రులు

పహల్గాం ఉగ్రదాడిని ఖండించిన క్వాడ్ విదేశాంగ మంత్రులు
జమ్ము కశ్మీర్‌లోని పహల్గాంలో పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడిని క్వాడ్‌ దేశాల విదేశాంగ మంత్రులు తీవ్రంగా ఖండించారు. భారత్‌, అమెరికా, జపాన్‌, ఆస్ట్రేలియాతో కూడిన క్వాడ్‌ విదేశాంగ మంత్రుల సమావేశం అమెరికాలో జరిగింది. ఈ సమావేశానికి విదేశాంగ మంత్రి ఎస్‌ జైశంకర్‌, అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో, జపాన్‌ విదేశాంగ మంత్రి తకేషి ఇవాయా, ఆస్ట్రేలియా విదేశాంగ మంత్రి పెన్నీ వాంగ్‌లు హాజరయ్యారు. 
 
ఈ సమావేశం అనంతరం క్వాడ్‌ విదేశాంగ మంత్రులు విడుదల చేసిన సంయుక్త ప్రకటనలో ఉగ్రదాడికి పాల్పడిన నేరస్థులు, వారికి అన్ని రకాలుగా ప్రోత్సహిస్తున్న వారిని వెంటనే శిక్షించాలని డిమాండ్ చేశారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా తీసుకునే చర్యలకు తమ సహకారం ఉంటుందని సంయుక్త ప్రకటనలో తెలిపారు. “పహల్గాంలో పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడిని తీవ్రంగా ఖండిస్తున్నాము. ఈ దారుణమైన చర్యకు పాల్పడిన నేరస్థులు, వారిని ప్రోత్సహించిన వారికి వెంటనే శిక్ష పడాలి” అని పేర్కొన్నారు.
కాగా, భారత్‌ పాక్‌లను ఉద్దేశిస్తూ ఉగ్ర బాధితులను, నేరస్థులను ఒకేలా చూడకూడదని భారత విదేశాంగ మంత్రి జైశంకర్‌ స్పష్టం చేశారు. భారత్‌కు తన ప్రజలను ఉగ్రవాదం నుంచి కాపాడుకునే హక్కు ఉందని క్వాడ్ దేశాల కూటమి అర్థం చేసుకుంటుందని తాము ఆశిస్తున్నట్లు తెలిపారు.  ప్రపంచ సవాళ్లను అధిగమించడంలో క్వాడ్‌ను మరింత శక్తిమంతంగా తీర్చిదిద్దడంపై విదేశాంగ మంత్రులతో విస్తృత చర్చలు జరిపారు. భారత్‌లో నవంబర్‌లో జరిగే క్వాడ్ వార్షిక శిఖరాగ్ర సమావేశానికి సంబంధించిన ఎజెండాపై చర్చించారు. 

ఈ సందర్భంగా మాట్లాడిన జైశంకర్, ఉగ్రవాదం పట్ల జీరో టాలరెన్స్ ప్రదర్శించాలని క్వాడ్‌ దేశాలకు సూచించారు.  భారత్ తీసుకున్న ఆపరేషన్‌ సిందూర్‌ నిర్ణయాన్ని గౌరవిస్తుందని ఆశించారు. సముద్ర డొమైన్, లాజిస్టిక్స్, విద్య, రాజకీయ సమన్వయం వంటి అంశాల్లో క్వాడ్ గణనీయమైన పురోగతి సాధించినట్లు తెలిపారు.

“ఇటీవలి అనుభవాల దృష్ట్యా ఉగ్రవాదం గురించి ఒక మాట చెబుతున్నా. ఉగ్రవాదం పట్ల ప్రపంచం జీరో టోలరెన్స్‌ను ప్రదర్శించాలి. బాధితులు, నేరస్థులను ఎప్పుడూ సమానంగా చూడవద్దు. ఉగ్రవాదం నుంచి తన ప్రజలను రక్షించుకునే హక్కు భారత్‌కు ఉంది. మేము ఆ హక్కును ఉపయోగిస్తాము. మా క్వాడ్ భాగస్వాములు దానిని అర్థం చేసుకుని అభినందిస్తారని మేము ఆశిస్తున్నాము” అని జైశంకర్ తెలిపారు.

మరోవైపు, వాణిజ్య అవకాశాలను చూపించి భారత్‌-పాకిస్థాన్‌లు కాల్పుల విరమణ చేసేలా వారిపై ఒత్తిడి తీసుకువచ్చానంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ చేస్తున్న వ్యాఖ్యలన్నీ ఉత్తుత్తివేనని జైశంకర్‌ కొట్టిపారేశారు.