
* 51కు పెరిగిన మృతుల సంఖ్య
సంగారెడ్డి జిల్లా పాశమైలారం పారిశ్రామికవాడలోని సిగాచి సంస్థలో జరిగిన పేలుడు ప్రమాదాన్ని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి “చాలా దురదృష్టకరమైన సంఘటన”గా అభివర్ణించారు. బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచందర్ రావుతో కలిసి ఘటన స్థలాన్ని సందర్శించిన ఆయన, ఇప్పటి వరకు 48 మృతదేహాలు వెలికితీయబడినట్టు తెలిపారు. ఇంకా 11 మంది ఆచూకీ లభించాల్సి ఉందని వెల్లడించారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయని చెప్పారు.
ప్రమాదానికి బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పేదవారు పొట్టకూటి కోసం వస్తూ ప్రాణాలు కోల్పోవడం బాధాకరమని ఆయన పేర్కొన్నారు. ప్రమాదంలో మృతుల జాబితా వచ్చిన వెంటనే సంబంధిత రాష్ట్రాల్లో తమ పార్టీ తరఫున మద్దతు ఉంటుందని కిషన్ రెడ్డి హామీ ఇచ్చారు. శిధిలాల కింద చిక్కుకున్న మృతదేహాల కోసం పోలీస్ జాగిలాలను వినియోగించాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరారు.
పారిశ్రామిక ప్రాంతాల్లో ఎప్పుడైనా అపాత పరిస్థితుల్లో ఉపయోగపడేలా అంబులెన్స్‌లు ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వం తరఫున అవసరమైన సహాయాన్ని అందించేందుకు సిద్దంగా ఉన్నామని తెలిపారు. “ఇది రాజకీయాల సమయం కాదు” అంటూ ఘాటుగా స్పందించిన కిషన్ రెడ్డి, బాధితులకు న్యాయం చేయడం ప్రాధాన్యమని స్పష్టం చేశారు.
కాగా, సిగాచి రసాయన పరిశ్రమలో పేలుడు మృతుల సంఖ్య మంగళవారం అర్ధరాత్రి సమయానికి 46కి చేరింది. శిథిలాల కింద మంగళవారం సాయంత్రానికి మరో 16 మృతదేహాలను వెలికితీశారు. మరోవైపు.. ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నవారిలో ఐదుగురు చనిపోయినట్లు తెలిసింది. తీవ్రగాయాలతో ఆస్పత్రుల్లో ఉన్న 30 మందిలో ఐదుగురి పరిస్థితి విషమంగా, మరో ఐదుగురి పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్టు సమాచారం. ఇక ప్రమాదం జరిగిన సమయంలో అక్కడున్నవారిలో 14 మంది ఆచూకీ మంగళవారం సాయంత్రం వరకూ తెలియరాలేదు.
More Stories
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఏబీవీపీ ఘనవిజయం
తెలంగాణ రాజకీయాల్లో శూన్యత .. భర్తీకి బిజెపి సిద్ధం
తెలుగు రాష్ట్రాల్లో లోక్ సత్తాతో సహా 25 పార్టీలపై వేటు