ప్రముఖ ఇంద్రజాలికుడు డా. బీవీ పట్టాభిరాం మృతి

ప్రముఖ ఇంద్రజాలికుడు డా. బీవీ పట్టాభిరాం మృతి

ప్రముఖ మనస్తత్వవేత్త డాక్టర్ బీవీ పట్టాభిరాం (75) కన్నుమూశారు. సోమవారం రాత్రి 10.30 గంటల సమయంలో గుండెపోటు రావడంతో బంజారాహిల్స్ ఒమేగా ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ఆయన చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు. ఆయన ప్రముఖ ఇంద్రజాలికుడిగా, మానసిక వైద్యుడిగానూ ప్రసిద్ధి. ఆయనకు భార్య జయ, కుమారుడు ప్రశాంత్‌ ఉన్నారు. పట్టాభిరామ్‌ భార్య కూడా వ్యక్తిత్వ వికాస నిపుణురాలిగా పేరు పొందారు.

పట్టాభిరామ్‌ పార్థివదేహానికి బుధవారం మధ్యాహ్నం 3 గంటలకు జూబ్లీహిల్స్‌లోని మహాప్రస్థానంలో అంత్యక్రియలు జరగనున్నాయి.  బీవీ పట్టాభిరామ్‌, తూర్పుగోదావరి జిల్లాకు చెందిన ‘రావ్ సాహెబ్’ భావరాజు సత్యనారాయణ సంతానంలోని 15 మందిలో ఒకరు. కౌమారదశలో కాలి వైకల్యంతో కలిగిన ఆత్మన్యూనతా భావాన్ని జయించి తనని తాను ఇంద్రజాలికుడిగా, రచయితగా తీర్చిద్దుకున్నారు. 

కాకినాడలో ఉన్నత విద్య చదువుతున్న రోజుల్లో ఎంబేర్‌ రావు అనే ఇంద్రజాలికుడి నుంచి ఆ విద్యను నేర్చుకున్నారు. ఆ తర్వాత హైదరాబాద్‌లోని ఆహార సంస్థలో ఉద్యోగం చేసే రోజుల్లోనూ సాధన చేసేవారు. 1970 దశకం నాటికి స్వతంత్రంగా రెండు మూడు గంటలపాటు ప్రేక్షకులను కదలనీయకుండా ఇంద్రజాలం ప్రదర్శించే స్థాయికి పట్టాభిరామ్‌ ఎదిగారు.

1984లో హైదరాబాద్‌లో కళ్లకు గంతలు కట్టుకుని రవీంద్రభారతి నుంచి చార్మినార్‌ వరకు స్కూటర్‌ నడిపి ఇంద్రజాల విద్యలో తెలుగునేలపై కొత్త అధ్యాయాన్ని రచించారు. చేతబడి వంటి మూఢనమ్మకాలపై ప్రజలను జాగృతం చేసే కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహించారు. హిప్నాటిజాన్ని ప్రచారంలోకి తీసుకొచ్చి పలు రుగ్మతలను పోగొట్టవచ్చని నిరూపించారు. 

అప్పటి సీఎం ఎన్టీఆర్‌ ప్రోత్సాహంతో ఇంద్రజాలాన్ని జోడించి ప్రభుత్వ పథకాలకు, మద్యపాన నిషేధం వంటి కార్యక్రమాలకు ప్రచారం కల్పించారు. గోదావరి వరదల సమయంలో బాధితుల కోసం ప్రదర్శనలు ఇచ్చి మానవత్వాన్ని చాటుకున్నారు. దూరదర్శన్‌లో కొన్ని సీరియళ్లతో పాటు పలు సినిమాల్లోనూ నటించారు. 

జంధ్యాల దర్శకత్వంలో రూపొందిన ‘రెండురెళ్లు ఆరు’లోనూ డాక్టర్‌ పట్టాభిరామ్‌గానే కనిపించారు. ఈ క్రమంలో సినీ ప్రముఖులు శోభన్ బాబు, అక్కినేని నాగేశ్వరరావు, జయసుధ, జయప్రద, రాజేంద్ర ప్రసాద్ తదితరులు ఆయనకు అభిమానులుగా మారిపోయారు.  దూరదర్శన్‌లో అనేక మేజిక్‌ షోలు ప్రసారమయ్యాయి. 1990లలో పలు పత్రికలో ‘బాలలకు బంగారుబాట’ అనే శీర్షికలో అనేక మంది ప్రపంచ ప్రముఖుల జీవితచరిత్రల గురించి వ్యాసాలు రాశారు. బాలజ్యోతి అనే బాలల పత్రికలో ‘మాయావిజ్ఞానం’ పేరిట వ్యాసాలు రాశారు.