
అమర్నాథ్ యాత్ర ప్రారంభమైంది. మొదటి బ్యాచ్ ప్రయాణికులు బుధవారం ఉదయం తమ యాత్రను మొదలుపెట్టింది. జమ్ముకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా జెండా ఊపి ప్రారంభించారు. అంతకుముందు యాత్రి నివాస్‌లో ఆయన ప్రత్యేక ప్రార్థనలు చేపట్టారు. ఆ సమయంలో ‘హర్ హర్ మహాదేవ్, బం బం భోలే’ నినాదాలతో ప్రార్థన ప్రాంగణం మార్మోగింది.
అమర్నాథ్ యాత్ర పహల్గాం, బాల్తాల్ మార్గాల మధ్య జరుగుతుంది. భద్రతా కారణాల దృష్ట్యా యాత్రికులు ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని, సంతోషంగా దర్శనం జరుపుకోవాలని ఆయన అభయమిచ్చారు. అమర్నాథ్ యాత్రకు తొలిరోజే జమ్మూ రైల్వే స్టేషన్ పరిధిలోని సరస్వతీ ధామ్ రిజిస్ట్రేషన్ కేంద్రం వద్ద భక్తులు అధిక సంఖ్యలో గుమిగూడారు. ‘బంబం బోలే’, ‘జై బాబా బర్ఫానీ’ అన్న నినాదాలతో రిజర్వేషన్ కేంద్రం మార్మోగింది.
పహల్గాం ఉగ్రదాడి తర్వాత భద్రతా కారణాల దృష్ట్యా జమ్మూకశ్మీర్ డీజీపీ నళిన్ ప్రభాత్ అనంతనాగ్లో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. అనంతరం నున్వాన్, చందన్వారీలోని యాత్రా బేస్ క్యాంపులను పరిశీలించారు. శిబిరాలు ఏర్పాటు చేసిన ప్రదేశాలలో భద్రతా ఏర్పాట్లను సమీక్షించారు. యాత్రను సజావుగా సాగడానికి అందుబాటులో ఉన్న లాజిస్టిక్స్, మౌలిక సదుపాయాలను వినియోగించుకోవాలని అధికారులకు పలు సూచనలు చేశారు.
భగవతి నగర్ బేస్ క్యాంప్‌లో మాక్ డ్రిల్ నిర్వహించారు. ఇందులో సీఆర్పీఎఫ్, బీఎస్ఎఫ్, ఐటీబీపీ, ఆర్మీ, ఎన్డీఆర్ఎఫ్, టెలికమ్యూనికేషన్, అగ్నిమాపక సిబ్బంది, అత్యవసర సేవలకు సంబంధించిన సీనియర్ అధికారులు పాల్గొన్నారు. జమ్మూకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా సోమవారం పంథా చౌక్‌లో అమర్‌నాథ్ పుణ్యక్షేత్ర బోర్డు ‘యాత్రి నివాస్’ను ప్రారంభించారు. విరాళాల ద్వారా నిర్మితమైన ఈ నివాస్ దాదాపు 1300 మంది యాత్రికులకు వసతి సౌకర్యం కల్పిస్తుందని తెలిపారు. బోర్డు సభ్యుడు ముఖేష్ గార్గ్కి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
యాత్రికులకు సేవలు అందించడంలో బోర్డు నిరంతరం కృషి చేస్తుందని చెప్పారు. “ఈ యాత్రి నివాస్ బాబా బర్ఫానీ భక్తులకు మెరుగైన సౌకర్యాలను అందించడంలో సహాయపడుతుంది. యాత్రను మరింత సౌకర్యవంతంగా సురక్షితంగా కొనసాగించడంలో తోడ్పడుతుంది. యాత్రి నివాస్ రెండో దశ నిర్మాణం త్వరలో ప్రారంభమవుతుంది. ఇది మా నిబద్ధతకు చిహ్నం” అని మనోజ్ సిన్హా పేర్కొన్నారు.
దక్షిణ కశ్మీర్‌లోని 3,880 మీటర్ల ఎత్తైన అమర్నాథ్ క్షేత్రాన్ని సందర్శించేందుకు జరిగే 38 రోజుల యాత్ర జూలై 3న రెండు మార్గాల నుంచి ప్రారంభమవుతుంది. అనంతనాగ్ జిల్లాలోని 48 కి.మీ సాంప్రదాయ నున్వాన్-పహల్గామ్ ట్రాక్, గండేర్బల్ జిల్లాలోని 14 కి.మీ ఏటవాలుగా ఉన్న బాల్టాల్ మార్గం. జూలై 2న జమ్మూలోని భగవతి నగర్ బేస్ క్యాంప్ నుంచి యాత్రికుల మొదటి బ్యాచ్ బయలుదేరుతుంది.
More Stories
చిప్స్ ఐనా, ఓడలైనా స్వావలంబన తప్ప మార్గం లేదు
టీ20లో వేగంగా 100 వికెట్ల తీసిన బౌలర్‌గా అర్షదీప్
సామ్ పిట్రోడా పాకిస్థాన్ వ్యాఖ్యలపై రాజకీయ చిచ్చు