‘సార్క్’కు పోటీగా పాక్, చైనా కొత్త ప్రాంతీయ కూటమి?

‘సార్క్’కు పోటీగా పాక్, చైనా కొత్త ప్రాంతీయ కూటమి?
భారతదేశం కీలక సభ్యదేశంగా ఉన్న సార్క్‌(దక్షిణాసియా ప్రాంతీయ సహకార సంఘం)కు ప్రత్యామ్నాయంగా మరో కూటమిని ఏర్పాటు చేసేందుకు చైనా, పాకిస్థాన్‌, బంగ్లాదేశ్‌ ప్రయత్నిస్తున్నాయి. పాకిస్థాన్‌కు చెందిన ‘ది ఎక్స్‌ప్రెస్‌ ట్రైబ్యూన్‌’ కథనం మేరకు ఈ విషయంలో పాక్‌, చైనా చర్చలు కీలక దశకు చేరుకున్నాయి. ఇదే అంశంపై చైనాలోని కున్మింగ్‌లో జూన్‌ 19న నిర్వహించిన సమావేశంలో బంగ్లాదేశ్‌ కూడా భాగస్వామ్యమైంది.

పాక్ దౌత్యవర్గాలే తమకు ఈ సమాచారాన్ని అందించాయని ఆ పత్రిక వెల్లడించింది. కొత్త ప్రాంతీయ కూటమి ఏర్పాటుపై పాక్, చైనాలు ప్రస్తుతం అత్యున్నత స్థాయి చర్చలు జరుపుతున్నాయని ఆ వార్తా నివేదిక తెలిపింది. దక్షిణాసియా దేశాల ఐకమత్యాన్ని పెంపొందించేందుకు కొత్త ప్రాంతీయ కూటమి అవసరమనే బలమైన భావనతో పాక్, చైనాలు ఉన్నాయని పేర్కొంది. 

1985 డిసెంబరు 8న ఏర్పాటైన సార్క్ కూటమిలో వ్యవస్థాపక దేశాలుగా భారత్, పాకిస్థాన్, బంగ్లాదేశ్, భూటాన్, మాల్దీవ్స్, నేపాల్, శ్రీలంక ఉన్నాయి. 2007లో ఇందులో అఫ్గానిస్థాన్​ చేరింది. సార్క్‌లోని దేశాలన్నింటినీ నూతన కూటమిలోకి ఆహ్వానించాలని యోచిస్తున్నట్లు ఆ వార్తా కథనంలో ప్రస్తావించారు. శ్రీలంక, మాల్దీవ్స్, ఆఫ్ఘనిస్తాన్ ఈ కూటమిలో చేరే అవకాశం ఉందని పేర్కొన్నారు. 

భారత్‌కు కూడా ఆహ్వానం అందుతుందన్నారు. దక్షిణాసియా దేశాలు పరస్పర వాణిజ్యాన్ని మెరుగుపర్చుకోవడం, మౌలిక వసతులతో అనుసంధానాన్ని పెంచుకోవడం అనేది నూతన కూటమి లక్ష్యమని ఆ కథనంలో రాసుకొచ్చారు. చివరిసారిగా 2014లో నేపాల్‌లోని ఖాట్మండులో సార్క్ సదస్సు జరిగింది.  2016లో పాక్‌లోని ఇస్లామాబాద్ వేదికగా సార్క్ సదస్సు జరగాల్సి ఉండగా, ఆ ఏడాది సెప్టెంబరు 18న భారత్‌లోని యురిలో ఉన్న ఆర్మీ క్యాంప్‌పై ఉగ్రదాడి జరిగింది. దీంతో ఆ సదస్సుకు భారత్ గైర్హాజరైంది.

బంగ్లాదేశ్, భూటాన్, అఫ్గానిస్థాన్ కూడా సదస్సుకు రాలేమని చెప్పాయి. దీంతో సదస్సును వాయిదా వేస్తున్నట్లు పాక్ ప్రకటించింది. మళ్లీ ఇప్పటి వరకు సార్క్ సదస్సు జరగలేదు. అందుకే సార్క్‌కు ప్రత్యామ్నాయ కూటమిని తెచ్చేందుకు పాక్, చైనా కసరత్తు చేస్తున్నాయని కథనంలో వివరించారు.  అయితే చైనా, పాకిస్థాన్‌తో తాము చేతులు కలపనున్నట్లు వచ్చిన వార్తలను బంగ్లాదేశ్‌ ఆపద్ధర్మ ప్రభుత్వం తోసిపుచ్చింది.

తాము ఎటువంటి పొత్తు కుదుర్చుకోవడం లేదని బంగ్లాదేశ్‌ విదేశీ వ్యవహారాల సలహాదారుడు ఎంటీ తౌహీద్‌ సోమవారం స్పష్టం చేశారు. “దక్షిణాసియా దేశాలతో నూతన ప్రాంతీయ కూటమి ఏర్పాటు కాబోతోందనే ప్రచారం అవాస్తవం. ఇటీవలే జరిగిన చైనా, పాక్, బంగ్లాదేశ్ త్రైపాక్షిక సమావేశానికి రాజకీయాలతో సంబంధం లేదు. ఆ సమావేశంలో నూతన కూటమి ప్రతిపాదనేదీ రాలేదు” అని తౌహీద్ హుస్సేన్ స్పష్టం చేశారు.