
భారత్-అమెరికా మధ్యంతర వాణిజ్య ఒప్పందాన్ని జులై 8 నాటికి ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఒప్పందానికి సంబంధించిన అన్ని నిబంధనలను ఇరుపక్షాలూ అంగీకరించినట్లు ప్రభుత్వ వర్గాల సమాచారం. రెండోసారి అమెరికా అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన డొనాల్డ్ ట్రంప్ అన్ని దేశాలపై అదనపు సుంకాలు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ అదనపు సుంకాలకు గడువు జులై 8 వరకూ నిర్ణయించారు.
అంతలోపు ఆయా దేశాలు మధ్యంతర వాణిజ్య ఒప్పందం కుదుర్చు కోవాల్సి ఉంటుంది. లేదంటే, జులై 9 నుంచి అదనపు సుంకాలు వడ్డిస్తారు. దీంతో అమెరికాతో ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం చేసుకోవాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. అయితే, అదనపు సుంకాల నుంచి మినహాయింపు ఇవ్వాలని భారత్ గత కొంతకాలంగా అగ్రరాజ్యాన్ని కోరుతోంది. అదే సమయంలో కొన్నింటిపై సుంకాల భారాన్ని తగ్గించాలని అమెరికా కూడా భారత్‌కు విజ్ఞప్తి చేస్తోంది.
ఈ క్రమంలో ఇటీవలే కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ అమెరికా వాణిజ్య మంత్రి హోవార్డ్ లుట్నిక్‌తో సమావేశమయ్యారు. రెండు దేశాలు పరస్పరం లాభదాయకమైన వాణిజ్య ఒప్పందాన్ని కుదుర్చుకునే దిశగా చర్చలు జరిపారు. ఇరు దేశాల మధ్య ప్రతిపాదిత ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందంపై చర్చలు జరిపారు. ఈ చర్చలు తాజాగా ఓ కొలిక్కి వచ్చినట్లు తెలిసింది.మరోవైపు ఇప్పటికే చైనాతో అమెరికా వాణిజ్య ఒప్పందం కుదుర్చుకున్న విషయం తెలిసిందే. చైనాతో వాణిజ్య ఒప్పందం కుదిరిందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇటీవలే ప్రకటించారు. దీనిని చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్, తాను ఆమోదించవలసి ఉందని ట్రూత్ సోషల్ పోస్ట్‌లో తెలిపారు. ఇరు దేశాల ప్రతినిధులు లండన్‌లో రెండు రోజులపాటు జరిపిన చర్చలు ముగిసిన అనంతరం ఆయన ఈ పోస్ట్ చేశారు. ఫుల్ మేగ్నెట్స్, అవసరమైన రేర్ ఎర్త్ మినరల్స్‌ను చైనా ఎగుమతి చేస్తుందని చెప్పారు. చైనా విద్యార్థులు అమెరికాలోని విశ్వవిద్యాలయాలు, కళాశాలల్లో చదువుకోవచ్చునని, అది తనకు సంతోషకరమని తెలిపారు.
కాగా, భారత ఉత్పత్తులపై అమెరికా ఇప్పటికే 10 శాతం టారిఫ్ విధిస్తున్న విషయం తెలిసిందే. అయితే, అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత ట్రంప్ భారత్ సహా పలు దేశాలపై అదనపు సుంకాలను ప్రకటించారు. ఏప్రిల్ 2న మన దేశంపై ట్రంప్ 26 శాతం అదనపు సుంకాన్ని విధిస్తున్నట్లు ప్రకటించారు. అయితే, అదనపు సుంకాలను జులై 9 వరకూ నిలిపివేస్తున్నట్లు ట్రంప్ యంత్రాంగం గతంలోనే ప్రకటించింది. ఈ అదనపు 26 శాతం సుంకం నుంచి పూర్తిగా మినహాయింపు ఇవ్వాలని భారత్ కోరుతోంది.
More Stories
భారీ సైబర్ దాడితో నిలిచిపోయిన పలు దేశాల విమానాశ్రయాలు
హెచ్-1బీ వీసా రుసుం పెంచడంతో టెక్ సంస్థలు అప్రమత్తం
హిండెన్‌బర్గ్ ఆరోపణలపై అదానీకి సెబీ క్లీన్చిట్