ఇండో-పసిఫిక్‌లో భారత్‌ వ్యూహాత్మక మిత్రదేశం

ఇండో-పసిఫిక్‌లో భారత్‌ వ్యూహాత్మక మిత్రదేశం

ఇండో-ఫసిఫిక్‌ ప్రాంతంలో భారత్‌ కీలకమైన వ్యూహాత్మక మిత్రదేశమని అమెరికా పేర్కొంది. వైట్‌హౌస్‌ ప్రెస్‌ సెక్రటరీ కరోలిన్‌ లెవిట్‌ విలేకరుల సమావేశంలో  ఇండో-పసిఫిక్‌లో చైనా పెరుగుతున్న పాత్రను అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎలా భావిస్తున్నారని ప్రశ్నించగా భారత్‌ ఇండో-పసిఫిక్‌లో చాలా ముఖ్యమైన వ్యూహాత్మక భాగస్వామి, అధ్యక్షుడు ట్రంప్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి చాలా సన్నిహిత సంబంధాలు ఉన్నాయని, ఇది భవిష్యత్‌లోనూ కొనసాగుతాయని ఆమె స్పష్టం చేశారు.

ఇండో-పసిఫిక్ భద్రతను నిర్ణయించే కీలక భాగస్వామిగా భారత్ ఉందని కెరోలైన్ పేర్కొన్నారు. “ఇండో-పసిఫిక్ ప్రాంతంలో అమెరికాకు భారత్ అత్యంత వ్యూహాత్మకమైన భాగస్వామి. అధ్యక్షుడు ట్రంప్‌నకు ప్రధానమంత్రి మోదీతో వ్యక్తిగతంగా చాలా మంచి అనుబంధం ఉంది. అది భవిష్యత్తులో కూడా కొనసాగుతుంది” అని ఆమె పేర్కొన్నారు. భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ అమెరికా పర్యటనలో ఉన్న సమయంలో వైట్ హౌస్ ఈ ప్రకటన చేయడం గమనార్హం.

ఐక్యరాజ్యసమితిలో “ది హ్యూమన్ కాస్ట్ ఆఫ్ టెర్రరిజం” అనే ఎగ్జిబిషన్‌కు హాజరయ్యేందుకు ఆయన అమెరికాకు వెళ్లారు. ఆపరేషన్‌ సిందూర్‌ తర్వాత అమెరికాతో భారత్‌ సంబంధాలు కొంత వరకు దెబ్బతిన్నాయన్న వార్తలు వచ్చాయి.  భారత్‌-పాక్‌ వివాదంలో మూడో దేశం మధ్యవర్తిత్వం వహించలేదని ప్రధాని మోదీ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే, ట్రంప్‌ పలుసార్లు కాల్పుల విరమణకు తానే ఒప్పించానని వ్యాఖ్యానించారు.

అదే సమయంలో ట్రంప్ ఇటీవల పాకిస్తాన్ ఆర్మీ జనరల్ అసిమ్ మునీర్‌ను వైట్ హౌస్‌లో భోజనానికి ఆహ్వానించారు. ఇది ట్రంప్ పరిపాలన ఉద్దేశాలపై పలు ప్రశ్నలను లేవనెత్తింది. కరోలిన్‌ లెవిట్‌ను భారత్‌తో వాణిజ్య ఒప్పందం కుదిరిందా? త్వరలోనే జరుగుతుందా? అని ప్రశ్నించగా భారత్‌తో వాణిజ్య ఒప్పందానికి తాము చాలా దగ్గరలో ఉన్నామని అధ్యక్షుడు ట్రంప్ గత వారం దీనిపై ప్రకటన చేశారని ఆమె గుర్తు చేశారు. 

“‘భారత్‌తో వాణిజ్య ఒప్పందం తుదిదశలో ఉందని అధ్యక్షుడు గత వారం చెప్పారు. నేను కూడా కామర్స్ సెక్రటరీతో జరిగిన చర్చలను చూశాను. ఒప్పందాలు తుది దశకు చేరాయి. త్వరలోనే అధ్యక్షుడు ట్రంప్, ఆయన వాణిజ్య బృందం నుంచి అధికారిక ప్రకటన వస్తుంది” అని ఆమె వెల్లడించారు.

ఇదిలా ఉండగా, ఈ ఏడాది చివరిలో క్వాడ్ శిఖరాగ్ర సమావేశం ఢిల్లీలో జరగనుంది. దీనికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్​ను ప్రధానమంత్రి మోదీ ఆహ్వానించగా అంగీకరించారు. మోదీ ఆహ్వానం మేరకు ఈ ఏడాది చివరలో భారత్‌లో జరగనున్న క్వాడ్ సమ్మిట్‌కు ట్రంప్ హాజరుకానున్నారు.