బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవికి తనను నామినేషన్ దాఖలు చేయనీయకుండా అడ్డుకున్నారని ఆరోపిస్తూ గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ బిజెపికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించిన వ్యవహారంపై ఆ పార్టీ అగ్ర నాయకత్వం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఆయన రాజీనామాను ఆమోదించడం లేదా పార్టీ నుంచి సస్పెండ్ చేసే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు.
ఇప్పటికే బీజేపీ కీలక నేతలు సునీల్ బన్సాల్, అభయ్ పాటిల్ రంగంలోకి దిగి నచ్చచెప్పే ప్రయత్నం చేసినా రాజాసింగ్ ధిక్కార ధోరణి ప్రదర్శించడం, అసందర్భమైన ఆరోపణలు చేయడంతో పార్టీ నాయకత్వం సీరియస్ గా ఉన్నట్లు కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో జాతీయ నాయకత్వానికి రాజసింగ్ రాజీనామా లేఖను రాష్ట్ర నాయకత్వం పంపించాలని నిర్ణయించింది.
ఇక పార్టీ అధ్యక్ష ఎన్నికల వేళ ఆయన నామినేషన్ అడ్డుకోవాలనుకుంటే తాము నామినేషన్ పత్రాలే రాజాసింగ్‌కు ఇచ్చే వారం కాదని స్పష్టం చేస్తున్నారు.
బిజెపి రాష్ట్ర అధ్యక్ష ఎన్నిక ప్రక్రియ పార్టీ నియమావళికి అనుగుణంగానే జరుగుతోందని శాసనసభ ఉపనేత పాయల్ శంకర్ స్పష్టం చేశారు. రాష్ట్ర అధ్యక్ష ఎన్నికలో మిగతావారికి నామినేషన్ అవకాశం ఇవ్వలేదని కొన్ని వర్గాలు, మీడియాలో వచ్చిన వార్తలను ఆయన పూర్తిగా ఖండించారు.
రాజా సింగ్ చేసిన ఆరోపణల్లో వాస్తవం లేదని రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీమతి రాణి రుద్రమ స్పష్టం చేశారు. ఆయన క్రమశిక్షణ రాహిత్యం పరాకాష్టు చేరిందంటూ రాజాసింగ్‌పై మండిపడ్డారు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలనుకుంటే అసెంబ్లీ స్పీకర్‌కు అందుకు సంబంధించిన లేఖను అందజేయాలని ఆమె పేర్కొంటూ బీజేపీకి వ్యక్తుల కంటే పార్టీనే ముఖ్యమని తేల్చి చెప్పారు.
పార్టీ అధ్యక్షులకు ఇచ్చిన రాజీనామా లేఖను జాతీయ అధ్యక్షుడికి పంపిస్తున్నామని రాణి రుద్రమ వెల్లడించారు. సోమవారం గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ రాష్ట్ర పార్టీ అధ్యక్ష ఎన్నికల్లో నామినేషన్ దాఖలు చేయడానికి బిజెపి రాష్ట్ర కార్యాలయానికి వచ్చారని, నామినేషన్ పత్రాన్ని కేంద్ర మంత్రి, సంస్థాగత ఎన్నికల రిటర్నింగ్ అధికారి శోభా కరంద్లాజే నుండి తీసుకున్నారని ఆమె చెప్పారు.
ఈ సందర్భంగా బిజెపి రాష్ట్ర ఇన్‌ఛార్జ్ అభయ్ పాటిల్ గారితో రాజాసింగ్ తో మాట్లాడారని చెబుతూ అప్పుడు అభయ్ పాటిల్ ఇది ప్రజాస్వామ్యబద్ధంగా నడిచే పార్టీ కాబట్టి ఎవరైనా నామినేషన్ వేయొచ్చని స్పష్టం చేశారని ఆమె తెలిపారు. అయితే పార్టీ నియమావళి ప్రకారం, నామినేషన్ ఫారం చెల్లుబాటయ్యేందుకు పది మంది రాష్ట్ర కౌన్సిల్ సభ్యుల సంతకాలు తప్పనిసరని, ఈ విషయాన్ని రాజాసింగ్ కు రిటర్నింగ్ అధికారులే చెప్పారని ఆమె వివరించారు.
మీకు 10 మంది సభ్యుల సంతకాలు అవసరం అని చెబుతూ వాటితో కూడిన నామినేషన్ దాఖలు చేయమని వారు సూచించగా, రాజాసింగ్ గారు బయటకు వచ్చి సంతకం చేయడానికి 10 మంది సభ్యులు లేకపోవడంతో పార్టీని బద్నాం చేసేలా అబద్ధాలు చెప్పారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. తనకు పార్టీ రాజాసింగ్ గారికి నామినేషన్ వేసే అవకాశం ఇవ్వలేదని చెబుతూ పార్టీపై అభాండాలు వేసే ప్రయత్నం చేశారని ఆమె విమర్శించారు. ఆ తర్వాత రాజాసింగ్ బిజెపి రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డికి రాజీనామా పత్రాన్ని సమర్పించారని, ఆ రాజీనామా పత్రాన్ని జాతీయ పార్టీకి పంపిస్తామని ఆమె చెప్పారు.
More Stories
నేపాల్ తాత్కాలిక ప్రధానిగా సుశీల కర్కిని ఒప్పించిన ఆర్మీ చీఫ్
పాక్ కు చైనా, ఐరోపా, యుఎఈ, అమెరికాల నిఘా యంత్రాలు
ఓ ఉగ్రవాది అరెస్టుతో ఉలిక్కిపడ్డ బోధన్