తెలంగాణాలో బిజెపిని అధికారంలోకి తీసుకురావడమే

తెలంగాణాలో బిజెపిని అధికారంలోకి తీసుకురావడమే
 
తెలంగాణాలో బిజెపిని అధికారంలోకి తీసుకు రావడమే మనందరి లక్ష్యం అని భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర శాఖ నూతన అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం ఎన్.రాంచందర్ రావు తెలిపారు.  రాష్ట్ర బిజెపి అధ్యక్షునిగా ఏకగ్రీవంగా ఎన్నికైన్నట్లు ప్రకటించిన అనంతరం కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి నుండి పార్టీ అధ్యక్ష పదవి స్వీకరిస్తూ జనసంఘ్ నుంచి భారతీయ జనతా పార్టీ వరకు అనేక దశల్లో కార్యకర్తల త్యాగాలు, నిరంతర శ్రమ ఫలితంగా బిజెపి దేశంలో అతిపెద్ద, బలమైన పార్టీగా ఎదిగింని, క్రమశిక్షణ, సిద్ధాంతం పట్ల నిబద్ధతతో ఈ స్థాయికి వచ్చామని గుర్తు చేశారు.  
ఈ సందర్భంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కర్నూలులో బిజెపి ఏర్పడే ముందు, జనసంఘ్ పోటీచేసిన అభ్యర్థికి  దాదాపు వెయ్యి ఓట్లు రావడంతో కార్యకర్తలు పార్టీ కార్యాలయం ముందు బాణసంచా కాల్చి సంబరాలు జరుపుకున్నరని చెబుతూ  అప్పట్లో జనసంఘ్ నాయకులని ఆ సంబరాలపై ప్రశ్నించగా “గత ఎన్నికల్లో 300 ఓట్లు వచ్చాయి, ఈసారి వెయ్యి వచ్చాయి. పార్టీ ఎదుగుతోంది. బలోపేతమవుతోంది. అందుకే ఈ ఆనందం” అంటూ ఆత్మవిశ్వాసం వ్యక్తం చేశారని చెప్పారు.

అలాంటి స్థితి నుంచి ఈరోజు బిజెపి తెలంగాణలో 8 మంది లోక్‌సభ సభ్యులు, 8 మంది ఎమ్మెల్యేలు, ఒక రాజ్యసభ సభ్యుడు, ముగ్గురు ఎమ్మెల్సీలు ఉన్న స్థాయికి ఎదగడం గర్వకారణం అని తెలిపారు. ఈరోజు బిజెపి ఈ స్థాయికి వచ్చిందంటే, దానికి కార్యకర్తల త్యాగాలు, నాయకుల కృషి, శ్రమ కారణం అని స్పష్టం చేశారు.  డీఎస్పీ రెడ్డి, చలపతి రావు, వి. రామారావు, బండారు దత్తాత్రేయ, విద్యాసాగర్ రావు , డాక్టర్ కె. లక్ష్మణ్ , కిషన్ రెడ్డి, బండి సంజయ్ వంటి వారు రాష్ట్ర అధ్యక్షులుగా పనిచేశారని, బిజెపి పార్టీ ఎదుగుదలలో ఇంతమంది రాష్ట్ర అధ్యక్షుల, నాయకుల కృషి, శ్రమ ఉందని చెప్పారు.

గత 11 సంవత్సరాలుగా నరేంద్ర మోదీ  నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం పరిపాలిస్తోందని, ఆయనతోపాటు అమిత్ షా, జేపీ నడ్డా గరు, బీఎల్ సంతోష్  ఆశీర్వాదం కూడా మనకు లభిస్తోందని పేర్కొన్నారు. 14 కోట్ల సభ్యులతో ప్రపంచంలోనే అతిపెద్ద రాజకీయ పార్టీ అయిన బిజెపిలో తెలంగాణ రాష్ట్ర శాఖకు అధ్యక్షుడిగా ఎన్నికవడాన్నితాను గర్వంగా భావిస్తున్నట్లు తెలిపారు.

గతంలో నల్లగొండ జిల్లాలో మైసయ్య గౌడ్ అనే కార్యకర్తను నక్సలైట్లు హత్య చేశారని చెబుతూ ఉస్మానియా విశ్వవిద్యాలయంలో కృష్ణవర్ధన్ రెడ్డి, చంద్రారెడ్డి నక్సలైట్ల బుల్లెట్లకు బలయ్యారని గుర్తు చేశారు. నేటి బిజెపి నాయకులు మనోహర్ రెడ్డి, కాసం వెంకటేశ్వర్లు, దుగ్యాల ప్రదీప్ కుమార్, ధర్మారావు, తాను  అందరం కలిసి నక్సలైట్లతో పోరాడి ఏబీవీపీని గెలిపించుకున్నామని, ఉస్మానియా యూనివర్సిటీలో ఏబీవీపీని గొప్ప స్థాయిలో నిలబెట్టామని వివరించారు.

బిజెపి అనేది క్యాడర్ బేస్డ్ పార్టీ, మాస్ బేస్డ్ పార్టీ, ఐడియాలజికల్ బేస్డ్ పార్టీ అంటూ  తెలంగాణలో గోల్కొండ ఖిల్లాపై బిజెపి జెండా ఎగురవేయాలంటే ప్రతి కార్యకర్త కష్టపడి పనిచేయాలని రాంచందర్ రావు  పిలుపిచ్చారు. బిజెపిలో కొత్త, పాత అనే తేడా ఉండదని, మన ఇంట్లో బాబు పుట్టినా, పాప పుట్టినా పుట్టిన రోజునుంచే వారు కుటుంబసభ్యులవుతారని, అదే బిజెపిలోనూ వర్తిస్తుందని స్పష్టం చేశారు.  నది ప్రవహించాలి. కొత్తనీరు రావాలి. కొత్తవాళ్లు, పాతవాళ్లు కలిసి బిజెపిని బలోపేతం చేయాలని హితవు చెప్పారు.

తెలంగాణ యువత రాజకీయాల్లోకి రావాలని, యువతలో ఉన్న చైతన్యాన్ని బిజెపి లోకి తేవాలని, యువకులు, మహిళలు బిజెపి లో చేరాలని ఆయన పిలుపిచ్చారు. బిజెపి వైపు రాష్ట్ర ప్రజలు చూస్తున్నారని చెబుతూ పంచాయత్ నుంచి పార్లమెంట్ వరకూ బిజెపి గెలవాలని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ పార్టీ వాట్సాప్ యూనివర్సిటీతో, కాంగ్రెస్ పార్టీ ఫేక్ న్యూస్ యూనివర్సిటీతో ట్రోలింగ్ చేస్తోందని ధ్వజమెత్తారు.

ట్రోలింగ్ చేసేవారు చేసుకుంటారు. కానీ రాంచందర్ రావు అనే వ్యక్తి సౌమ్యుడు కాదని, 14 సార్లు జైలుకు వెళ్లినవాడినని, సిద్ధాంతం కోసం పోరాడినవాడినని,  విద్యార్థుల కోసం లాఠీచార్జ్ లు ఎదుర్కొన్నానని పేర్కొంటూ  పోలీసులు చేసిన లాఠీచార్జ్ లో తన చేయి విరిగిందని గుర్తు చేశారు.  సిద్ధాంతం కోసం, కార్యకర్తల కోసం త్యాగం చేయడానికి  తాను సిద్ధంగా ఉన్నానని పేర్కొంటూ అగ్రెసివ్ అంటే సిద్ధాంతంపై నమ్మకంతో ముందుకు వెళ్లడం అని తెలిపారు.

కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై ప్రజాస్వామ్యబద్ధంగా పోరాటం చేస్తానని తేల్చి చెప్పారు. విద్యార్థి దశ నుంచే అనేక పోరాటాలు చేశానని చెబుతూ అడ్వకేట్ల కోసం, విద్యార్థుల కోసం పోరాడానని, ఇప్పుడు తెలంగాణ ప్రజల కోసం పోరాడతానని తెలిపారు. “మీరు “నేను సైతం” అనే భావనతో కలెక్టివ్ లీడర్‌షిప్‌లో నన్ను ఆదరించాలి. నా నిర్ణయాలు వ్యక్తిగతంగా ఉండవు. అందరి నిర్ణయాలు తీసుకుని నేను అమలు చేయబోతున్నాను” అని స్పష్టం చేశారు.

బిజెపికి తెలంగాణలో మంచి భవిష్యత్తు ఉందని చెబుతూ కొందరు సోషల్ మీడియాలో బిజెపి పై, తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని పేర్కొంటూ  దమ్ముంటే తనను ఎదిరించి పోరాడాలని సవాల్ చేశారు. పేరులేని పేపర్లతో సోషల్ మీడియాలో ఫేక్ ప్రచారం చేస్తే వారిపై క్రిమినల్ కేసులు వేసి జైలుకు పంపిస్తామని హెచ్చరించారు.  మనమంతా క్రమశిక్షణతో బిజెపిని ముందుకు తీసుకెళ్లాలని, బిజెపి సిద్ధాంతాన్ని ప్రజలలోకి తీసుకెళ్లాలని, కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న ప్రజావ్యతిరేక విధానాలపై పోరాటం కొనసాగించాలని పార్టీ శ్రేణులకు రాంచందర్ రావు పిలుపిచ్చారు.